'స్మార్ట్‌'గా అన్వేషిద్దాం

రోజులు మారాయి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమస్త సమాచారం ప్రస్తుతం అరచేతిలో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఆన్‌లైన్‌, ఇతర వేదికలపై ప్రకటనలకు తోడు విస్తృతంగా మొబైల్‌ యాప్స్‌ కూడా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే రాణిస్తున్న పలు పోర్టళ్లు ఈ యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చి.. కేవలం మొబైల్‌ ద్వారానే తమకు తగిన ఉద్యోగ అవకాశాలను వెదుక్కొనేందుకు.. వాటికి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఆ యాప్స్‌ ద్వారా ఒకే క్లిక్‌తో ఉద్యోగానికి దరఖాస్తు చేయడంతో పాటు ఆ దరఖాస్తు స్థితిని నిత్యం తెలుసుకొనేందుకూ వెసులుబాటు కలుగుతోంది. ఇలాంటి యాప్స్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లేస్టోర్‌లో కొన్ని వందలున్నాయి. వీటిలో ఒక్కో యాప్‌ ఒక్కో విధంగా ఉంటోంది. చివరకు కొన్ని రకాల ప్రత్యేక ఉద్యోగాలకు కూడా ప్రత్యేకమైన యాప్స్‌ ఉన్నాయి. బ్యాకింగ్‌, ఐటీ తదితర రంగాలకు ప్రత్యేకంగా కొన్ని యాప్స్‌ వచ్చాయి. ఒక్కసారి ప్లేస్టోర్‌లోకి వెళ్తే ఆయా యాప్స్‌లు అందిచే సమాచారం, సౌలభ్యం ఆధారంగా మీకు తగిన యాప్‌ను ఎంచుకోవచ్చు.
ఈ యాప్‌లను మొబైల్లో నిక్షిప్తం చేసుకొనేటపుడు, ఉపయోగించేటపుడు కొన్ని విషయాలను అనుసరించాలి. అన్ని యాప్స్‌ ఆయా వెబ్‌సైట్లకు అనుంబంధంగా ఉంటున్నాయి. మీరు ఒక జాబ్‌ పోర్టల్లో నమోదై ఉంటే.. ఆ పోర్టల్‌కు చెందిన యాప్స్‌లోను పోర్టల్లో వెల్లడించిన వివరాలనే వెల్లడించాలి. అక్కడ ఒక విధంగా యాప్స్‌లో మరో విధంగా వివరాలను ఇవ్వకూడదు. అలాగే యాప్‌ ద్వారా మీరు రెజ్యూమెను అప్‌లోడ్‌ చేసి దరఖాస్తులు పంపుతున్నపుడు పోర్టల్లో ఉన్న రెజ్యూమెను కూడా అప్‌డేట్‌ చేయాలి. లేకుంటే ఆయా పోర్టల్‌ నిర్వాహకులు మీ దరఖాస్తులపై గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎన్ని పోర్టళ్లలో, యాప్స్‌లలో మీ వివరాలను నమోదు చేసినా ఒకే విధంగా ఉండేలా చూసుకోండి. అయితే రెజ్యూమెలను మాత్రం మీరు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి తగినట్లు మార్చుకోవాలి. అన్నింటికీ ఒకే తరహా రెజ్యూమె పనికిరాదు.
అన్ని మొబైల్‌ యాప్స్‌లోనూ మీరు ఎంచుకున్న రంగానికి, మీకు తగిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను పరిశీలించవచ్చు. దీనితో పాటు మీరు ఎంపిక చేసుకొన్న ఉద్యోగాలకు సంబంధించిన అవకాశాలు వస్తే.. ఆ సమాచారం వెంటనే తెలిసేలా 'అలెర్ట్‌'లు కూడా పెట్టుకోవచ్చు. ఈ యాప్‌లు చాలా ఉన్నా వీటిలోనూ కాలానికి తగినట్లు మార్పులు వస్తున్నాయి. దీంతో అన్ని వేళలా ఒకే యాప్‌లు కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని యాప్స్‌ చాలా ప్రత్యేకంగా ఉంటూ ఉద్యోగాలు సాధించేందుకు ఎక్కువ దోహదం చేస్తున్నాయి. అలాంటి యాప్‌ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
లింక్డ్‌ ఇన్‌
ఉద్యోగ అవకాశాల విషయంలో ఎక్కువ మంది ఎంచుకుంటున్న యాప్‌ ఇది. వృత్తిదారుల సామాజిక అనుసంధాన వేదిక లింక్డ్‌ఇన్‌కు ఈ యాప్‌ అనుబంధంగా పని చేస్తుంది. ఈ యాప్‌ ద్వారా కేవలం ఉద్యోగ అవకాశాలను వెదుక్కోవడమే కాకుండా వెబ్‌సైట్‌లో లాగా ఆయా రంగాలకు సంబంధించిన వారిని అనుసరించడంతో పాటు.. నెట్‌వర్కింగ్‌ను పెంచుకోవచ్చు. ఆయా రంగాలు, ప్రొఫైల్‌, జీతం, తదితర అంశాల వారీగా ఇక్కడ ఉద్యోగాలను అన్వేషించవచ్చు. మీ ప్రొఫైల్‌ ద్వారా మీ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చు. తగిన ప్రచారమూ లభిస్తుంది.
బీ నోన్‌
ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ మాన్‌స్టర్‌.కామ్‌ అందుబాటులోకి తెచ్చిన యాప్‌ ఇది. ఈ యాప్‌ ఫేస్‌బుక్‌ టైమ్‌లైన్‌ ఆధారంగా పని చేస్తుంది. ఈ యాప్‌ ద్వారా ఫేస్‌బుక్‌లో మీరు మీ వృత్తిగత అనుభవాలను, ఫ్రొఫైల్‌ను, విద్యార్హతలను పంచుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో ఈ యాప్‌ను వినియోగిస్తున్నపుడు మీ స్నేహితులు, పోస్ట్‌ల వివరాలు ఇతరులకు తెలుస్తాయన్న భయం కూడా అవసరం లేదు. మీ పోస్ట్‌లు, మీ స్నేహితుల వివరాలను తెలియకుండా.. మీ వృత్తి, విద్యార్హతలకు సంబంధించిన విషయాలకు మాత్రమే ఈ యాప్‌ ప్రచారం కల్పిస్తుంది. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన సంస్థలు, వ్యక్తుల వివరాలనూ మీకు అందిస్తుంది.
రియల్‌ టైం జాబ్స్‌
ఈ యాప్‌ ట్విట్టర్‌ ఆధారంగా పని చేస్తుంది. కొన్ని వేల ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్‌ ట్విట్టర్‌ ద్వారా అందిస్తుంది. దీంతో ఆయా ఉద్యోగాలకు రెజ్యూమెను, సంక్షిప్త వీడియోలను కూడా పంపవచ్చు. బీనోన్‌, రియల్‌ టైం జాబ్స్‌ వంటి ఈ యాప్స్‌ను కేవలం మొబైల్లోనే కాకుండా కంప్యూటర్‌లో కూడా వినియోగించవచ్చు. చాలా కొన్ని యాప్స్‌ మాత్రమే మొబైల్‌కి మాత్రమే ప్రత్యేకంగా ఉంటున్నాయి.
షైన్‌.కామ్‌, ఇండీడ్‌, నౌకరీ.కామ్‌, జాబ్‌ స్ట్రీట్‌, జాబ్‌ సెర్చ్‌ వంటి యాప్స్‌ కూడా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. కేవలం జాబ్స్‌కి మాత్రమే కాకుండా రెజ్యూమెను రూపొందించడం, ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాలు, ఉద్యోగ ప్రకటనలు, అలెర్ట్స్‌కి కూడా ప్రత్యేకంగా కొన్ని యాప్స్‌ ఉన్నాయి. ఇప్పడు చేస్తున్న ఉద్యోగ అన్వేషణకు ఈ యాప్స్‌ని ఆధారం చేసుకొంటే తక్కువ సమయంలో ఎక్కువ అవకాశాలు, ఉద్యోగ ప్రకటనలను పొందవచ్చు. ప్లేస్టోర్‌ నుంచి యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకొనేటపుడు వాటిని అందిస్తున్నది ఎవరు.. ఆ సంస్థ వివరాలు ఏంటి వంటి విషయాలను తెలుసుకొని నిక్షిప్తం చేసుకోండి. ఈ వివరాలు తెలుసుకున్నాకే మీకు సంబంధించిన వివరాలు ఇవ్వండి. ఏమాత్రం పరిశీలన లేకుండా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొంటే మీ వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning