పాతచింతకాయ పచ్చడి రాత పరీక్షలకూ, తలతిక్క ప్రశ్నల ఇంటర్వ్యూలకూ, గుడుగుడుగుంచం గ్రూప్‌ డిస్కషన్లకూ కాలం చెల్లిపోయింది. కార్పొరేట్‌ కంపెనీల్లో నియామక ప్రక్రియ కొత్తపుంతలు తొక్కుతోంది.
కత్తిలాంటి ఉద్యోగుల్ని వెతికి పట్టుకోవడం అంటే, కార్పొరేట్‌ సంస్థలకు కత్తిమీద సామే! అభ్యర్థుల ఆకారాల్ని చూసి ఆఫర్‌ లెటర్లు ఇచ్చేస్తే, కంపెనీ కొల్లేరే! ఎవరికివారు ఆపిల్‌ స్టీవ్‌జాబ్స్‌లా పోజులిస్తారు. ఫేస్‌బుక్‌ జుకెర్‌బర్గ్‌లా ఫేషియల్‌ ఎక్స్‌ప్రెషన్లు పెడతారు. 'గూగుల్‌ లారీపేజ్‌దీ ఓ వ్యాపారమేనా! నా దగ్గర లారీలకొద్దీ ఐడియాలున్నా'యంటూ కోతలొకటి. అందులో సగం మంది, ఆండ్రాయిడుకూ పెదరాయుడుకూ తేడా తెలియని బాపతు! పట్టాలు చూసి కొలువిస్తే, రైలు పట్టాల మీద తలపెట్టినట్టే! కొన్నమార్కులో, తెచ్చుకున్న మార్కులో - ఎవరికి తెలుసు! అయినా, అరగంట ఇంటర్వ్యూలో తూకమేసినంత కచ్చితంగా ఎవరైనా ఎలా అంచనా వేస్తారు? ఓ పది ప్రశ్నలకి ఫటాఫట్‌మని జవాబు చెప్పినంత మాత్రాన, తోపుల బ్యాచిలోకి తోసేయడం కుదర్దు. అది బట్టీ సరుకైనా కావచ్చు!
ఆ గోలంతా ఎందుకని, కాస్త సృజనాత్మకతనూ కాస్త అనుభవాన్నీ జోడించి... కార్పొరేట్‌ కంపెనీలు తమదైన విధానాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పుడు, నియామకాలంటే...భాగ్యలక్ష్మీ బంపర్‌ లాటరీ టైపు మల్టిపుల్‌ ఛాయిస్‌ పరీక్షలు కాదు, బట్టతల పెద్దమనుషులు అడిగే అరిగిపోయిన రికార్డు ప్రశ్నలూ, అంతకంటే అరిగరిగిపోయిన సమాధానాలూ కాదు. నిడివి కూడా, ఎవరో తరుముకొస్తున్నట్టు అరగంటో పావుగంటో కాదు. అవసరమైతే రోజంతా గడుపుతారు. ఇంటర్వ్యూ వేదిక, ఒక్కోసారి కాఫీడే కావచ్చు, ఇంకోసారి శివార్లలోని చెట్టునీడా కావచ్చు. తొలిప్రశ్న 'వాటీజ్‌ యువర్‌ లైఫ్‌ యాంబిషన్‌' తరహా సీరియస్‌ అంశం కాకపోనూవచ్చు. 'నీ ఫస్ట్‌ డేటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ చెప్పవోయ్‌' అంటూ సరదాగా సంభాషణ ప్రారంభించే రొమాంటిక్‌ బాసులూ లేకపోలేదు.
షికారు పోదమా...
ఇక్కడా లాంగ్‌డ్రైవ్‌లూ క్యాంప్‌ఫైర్లూ ఉంటాయి. ఇక్కడా కోక్‌ నురగలూ చూయింగ్‌గమ్‌ బుడగలూ ఉంటాయి. అయితే, ఓ అబ్బాయీ ఓ అమ్మాయీ స్థానంలో - ఓ అభ్యర్థీ ఓ హెచ్‌ఆర్‌ మేనేజరూ. అంతే తేడా! అలా అని, తేలిగ్గా తీసుకోవాల్సిన పన్లేదు. ఆ ముదురురంగు కోటు హెచ్చారు...దేశిముదురు! పదిమంది డిటెక్టివ్‌లతో సమానం, ప్రతి కదలికా గమనిస్తుంటాడు. వందమంది సిగ్మండ్‌ ఫ్రాయిడ్లకు సరిసాటి, ప్రతి సంఘటనా బేరీజు వేస్తుంటాడు. క్రమశిక్షణ ఏపాటిది - అనుకున్న సమయానికి వాలిపోయే టైపా, పదింటికని చెప్పి పదకొండింటికి ప్రత్యక్షమయ్యే రకమా? ప్రవర్తన ఎలాంటిది - ముడుచుకుపోయే తత్వమా, దూసుకుపోయే స్వభావమా? చొరవ సంగతేంటి - అడిగినదానికే జవాబు ఇస్తాడా, అడక్కపోయినా కథలు వినిపిస్తాడా? డైనింగ్‌ ఎటికెట్‌లో ఎన్ని మార్కులు - ఫ్రీగా దొరికిందని కుమ్మేసే బ్యాచా, ఎందుకొచ్చిన గొడవని సూపుతో సర్దుకుపోయే బుద్ధావతారమా? - సాయంత్రం దాకా ప్రతి సంఘటననీ రికార్డు చేస్తాడు. సైకాలజిస్టుల సాయంతో లోతుగా విశ్లేషిస్తాడు.
ఇలాంటి ఇన్ఫార్మల్‌ ఇంటర్వ్యూల ద్వారా...అభ్యర్థిని అన్ని కోణాల్లోంచీ బేరీజు వేసుకోవచ్చని కార్పొరేట్‌ కంపెనీలు భావిస్తున్నాయి. సమయం ఎక్కువ తీసుకున్నా, మదింపు కచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాయి.
పజిలు పట్టు...ఉద్యోగం కొట్టు!
గూగుల్‌లో కొలువంటే మాటలు కాదు...జీతాలూ భత్యాలూ ప్రోత్సాహకాలూ ప్రమోషన్లూ! ఆఫీసైతే అచ్చంగా ఇంద్రలోకమే! వరుసగా ఐదేళ్ల నుంచీ 'బెస్ట్‌ ప్లేస్‌ టు వర్క్‌' జాబితాలో జాగా సంపాదిస్తోందంటేనే అర్థమౌతుంది ...గూగుల్‌ గొప్పేమిటో! ఉద్యోగుల నియామకాల్లో గూగుల్‌ దారే వేరు. రామాయణంలో శివధనుస్సును విరిచిన రాముడికే సీతనిచ్చినట్టు, భారతంలో మత్స్యయంత్రాన్ని సంధించిన పార్ధుడికే ద్రౌపదిని కట్టబెట్టినట్టు...గుట్టలకొద్దీ అభ్యర్థుల్ని వడపోయడానికి గూగుల్‌ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. పట్టాలూ పాయింట్లూ ఆతర్వాత, ముందు కోడింగ్‌ పజిల్‌ను పరిష్కరించండి - అంటూ సవాలు విసురుతోంది. గూగుల్‌లో చాలా ఉద్యోగాలకి కోడింగే కీలకం. ఆ ఒక్క నైపుణ్యం ఉంటే...అవకాశాల కోడి కూసినట్టే! 'కోడ్‌జామ్‌' పోటీలు పెట్టేసి... విజేతలకు బహుమతులూ దాంతోపాటే ఆఫర్‌ లెటర్లూ ఇచ్చేస్తోంది. ఇటీవల అమెజాన్‌ కూడా ఇలానే, దాదాపు 250 మందిని నియమించుకుంది. టైమ్స్‌జాబ్స్‌.కామ్‌ సర్వేలో దాదాపు 77 శాతం సంస్థలు కోడింగ్‌ పోటీల ద్వారా నియామకానికి అనుకూలంగా ఓటేశాయి. ఈ పోటీలు సాధారణంగా, ఫేస్‌బుక్‌లాంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లే వేదికగా జరుగుతుంటాయి.
ఎవరికి తెలుసు ఏ ఆటలో ఏ ఉద్యోగముందో! 'గేమిఫికేషన్‌'అన్న మాట హెచ్‌ఆర్‌ నిపుణుల సంభాషణల్లో తరచూ వినిపిస్తోంది. ఆతిథ్యరంగ దిగ్గజం మారియట్‌ హోటల్స్‌ ఇందుకు ప్రత్యేకంగా ఓ అప్లికేషన్‌ను తయారు చేయించింది. ఆ గేమ్‌లో ఉద్యోగార్థులు షెఫ్‌ అవతారం ఎత్తి ... వంటావార్పులో రకరకాల పరీక్షల్ని ఎదుర్కొంటారు. సౌందర్యసాధనాల సంస్థ 'లోరెల్‌' కూడా ఆటల బాటలోనే నడుస్తోంది. ఆ గేమ్‌లో ... బిజినెస్‌ ఐడియా నుంచి ఓ వస్తువును మార్కెట్లోకి తీసుకొచ్చే దాకా వివిధ దశల్లో సమస్యల్ని ఎలా అధిగమిస్తారో - ఓ కార్టూన్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నిరూపించుకోవాల్సి ఉంటుంది. 'ఇంటర్వ్యూగదిలో కూర్చోబెట్టి ప్రశ్నలు గుప్పించడం చాలా కృతకమైన పద్ధతి. సమాధానాలూ కృతకంగానే ఉంటాయి. దానికి తోడు ఒత్తిడి! అదే ఆటలో, బోలెడంత హుషారు ఉంటుంది. ఎవరికివారు పసిపిల్లలైపోతారు. ముసుగులూ గట్రా ఉండవు. సాధ్యమైనంత నిజాయతీగా స్పందిస్తారు. ఆటతీరు ఆధారంగా అభ్యర్థిని బేరీజు వేయడం సులభం అవుతుంది' అంటారు నియామక నిపుణులు.
మనసుకు పరీక్ష!
ప్రతి ఉద్యోగానికీ కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. పరిశోధన విభాగంలో పనిచేసే ఉద్యోగికి సృజన ఉండాలి, మార్కెటింగ్‌ ఉద్యోగికి మాటకారితనం ఉండాలి, హెచ్‌ఆర్‌ ఉద్యోగికి గోప్యత తెలియాలి. పట్టాలూ మార్కులూ ఆ ప్రత్యేకతల్ని వివరించలేవు. అలాగే, ప్రతి సంస్థకూ ఓ పని సంస్కృతి అంటూ ఉంటుంది. కొన్ని సంస్థలు మరీ భోళాగా ఉంటాయి - గూగుల్‌లా! అంతర్ముఖులు అలాంటి చోట్ల పనిచేయలేకపోవచ్చు. మరికొన్ని చోట్ల వాతావరణం ఎంతోకొంత గంభీరంగా ఉండవచ్చు - అమెజాన్‌లా! బహిర్ముఖులు అక్కడ ఇమడలేరు. 'కల్చరల్‌ ఫిట్‌మెంట్‌' కూడా ఉద్యోగి పనితీరును ప్రభావితం చేస్తుంది. కాబట్టే, ప్రత్యేకంగా రూపొందించిన మానసిక పరీక్షల ద్వారా అభ్యర్థి స్వభావాన్ని బేరీజు వేసే ప్రయత్నం చేస్తున్నాయి కార్పొరేట్‌ సంస్థలు. ఇప్పటికే, దేశవ్యాప్తంగా దాదాపు నాలుగువందల కంపెనీలు నియామకాల్లో 'సైకోమెట్రిక్‌ టూల్స్‌'ను ఉపయోగిస్తున్నాయి. బాధ్యతల నిర్వహణ, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, బృందాలుగా పనిచేసే చొరవ, భావోద్వేగాల నియంత్రణ... ఇలా ఒక్కో పరీక్ష ఒక్కో లక్షణాన్ని అంచనా వేస్తుంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా ఉద్యోగార్థిలోని నాయకత్వ లక్షణాల్ని బేరీజు వేయడానికి ప్రత్యేకంగా ఓ మానసిక పరీక్షను రూపొందించుకుంది.
రెడీ...'కేస్‌'స్టడీ...గో!
ఓ ప్రశ్న ఇచ్చి ... విశ్లేషణాత్మకంగా జవాబు చెప్పమంటే - ఎవరి కోణంలో వారు ఆలోచిస్తారు, ఎవరికి తోచిన సమాధానం వాళ్లిస్తారు. ఆ పరిష్కారాల్లో వారివారి వ్యక్తిత్వాలూ ప్రతిఫలిస్తాయి. అందుకే, డెలాయిట్‌ లాంటి సంస్థలు సిబ్బంది నియామకానికి 'కేస్‌ స్టడీ'నీ ఓ మార్గంగా ఎంచుకుంటున్నాయి. 'అనగనగా ఓ శీతలపానీయ సంస్థ. ప్రకటనల కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా, లక్షలకు లక్షల జీతమిచ్చి ఎంతమంది నిపుణుల్ని నియమించుకున్నా, బ్రాండ్‌ రూపకర్తలకు వేలకువేల డాలర్లు ముట్టజెప్పినా... పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఆ కంపెనీ బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి?', 'ఫలానా సంస్థ బట్టతల మీద జుట్టు మొలిపించే తైలాన్ని మార్కెట్లోకి తీసుకురావాలని అనుకుంటోంది. వినూత్నమైన ప్రచార మార్గాలు సూచించండి' - ఇలా ఉంటాయి సమస్యలు. కొన్నిసార్లు బృందంగా ఏర్పడి...ఓ కంపెనీకి బిజినెస్‌ స్ట్రాటజీ తయారు చేయమనో, ఓ వ్యాపారవేత్త కోసం కుటుంబ రాజ్యాంగాన్ని రాయమనో అడుగుతారు. ఆ సమాధానాల ఆధారంగానే ప్రాథమిక ఎంపిక ఉంటుంది. తుది ఇంటర్వ్యూ కూడా ఆ అంశం చుట్టూ తిరుగుతుంది.
స్పీడ్‌ డేటింగ్‌!
సాధారణంగా ఏ ఇంటర్వ్యూ అయినా అరగంట నుంచి నలభై అయిదు నిమిషాలు జరుగుతుంది. స్పీడ్‌ డేటింగ్‌ పద్ధతిలో ఆ నిడివి ... మూడంటే మూడు నిమిషాలే! సమయం, డబ్బు, వనరులు వృథా కాకుండా రూపొందించిన సరికొత్త విధానమిది. కుటుంబ చరిత్ర లేకపోయినా, కోట్లకు కోట్ల పెట్టుబడులు సమకూర్చుకోలేకపోయినా... ఐడియాని నమ్ముకునే రంగంలోకి దిగుతాయి స్టార్టప్‌ కంపెనీలు. దిగ్గజాల్లా లక్షలకొద్దీ జీతాలు ఇచ్చుకునే స్థోమత ఉండదు. భారీగా నియామక ప్రకటనలూ గుప్పించలేవు.
ఎన్ని అర్హతలున్నా, ఎన్ని ఆఫర్లున్నా చేస్తేగీస్తే స్టార్టప్స్‌తోనే పని చేయాలనుకునేవారూ చాలామందే ఉంటారు. పెద్ద సంస్థలో చిన్న బాధ్యత కంటే, చిన్న సంస్థలో పెద్ద బాధ్యతే గొప్ప. అప్పుడప్పుడే వూపిరిపోసుకుంటున్న కంపెనీలో అద్దాల అడ్డుగోడలుండవు. సీయీవో నుంచి గుమస్తా దాకా...ఒకర్ని ఒకరు పేరుపెట్టి పిలుచుకునే చనువు ఉంటుంది. పనిలో పరిమితులూ తక్కువే. దీంతో ఉద్యోగికి వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అసలుసిసలు అనుభవమంటే అదే! సరిగ్గా అలాంటి పనివాతావరణాన్నే కోరుకునేవారికి 'స్పీడ్‌ డేటింగ్‌' ఓ వరం. ఇది, జాబ్‌ఫెయిర్‌లా జాతరేం కాదు. మహా అయితే ఓ యాబై సంస్థలూ, ఓ నూటయాభైమంది అభ్యర్థులూ పాల్గొంటారు. అంతకుముందే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా... తొలిదశ వడపోత జరిగిపోయి ఉంటుంది. ప్రతి సంస్థా ఓ నిమిషం వ్యవధిలో తనను తాను పరిచయం చేసుకుంటుంది. ప్రతి అభ్యర్థీ ఒక్కో కంపెనీ ప్రతినిధి కోసం మూడు నిమిషాలు కేటాయిస్తాడు. సాయంత్రానికంతా...ఎంపికలు పూర్తయిపోతాయి. డిన్నర్‌లో నియామకపత్రాలు అందించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల 'హెడ్‌స్టార్ట్‌ హయ్యర్‌' సంస్థ ముంబయిలో నిర్వహించిన స్పీడ్‌ డేటింగ్‌లో... 40 స్టార్టప్స్‌ పాల్గొన్నాయి. దాదాపు నూట యాభైమంది ఉద్యోగార్థులు వచ్చారు.
పదేళ్లక్రితం ఓ చిన్న స్టార్టప్‌గా ప్రారంభమైన బుక్‌మైషో.కామ్‌ ఈమధ్యే, సంస్థలో పనిచేస్తున్న రెండువందల యాభైమందిలో, యాభైమంది ఉద్యోగులకు వాటాలిచ్చింది. అందులో తొంభైశాతం దాకా ఆసక్తికొద్దీ తక్కువ జీతానికి చేరినవారే!
తాజా రాజాలు కావలెను!
ఎవరో ఎంపిక చేసుకోగా మిగిలిపోయిన అడుగుబొడుగు సరుకు మనకెందుకు, 'క్యాచ్‌ దెమ్‌ యంగ్‌'! చివరి సంవత్సరంలోనో, చిట్టచివరి సెమిస్టర్‌లోనో కాదు...ప్రారంభంలోనే నైపుణ్యాన్ని గుర్తించండి! - అంటున్నాయి కార్పొరేట్‌ కంపెనీలు. ఇంకేముంది, భుజాలకు లాప్‌టాప్‌లు తగిలించుకుని క్యాంపస్‌ యాత్రలకు బయల్దేరుతున్నారు మానవ వనరుల నిపుణులు. 'క్యాంపస్‌ కనెక్ట్‌' పేరుతో తమ సంస్థ పనిసంస్కృతిని క్యాంపస్‌ విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. సిటీబ్యాంక్‌ ఆ ప్రయత్నంలో ముందుంది. లిఖిత పరీక్షలతో నిమిత్తం లేకుండా , ముఖాముఖి సంభాషణల ద్వారానే...విద్యార్థుల్ని అంచనా వేస్తోంది. చాలా కంపెనీలు వేసవి కొలువులు ఇస్తాం రమ్మంటూ పిలుపు ఇవ్వడం వెనుకా ఓ నియామక వ్యూహమే ఉంది. ఫలానా విద్యార్థి ఎంత చొరవగా పనిచేస్తున్నాడు, ఎంత నిజాయతీగా వ్యవహరిస్తున్నాడు, ఎంత చక్కగా బృందాల్లో కలిసిపోతున్నాడు, ఎంత వైవిధ్యంగా ఆలోచిస్తున్నాడు... వగైరా వగైరా కోణాల్లోంచి అంచనా వేయడానికి ఆ నెలా నెలన్నర సమయం సరిపోతుంది. పనికొస్తాడనిపిస్తే... వెంటనే ముందస్తు నియామక పత్రం అందిస్తారు. లేదంటే, తగిన పారితోషికమిచ్చి సాగనంపేస్తారు. హెచ్‌ఎస్‌బీసీ గత ఏడాది దాదాపు యాభైమందిని ఇంటర్న్‌షిప్‌కు తీసుకుంటే, ఇరవైరెండు మందికి ఉద్యోగాలిచ్చింది. విప్రో అయితే ప్రతి ముగ్గురిలో ఒకరికి అవకాశం ఇచ్చింది. ఇన్ఫోసిస్‌ ప్రపంచ వ్యాప్తంగా 76 విశ్వవిద్యాలయాల నుంచి 160 మందిని తీసుకుంది.
రెజ్యూమె..సగం విజయం!
కోడింగ్‌ పరీక్షలూ, ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లూ, వేసవి కొలువులూ...నియామకాలు ఏ రూపంలో జరిగినా, రెజ్యూమె ద్వారానే ప్రాథమికంగా ఓ అంచనాకి వస్తాయి మానవ వనరుల సంస్థలు. వేలవేల దరఖాస్తుల్లోంచి, ప్రతి రెజ్యూమెనూ సగటున ఆరు సెకెన్లు మాత్రమే పరిశీలిస్తాయని ఓ అంచనా. అదెంత సూటిగా, ప్రభావవంతంగా ఉంటే... అంత అవకాశం!
* ఏ సంస్థ అయినా అనుభవానికి ప్రాధాన్యం ఇస్తుంది. దరఖాస్తు చేస్తున్న ఉద్యోగంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్న ప్రతి చిన్న అనుభవాన్నీ వదిలిపెట్టకుండా ప్రస్తావించాలి.
* గత ఉద్యోగాల్లో సాధించిన విజయాల్ని తప్పక ఉటంకించాలి. అద్భుతంగా అమ్మకాలు పెంచాను, కష్టపడి పనిచేసి యాజమాన్యాన్ని మెప్పించాను... తదితర వూకదంపుడు మాటలొద్దు. అమ్మకాల్లో 30 శాతం వృద్ధి సాధించాను, 2013 సంవత్సరానికి ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యాను, శిక్షణలో ఉన్నప్పుడే మూడు ప్రోత్సాహకాలు అందుకున్నాను... ఇలా విజయాలు నిర్దుష్టంగా ఉండాలి.
* కట్టలకొద్దీ దరఖాస్తుల్ని తీరిగ్గా చదువుతూ కూర్చోరెవరూ. తొలిదశలో టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ఇందుకు ప్రత్యేకించి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. రెజ్యూమెలోని కీలక పదాల ఆధారంగా వడపోత జరుగుతుంది. కాబట్టి, ఆ ఉద్యోగానికి సంబంధించి సాంకేతిక పదాల్ని ధారాళంగా ఉపయోగించాలి.
* ఓ గౌరవనీయ సంస్థలో ఉద్యోగిగా మీ ఇ-మెయిల్‌ ఐడీ కూడా హుందాగా ఉండాలి. స్మార్ట్‌శీనుఎట్‌జీమెయిల్‌.కామ్‌, కూల్‌గైఎట్‌యాహూ.మెయిల్‌ వగైరా చిరునామాలు మీమీద సదభిప్రాయాన్ని కలిగించలేవు.
* రెజ్యూమె - అందమైన అమ్మాయి స్కర్టు లాంటిది. మరీ చిన్నగా ఉంటే అసహ్యంగా ఉంటుంది, మరీ పెద్దదైతే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. జూనియర్లకు ఒక పేజీ సరిపోతుంది, సీనియర్లకు రెండు పేజీలు చాలన్నది నిపుణుల సూచన.
* వృత్తితో సంబంధం లేని, 'జర్మన్‌లో డిప్లొమా కోర్సు', 'రామకృష్ణమఠంలో సర్టిఫికెట్‌ ఇన్‌ యోగా' తదితర అంశాల్ని ప్రస్తావించకపోయినా నష్టం లేదు. రెజ్యూమెలో ఫొటోలూ గ్రాఫులూ ఇలస్ట్రేషన్లూ ఉండాల్సిన పన్లేదు. కావాలనుకుంటే, సవివరమైన 'పోర్టుఫోలియో'లో ఆ మసాలా అంతా గుప్పించవచ్చు.
కార్పొరేట్‌ కంపెనీలు కొత్తతరాన్ని కలవరించడం వెనుక పక్కా ఆర్థిక ప్రణాళిక ఉంది. జీతాల పద్దు సంస్థ లాభనష్టాల ఖాతా మీదా ప్రభావం చూపుతుంది. సీనియర్లతో పోలిస్తే, కొత్త కుర్రాళ్ల జీతభత్యాలు తక్కువే. కాస్త శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుకుంటే చాలు. అందుకే, టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ చాలాకాలంగా 'యువ' మంత్రం జపిస్తోంది. మూడులక్షలమంది ఉద్యోగులున్న సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో పాతికవేలమంది కొత్తవాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. టీసీఎస్‌లో సగటున ఒక్కో ఉద్యోగి మీద పెట్టే ఖర్చు సాలీనా పద్నాలుగు లక్షల రూపాయలైతే, ఇన్ఫోసిస్‌లో ఆ మొత్తం పద్దెనిమిది లక్షలని ఓ అంచనా.
నిపుణులొస్తున్నారు...
ఉద్యోగుల నియామకం ఆషామాషీ వ్యవహారం కాదన్న సంగతి చాలా సంస్థలకు అర్థమైపోయింది. కాకలుతీరిన అనుభవజ్ఞులకు ఆ బాధ్యతను అవుట్‌సోర్స్‌ చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నైపుణ్యమున్న ఉద్యోగుల్ని వెతికిపెడతామంటూ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఇంటర్వ్యూస్ట్రీట్‌.కామ్‌ వివిధ కంపెనీల అవసరాల్ని బట్టి కోడింగ్‌ పోటీల్ని రూపొందిస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇంటర్వ్యూస్ట్రీట్‌ కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. చాలా సంస్థలు ఐఐటీలూ ఐఐఎమ్‌ల వంటి అగ్రశ్రేణి సంస్థల్లో చదివినవారికే ప్రాధాన్యం ఇస్తాయి. ఓ మోస్తరు నగరాల్లోని ద్వితీయ స్థాయి విద్యాసంస్థల్లోనూ మెరికల్లాంటి విద్యార్థులుంటారు. అదీ తక్కువ జీతాలకే దొరుకుతారు. కాంప్లేస్‌.కో.ఇన్‌ ఆ నియామక వ్యూహంతోనే కొత్తకొత్త క్త్లెంట్లను సంపాదించుకుంటోంది.
సృజనా యాడ్స్‌!
కావలెను...ఓ బహుళజాతి సంస్థలో పనిచేయుటకు ఉత్సాహవంతులైన ఇంజినీరింగ్‌ పట్టభద్రులు కావలెను, ఆకర్షణీయమైన జీతం ఉంటుంది - తరహా సంప్రదాయ ఉద్యోగ ప్రకటనలకు కాలం చెల్లిపోయింది. నియామక విధానాలు మారినట్టే, నియామక ప్రకటనలూ మారుతున్నాయి. ఈ మధ్య ఓ సంస్థ 'కమ్‌, రిప్లేస్‌ అవర్‌ ఛైర్మన్‌' అంటూ ప్రకటన ఇచ్చింది. తమ కంపెనీలో బోలెడన్ని ఎదుగుదల అవకాశాలు ఉన్నాయన్న వూరింపు అది. మరో ప్రకటనలో ఓ వెలిగించిన అగ్గిపుల్ల బొమ్మ ...పక్కనే, పెద్దక్షరాల్లో 'మీలోని నిప్పు కావాలి, కాస్త అరువిస్తారా?' అన్న మాట, ఓ మూలన సంస్థ వెబ్‌సైట్‌. ఎదగాలన్న తపనే ప్రధాన అర్హత అన్న సంకేతమది. సైటెల్‌ ఇండియా వాళ్ల ప్రకటనలో గొంగళిపురుగు, సీతాకోకచిలుక బొమ్మలు వేసి ... గొంగళి బొమ్మ కింద 'సైటెల్‌లో చేరడానికి ముందు' అనీ, సీతాకోకచిలుక కింద 'సైటెల్‌లో చేరాక' అనీ రాశారు. తమ సంస్థలో ఉద్యోగంతోనే ఏ ప్రొఫెషనల్‌కు అయినా పరిపూర్ణత వస్తుందని భావం. నీటిశుద్ధి యంత్రాల్ని విక్రయించే యురేకాఫోర్బ్స్‌వాళ్లు మరింత చమత్కారంగా 'మీ మెదడులో నీళ్లు ఉన్నాయా? ఉంటే, ఆ స్థానంలో యురేకా ఫోర్బ్స్‌ నీటిని నింపుకోండి' అంటూ మనసులోని మాట చెప్పారు. మనిషి మెదడులో 85 శాతం మేర నీళ్లే ఉంటాయి. 'ఐసీఐ..ఐ బి..ఎన్‌కె కోసం కావాలి' అంటూ ఓ ప్రైవేటు బ్యాంకు ప్రకటన. అందులో రెండక్షరాలు మాయమయ్యాయి...సీఏ! చార్టర్డ్‌ అకౌంటెంట్ల కోసం పిలుపు అది. ఓ టీవీ ప్రకటనలో మేనేజరు ఓ ఉద్యోగిని పిలిచి 'యాజమాన్యం నీ ప్రతిభకు మెచ్చి అద్భుతమైన బహుమతి ప్రకటించింది' అంటూ ఓ అందమైన డబ్బా ఇస్తాడు. తెరిచి చూస్తే .. ఓ వేరుసెనగ కాయ! వెనువెంటనే 'పల్లీల కోసం పనిచేస్తారా, వెంటనే ఉద్యోగం మారండి' అంటూ పదునైన క్యాప్షన్‌! కొత్తతరానికి ఇష్టమైన ... స్వేచ్ఛ, సృజన, సవాళ్లు తదితర పదాల్ని ధారాళంగా ఉపయోగిస్తున్నారు యాడ్స్‌ సృష్టికర్తలు. యథా నియామకాలు, తథా ప్రకటనలు!
నియామకాల్లో సోషల్‌ మీడియా పాత్ర పెరుగుతోంది. హెచ్‌ఆర్‌ సంస్థలు ఫేస్‌బుక్‌, లింక్డిన్‌, ట్విటర్‌ తదితర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. వర్క్‌ఫోర్స్‌ ఇండెక్స్‌ సర్వేలో ... దాదాపు 56శాతం ఉద్యోగార్థులు సోషల్‌ నెట్‌వర్క్‌ ద్వారానే తమకు కొలువుల సమాచారం తెలిసిందని చెప్పారు. 25 శాతం మందికైతే ఆ వేదిక మీదే ఉద్యోగాలు ఖరారు అయ్యాయట. కొన్ని సంస్థల సీయీవోలు నేరుగా యూట్యూబ్‌లో ప్రత్యక్షమైపోయి 'మా దగ్గర ఖాళీలున్నాయి, దరఖాస్తు చేసుకోండి' అంటూ పిలుపునిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగాక, 'మొబైల్‌ రిక్రూట్‌మెంట్‌' వూపందుకుంది. ఫోన్‌లోనే ఉద్యోగ సమాచారాలూ ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్ట్‌లూ అందుతున్నాయి. కొన్నిసార్లు ఇంటర్వ్యూలూ జరిగిపోతున్నాయి. తుదిదశలో హెచ్‌ఆర్‌ నిపుణులూ ఉద్యోగార్థులూ ప్రత్యక్షంగా భేటీ అవుతున్నారు. టెక్‌ మహీంద్రా 'మొబైల్‌ జాబ్‌ మార్కెట్‌ ప్లేస్‌' ప్లంబింగ్‌, వంట, టైలరింగ్‌ తదితర చిన్నచిన్న వృత్తులవారికి ఉపాధి అవకాశాల్ని అందిస్తోంది. చిన్న ఉద్యోగాలే కావచ్చు కానీ, ఇదేం చిన్న మార్కెట్‌ కాదు. ఈ విభాగంలో, దాదాపు నలభై లక్షల కొలువులున్నాయి. ఓ యాభైరూపాయల ప్రవేశ రుసుముతో వివరాల్ని నమోదు చేసుకుంటే .. ఖాళీల సమాచారాన్ని చేరవేస్తుంది టెక్‌మహీంద్రా.
ఓటమి అనాథ, విజయానికి బంధుగణం ఎక్కువని భావిస్తాం. నియామక నిపుణులు మాత్రం అలా అనుకోవడం లేదు. కొత్త ఆలోచనలతో, కోటి ఆశలతో వ్యాపార సంస్థల్ని ప్రారంభించినా...రకరకాల పరిమితుల వల్ల వాటిని ముందుకు తీసుకెళ్లలేకపోతున్న పరాజిత ఎంట్రప్రెన్యూర్స్‌ అంటే వారికి మహా మమకారం! చాలా సంస్థలు అలాంటివారి కోసమే ఎదురుచూస్తున్నాయి. పెద్ద బాధ్యతలు అప్పగిస్తాం రమ్మని వూరిస్తున్నాయి. అనుభవం నేర్పే పాఠాలు... వేయి యూనివర్సిటీ పట్టాలతో సమానమని భావిస్తున్నాయి.
ఓటమీ ఓ నియామక అర్హతే!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning