ఆ విషయం గుర్తుందా!

ఉద్యోగాల కోసం పత్రికలు, ఇతర ప్రకటనలతో పాటు.. ఆన్‌లైన్‌లోనూ వెదికేవారి సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి వ్యక్తీ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ ఫలించాలంటే.. కాస్త నేర్పుగా వ్యవహరించాలి. ఎక్కువ మంది ఇప్పటికే ఆన్‌లైన్‌లో పదు సంఖ్యలో దరఖాస్తులు పంపి.. వాటికి తగిన స్పందన లభించక.. ఉద్యోగం రాక నిరాశకు గురై ఉంటారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే.. ఆన్‌లైన్‌లో ఉద్యోగాలను వెదకడం నుంచి వాటికి దరఖాస్తు చేయడం.. రెజ్యూమెను పంపడం వరకు అన్నింటా కాస్త ప్రత్యేకత ప్రదర్శించాలి. అప్పుడే రిక్రూటర్లు మిమ్మల్ని పరిగణనలోకి తీసుకుంటారు. లేకుంటే మీ దరఖాస్తును పట్టించుకొనే అవకాశం ఉండదు.
ఈ రోజుల్లో దాదాపు అన్నిరకాల ఉద్యోగ అవకాశాల సమాచారం మునివేళ్లపైనే ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారం, తగిన ఉద్యోగాల వివరాలను వెల్లడించే వెబ్‌సైట్లు, యాప్స్ చాలా ఉన్నాయి. మెయిల్ తెరిస్తే చాలు.. పదుల సంఖ్యలో ఉద్యోగ అవకాశాల సమాచారం కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. దీంతో ఉద్యోగాలు ఎక్కడున్నాయి.. అనే సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. వాటిని సాధించడమే అతి పెద్ద సవాల్. మొన్నటి వరకూ ఉద్యోగాల సమాచారం కొందరికే తెలిస్తే.. ఆ కొందరిలో ప్రతిభావంతులు వాటిని దక్కించుకొనే వారు. కాని ఇప్పుడలా కాదు. ఒక సంస్థలో చిన్న పాటి ఉద్యోగం కోసం ప్రకటన వెలువడినా ఆ సమాచారం అన్ని ఉద్యోగ పోర్టళ్లలోనూ లభిస్తోంది. దీంతో అన్ని రకాల ఉద్యోగాలకు పోటీ చాలా ఎక్కువైంది.
గతంలో పది దరఖాస్తులు వచ్చే చోట ప్రస్తుతం వందల సంఖ్యలో వస్తున్నాయి. దీంతో రిక్రూటర్లు సైతం వాటిని వడపోయడానికి ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తున్నారు. అందువల్ల ఆన్‌లైన్‌లో ఉద్యోగాల కోసం అన్వేషించే ముందు ఎంపికలపుడు రిక్రూటర్లు అనుసరిస్తున్న పద్ధతులను తెలుసుకొని.. వాటికి తగినట్లు వేట కొనసాగించాలి.
ఆన్‌లైన్‌లో కొలువుల కోసం వెదుకుతున్నపుడు ముందుగా కొన్ని అంశాలపై స్పష్టత ఉండాలి. వీటిపై స్పష్టత వచ్చిన తర్వాతే అన్వేషణ మొదలుపెట్టాలి.
* మీరు ఎలాంటి ఉద్యోగం కోరుకుంటున్నారు?
* ఎక్కడెక్కడ ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు?
* మీకున్న అర్హతలకు ఎలాంటి కొలువు దక్కే వీలుంది?
* ఎలాంటి సంస్థలో పని చేయాలి?
* పని వేళలు ఎలా ఉండాలి?
* జీతం ఏమేరకు ఉండాలని కోరుకుంటున్నారు?
ఈ అంశాలపై స్పష్టత వచ్చాక.. వీటిని ఆధారం చేసుకొని కొలువుల కోసం అన్వేషణ సాగించాలి. ఎలాంటి ఉద్యోగం చేయాలన్న విషయంపై స్పష్టత వచ్చాక ఆ ఉద్యోగానికి సంబంధించి వాడుకలో ఉన్న పేర్లు, దానికి అవసరమైన అర్హతలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఆ ఉద్యోగానికి సంబంధించిన అన్ని రకాల అవకాశాలనూ తెలుసుకోగలుగుతారు. అలా కాకుండా కేవలం ఒకే ఒక పేరు లేదా అర్హత ఆధారంగా వెదికితే మీకు సరిపోయే అవకాశాల సమాచారం తెలియకుండా పోయే ప్రమాదముంది.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్రతి ఉద్యోగ పోర్టల్‌లోనూ అర్హతలు, ఉద్యోగాలు, జీతం, ప్రాంతం, చదువు, నైపుణ్యాలు తదితర అంశాల వారీగా ఉద్యోగ అవకాశాలను వెదుక్కొనే వెసులుబాటు ఉంది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే మీకు సరిపడా ఉద్యోగ అవకాశాలను గుర్తించవచ్చు.
ఇలా మీకు సరిపడా ఉద్యోగ అవకాశాలను తెలుసుకున్నా.. వాటిని ఒక జాబితాగా రూపొందించుకుని ఒక్కో ఉద్యోగానికి తగినట్లు ఒక్కో రెజ్యూమెను రూపొందించి ఆయా దరఖాస్తులకు జత చేయాలి. రెజ్యూమెలోనూ ఆ ఉద్యోగానికి సంబంధించి కీలక పదాలు ఉండేటట్టు చూసుకోవాలి. వందల కొద్దీ రెజ్యూమెలు వస్తున్న ఈ రోజుల్లో రిక్రూటర్లు రెజ్యూమెలో పేర్కొన్న కొన్ని అర్హతలు, నైపుణ్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని జల్లెడపడుతున్నారు. దీంతో ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు, అర్హతలను ప్రధానంగా ప్రస్తావించకుంటే మీ దరఖాస్తు రిక్రూటర్ల చేతికి అందకుండా పోయే ప్రమాదముంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపిన వెంటనే రిక్రూటర్లు లేదా సంస్థ నుంచి వెంటనే స్పందన వస్తుందని ఎక్కువ మంది ఆశిస్తుంటారు. ఇది సరికాదు. మీ దరఖాస్తు లేదా రెజ్యూమెను అందుకున్న సంస్థలు మీతోపాటే మరికొందరి నుంచి కూడా ఆహ్వానించి ఉంటాయి. దీంతో వాటన్నింటినీ పరిశీలించి వాటిలో సంస్థకు సరిపోతారన్న వారిని ఎంపిక చేసి.. వారితో మాత్రమే తదుపరి సంప్రదింపులు జరుపుతాయి. ఇందుకు ఒక వారం నుంచి నెల దాకా కూడా సమయం పట్టవచ్చు. అందువల్ల ఒక ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినపుడు వెంటనే స్పందనను ఆశించవద్దు.
ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఏఏ సంస్థలకు దరఖాస్తు చేశామో గుర్తుపెట్టుకోవాలి. గుర్తులేకుంటే ఒక జాబితాగా రాసిపెట్టుకోవాలి. ఒక్కోసారి రిక్రూటర్ల నుంచి హఠాత్తుగా ఫోన్ కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి మేం ఫలానా మీరు ఫలానా ఉద్యోగానికి దరఖాస్తు చేశారు కదా అని ప్రశ్నిస్తారు. అప్పుడు అవునని చెప్పడంతో పాటు.. ఎప్పుడు ఎలా దరఖాస్తు చేశారో కూడా వివరించాలి. అప్పుడే మీపై రిక్రూటర్లకు సానుకూల భావన కలుగుతుంది. అలా చెప్పకుండా తడబాటుకు గురయితే.. ఆ సంస్థ నుంచి మీకు అదే చివరి కాల్ కావొచ్చు. కనుక ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఎవరికి దరఖాస్తు చేస్తున్నామో గుర్తుంచుకోవడం తప్పనిసరి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning