మొదటి సంవత్సరం ఎలా తయారవ్వాలి?

హాజరు, డిటెన్షన్‌ నిబంధనలతో కూడిన ఇంజినీరింగ్‌ చదవడం కష్టమేమో అని సందేహం రావడం సహజం. ఐతే క్రమశిక్షణతో కూడిన నియమావళిని అనుసరించి చదివితే ఈ సాంకేతిక విద్యాభ్యాసాన్ని కళాత్మకంగా, వినోదాత్మకంగా మల్చుకోవచ్చు!
ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులు వెంటనే పాటించాల్సిన ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.
1. లక్ష్యం నిర్దేశించుకోవడం: జీవితంలో ఏం చెయ్యాలనుకున్నాము అనే దిశానిర్దేశం ఆరంభంలోనే చూసుకోవాలి. అందుకు అవసరమైన అర్హతలు ఏవేవి అన్నది తెలుసుకోవాలి. అలాగే బీటెక్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అన్న లక్ష్యం కూడా పెట్టుకోవాలి.
ఉదాహరణకు 80% లక్ష్యంగా పెట్టుకున్నామనుకుందాం. ఇప్పుడు ఈ మార్కులు ప్రతి సంవత్సరానికీ ఎంత శాతం అన్నది నిర్ణయించుకోవాలి. ఆపై ప్రతి సబ్జెక్టులోనూ ఎంత శాతం సాధించాలో నిర్దేశించుకోవాలి. ఇందులో అంతర్గత మార్కుల రూపంలో ఎన్ని, విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలో ఎన్ని సాధించాలో లక్ష్యంగా నిర్ణయించుకోవాలి. అప్పుడు లక్ష్యాన్ని అంచెలంచెలుగా సాధించడం సాధ్యమౌతుంది. సులభం కూడా అవుతుంది.
2. ఇంటర్మీడియట్‌ పుస్తకాల పునశ్చరణ: ఇంజినీరింగ్‌ చదువుకి మూల స్తంభాలైన గణిత, భౌతిక, రసాయనిక శాస్త్రాలను మొదటి సంవత్సరంలో మళ్ళీ చదువుతారు. ఐతే ఈ సబ్జెక్టులు ఇంటర్మీడియట్లో మాదిరిగా కాక కాస్త ఉన్నత ప్రమాణాలతో ఉంటాయి. కాబట్టి ఇంటర్మీడియట్‌ పుస్తకాల పాఠ్యాంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ఇది కూడా మొదటి రెండు వారాల్లోపే జరగాలి.
ఇలా చేస్తే తరగతుల్లో అధ్యాపకులు వివరించే నూతన అంశాలు సులభంగా అర్థం అవుతాయి. పైగా ఆ మౌలికాంశాల ప్రయోగాత్మకత గురించి కూడా చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఈ అభ్యాసం చివరి వరకూ చెయ్యనక్కరలేదు. బీటెక్‌ మొదలైన మొదటి రెండు మూడు వారాల వరకు చేస్తే చాలు. ఆ తరువాత వీలు, అవసరాన్ని బట్టి పునశ్చరణ చెయ్యవచ్చు.
3. ఒక సబ్జెక్టు నేర్చుకోవడానికి అవసరమైన పూర్వజ్ఞానం: ఏదైనా సబ్జెక్టు సులభంగా నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన మూలాధారమైన సబ్జెక్టు ముందరి తరగతిలో చదివి ఉండాలి. దీన్ని ఆంగ్లంలో 'ప్రీ రిక్విజిట్‌' అని వ్యవహరిస్తారు. ఉదాహరణకు...
* ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలోని మేథమేటిక్స్‌-1 సబ్జెక్టు నేర్చుకోవాలంటే ఇంటర్మీడియట్‌లో చదివిన గణిత శాస్త్ర జ్ఞానం తప్పనిసరి.
* భౌతికశాస్త్రం నేర్చుకోవాలంటే ఇంటర్మీడియట్‌లో చదివిన భౌతికశాస్త్రం తప్పనిసరిగా గుర్తుండివుండాలి.
* సీ ప్రోగ్రామింగ్‌ సబ్జెక్టు అర్థం అవ్వాలంటే తర్క పరిజ్ఞానం అవసరమౌతుంది.
4. ై సెమిస్టర్లలో ఆధారపడే సబ్జెక్టులు: ఎలాగైతే మొదటి సంవత్సరంలో ఇంటర్మీడియట్‌లోని సబ్జెక్టుల విషయజ్ఞానం అవసరమౌతుందో పై సెమిస్టర్లలో కొన్ని సబ్జెక్టులు కింది సంవత్సరంలో/ సెమిస్టరులో చదివిన సబ్జెక్టులపై ఆధారపడి ఉంటాయి. ఏ సబ్జెక్టు ఏయే సబ్జెక్టులపై ఆధారపడి ఉందో మొదటి సంవత్సరంలోని మొదటి రెండు వారాలలో అవగాహన ఏర్పరచుకోవడం చాలా అవసరం. ఇందువల్ల ఒక సబ్జెక్టు ఎందుకు నేర్చుకుంటున్నామో, దాని అవసరమేమిటో తెలుస్తుంది; ఆ జ్ఞానం ఆధారంగా సబ్జెక్టులో చక్కటి పునాది వేసుకోవడానికీ ఎంతో ఉపయోగం.
5. సబ్జెక్టు అవసరం, ఉపయోగాలు: ఒక సబ్జెక్టు బీటెక్‌లో ఎందుకు చదువుతున్నాం, దాని ఆవశ్యకత ఏమిటి, దాని విషయ పరిజ్ఞానం నిజజీవితంలో ఎక్కడ ఉపయోగమౌతుంది అన్న అంశాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి. ఇది అధ్యాపకులనడిగి తెలుసుకోవాలి. ఆ సబ్జెక్టు నేర్చుకోవడానికి లక్ష్యాల పట్ల కూడా స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి.
నాలుగో వారం నుంచి ఏం చేయాలి?
* అంతర్గత పరీక్షలకు తయారీ: బీటెక్‌ మొదటి సంవత్సరంలో ప్రతి సబ్జెక్టులోనూ మూడు అంతర్గత పరీక్షలు నిర్ణీత సమయంలో నిర్వహిస్తారు. వాటి సరాసరి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి సబ్జెక్టులోనూ ఐదు యూనిట్లు ఉంటాయి. అంటే సగటున ప్రతి ఒకటిన్నర యూనిట్ల తరువాత ఒక పరీక్ష నిర్వహిస్తారు. మొదటి పరీక్ష 8 - 10 వారాల తరువాత జరుగుతుంది. ఈ పరీక్షలు విద్యార్థి ఎంతమేరకు నేర్చుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలుపుతాయి.
* కంప్యూటర్‌ లాంగ్వేజికి సంవంధించిన 'సి' ప్రోగ్రామింగ్‌ బాగా నేర్చుకోవాలనుకోండీ- మొదటి ఒకటి రెండు నెలలపాటు ఒక సమస్యకు సంబంధించిన సమాధానాన్ని పెంపొందించడానికి అవలంబించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. అంతే కాకుండా క్రమసూత్ర పద్ధతి నిర్మాణ ప్రక్రియలను (అల్‌గోరిదమ్‌ డెవలప్‌మెంట్‌) బాగా అభ్యాసం చెయ్యాలి. తర్కాన్ని (లాజిక్‌ డెవలప్‌మెంట్‌) ఎలా పెంపొందించాలో బాగా అభ్యాసం చెయ్యాలి. అలాగే ఇతర సబ్జెక్టులకు అవసరమైన మెలకువలను అభ్యాసం చెయ్యాలి.
* నిత్య అభ్యాస సమస్యలను పూర్తి చెయ్యడం (Daily Practice Problems): సాధారణంగా అధ్యాపకులు ప్రతి యూనిట్‌ ముగిసిన వెంటనే కొన్ని అభ్యాసాలు రోజూ ఇంటి వద్ద చేయడానికి ఇస్తుంటారు. వీటిని తప్పనిసరిగా చెయ్యాలి. సబ్జెక్టుకు సంబంధించిన మూల సూత్రాల పునశ్చరణ వీటి ముఖ్య ఉద్దేశం. ఇవి సాధారణంగా అధ్యాపకులు తరగతిలో చేసిన అభ్యాసాల ఆధారంగా సాధించగలిగినవై ఉంటాయి.
ఒకవేళ ఏదైనా సమస్యను సాధించలేకపోయినట్త్లెతే ఇతరుల నుంచి కాపీ చెయ్యకూడదు. అధ్యాపకులతో సంప్రతించాలి; సంశయ నివారణ చేసుకుని సాధించి నేర్చుకోవాలి. ఇతర మిత్రులతో కూడా సంప్రతింపులు జరుపవచ్చు. మొత్తానికి కాపీ కొట్టకుండా నేర్చుకుని ఆత్మస్త్థెర్యాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరం. ఈ సమస్యలను క్రమం తప్పకుండా సాధిస్తే సబ్జెక్టు ఆకళింపు కావడమే కాక పరీక్షల్లో కూడా ఉత్తమ ప్రదర్శన కనబరచవచ్చు. తద్వారా లక్ష్యంగా పెట్టుకున్న మార్కులు సాధించవచ్చు.
చిత్తశుద్ధితో అలవరచుకున్న ఈ అభ్యాసం క్రమక్రమంగా సిలబస్‌ పునశ్చరణ చేయడం అనే ఒక మంచి అలవాటుని నేర్పిస్తుంది. ఈ అలవాటే ఉద్యోగంలో చేరినప్పుడు ప్రణాళికాయుతంగా ప్రతిభావంతంగా పనిచెయ్యడమనే అలవాటు నేర్పిస్తుంది.
* నోట్సు తయారు చేసుకోవడం: మంచి ఇంజినీరుకి ఉండవలసిన లక్షణం ప్రతి పనినీ ప్రణాళికాబద్ధంగా చెయ్యడం. చేసే ప్రతిపనీ దాని స్థితిగతుల గురించి ఒక పుస్తకంలో నోట్‌ చేసుకోవాలి. ఈ అలవాటు ఉద్యోగం మొదటుపెట్టిన తరువాత కాకుండా విద్యార్థి దశలోనే అలవరచుకోవాలి. నోట్సు, అధ్యాపకుడు చెప్పే విషయాలు మనకెంత అర్థమయ్యాయి అన్న అంశానికి దర్పణంగా నిలుస్తాయి. అంటే తెలుసుకున్న విషయాన్ని మనకర్థమయ్యే రీతిలో ఒకచోట రాసుకోవడమన్న మాట. నోట్సు ఇలా సొంతంగా తయారు చేసుకునే అలవాటు చేసుకుంటే చాలా మంచిది. దీనితో సబ్జెక్టు అర్థమవ్వడమే కాకుండా పరీక్షల్లో కూడా ప్రజ్ఞ కనబరచవచ్చు. ఈ నోట్సులో మనం సేకరించిన పూర్వ పరీక్షల ప్రశ్నలకు సమాధానాలు కూడా చేర్చుకోవచ్చు.
* సంశయ నివారణ/ అనుమాన నివృత్తి: తరగతిలో విన్న పాఠ్యాంశాల మీద కానీ, అసైన్మెంట్లలో కలిగిన సందేహలను కానీ అధ్యాపకులతో చర్చించి అనుమాన నివృత్తి చేసుకోవాలి. దీన్ని మొదటినుంచీ పెంపొందించుకోవాలి.
* అనుమాన నివృత్తి కానిదే సబ్జెక్టు సరిగా అర్థం కాదు. అర్థకాని సబ్జెక్టుకి సంబంధించిన అంశాలను సరిగా అన్వయించి అభ్యాసం చెయ్యలేము. దీనితో సమస్యల సాధన అనే అలవాటు కుంటుపడుతుంది. క్రమేణా ఇదో అవలక్షణంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి అనుమానాలు తీర్చుకోవడం తప్పనిసరి. మొదట్లో బెరుకుగా అనిపించినా, కొంత సమయమైన తరువాత అయినా ఈ అలవాటు చేసుకోవడం అవసరం. సాధారణంగా విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం వారంలో ఒక పీరియడ్‌ అనుమాన నివృత్తి కోసమే కేటాయించాలి. దీన్ని టైమ్‌టేబుల్‌లో ట్యుటోరియల్‌ అని చూపిస్తారు. ఈ పీరియడ్‌ను పూర్తిగా విద్యార్థి పాల్గొనే పీరియడ్‌గా పరిగణిస్తారు. ఈ పీరియడ్లో విద్యార్థులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి అధ్యాపకుని ఆధ్వర్యంలో సబ్జెక్టు గురించి చర్చా కార్యక్రమం నిర్వహించాలి. చర్చల ద్వారా సబ్జెక్టు పరిజ్ఞానం పరిధి బాగా పెరిగే అవకాశాలుంటాయి.
* ఈ అంశాలన్నీ మూడు నెలలలోపే అలవరుచుకోవాలి. క్రమం తప్పకుండా అభ్యాసం చెయ్యాలి. క్రమం తప్పకపోవడమనేది ఒక అలవాటుగా మాత్రమేకాక బలహీనతగా పరిణమించే స్థితికి ఎదగగలగాలి. ఆ దిశగా చదువు, జ్ఞాన సముపార్జనల ప్రయాణం కొనసాగాలి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning