కొలువుల వర్షం కురిపించే ఈ-మేఘం..!


 • ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ రంగంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఓ ఆశా కిరణంలా కనపడుతోంది. ఈ రంగం కొత్త ఒరవడిని సృష్టిస్తూ వడివడిగా అడుగులు వేస్తోంది. ఐటీ ఓరియంటెడ్‌ విద్యార్థుల పాలిట వరంలా మారి వారి ఉజ్వల భవిష్యత్తుకు వారధిలా కనిపిస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఆర్థిక మాంద్యం నేపథ్యంలో చాలా త‌క్కువ మంది ఐటీ ఓరియంటెడ్‌ విద్యార్థుల‌ను కొలువుల్లోకి తీసుకుంటున్నాయి.

  సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం రూపాంతరం చెందుతుంది. అలా మారిన పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని.. అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారే సాంకేతిక రంగంలో రాణించగలరు. ప్రస్తుతం దేశంలో ప్రైవేటు క్లౌడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2016 నాటికి పబ్లిక్‌ క్లౌడులు రానుండటంతో ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల కొలువులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

  ఐటీ ఓరియంటెడ్‌ విద్యార్థుల పాలిట వరం
  ప్రస్తుతం సీఎస్‌ఈ, ఐటీ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు కొంతమేర తగ్గాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో పరిజ్ఞానం ఉన్న వారికి మాత్రం అమెజాన్‌, గూగుల్‌, ఒరాకిల్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు మంచి వేతనంతో అవకాశాలిస్తున్నాయి. ఐటీ ఓరియంటెడ్‌ విద్యార్థులతోపాటు ఈసీఎమ్‌,
  ఈసీఈ విద్యార్థులకు కూడా ఈ పరిజ్ఞానం ఉంటే మంచి అవకాశాలున్నాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్రాధాన్యాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ దేశంలోని వివిధ‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ పరిజ్ఞానంపై అధ్యాపకులకు శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు చేస్తోంది. అధ్యాపకులు తాము నేర్చుకున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి దీనిపై పరిశోధనలు చేసేలా ప్రేరేపిస్తే ఈ-మేఘం కొలువుల వర్షం కురిపించే పరిజ్ఞానమవుతుంది.

  భవిష్యత్తులో కీల‌కమ‌వ‌నున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానం
  సింగపూర్‌లో అధికంగా ఉన్న ట్రాఫిక్‌ సమస్యను క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నిక్‌ను ఉపయోగించే అధిగమించారు. సీటీఎఫ్‌, హ్యాకింగ్‌పై సమగ్ర అవగాహన కల్పించే 'కంప్యూటర్‌ ద ఫ్లాగ్‌' (సీటీఎఫ్‌) సాఫ్ట్‌వేర్ గేమ్‌ను కూడా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను ఉప‌యోగించుకునే రూపొందించారు. భవిష్యత్తులో కంప్యూటర్‌లోని డేటాను నిల్వచేయడానికి కావాల్సిన మెమోరీ అధికంగా అవసరమవుతుందని, అన్నిరకాల సాఫ్ట్‌వేర్‌లను కొనడానికి ఎదుర్కొనే సమస్యలను అధిగమించడానికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై ఆధారపడాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నూతన టెక్నాలజీపై అధ్యాపకులు, విద్యార్థులు శ్రద్ధపెట్టాలని వారు సూచిస్తున్నారు. మనకు అవసరమైన ప్రతి సాఫ్ట్‌వేర్‌, డేటా స్టోరేజి, వినోదానికి వినియోగించేవి (సినిమాలు, పాటలు), గృహావసరాలకు సంబందించిన ప్రతి అంశాన్ని క్లౌడ్‌ కంప్యూటింగ్ నుంచి పొందవచ్చునని చెబుతున్నారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వీటిలో క్లౌడ్‌ వాషింగ్‌ సమస్యలు, డేటా కోల్పోవడం, రక్షణకు సంబంధించిన అంశాలు, న్యాయపరమైన సమస్యలు, బిగ్‌డాటా, టెక్నికల్‌సమస్యలు, పర్సనల్‌ డేటా రక్షణ తదితర అంశాలున్నాయి. వీటిని అధిగమించ‌డానికి ఇప్పటికే వివిధ పద్ధతులను క‌నుక్కున్నారు.

  అంతర్జాల సేవలలో కీలకపాత్ర
  ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి భవిష్యత్తులో క్లౌడ్‌ పరిజ్ఞానమే ఉపయోగపడుతుంది. అంతర్జాలంలోని పరిజ్ఞానం ద్వారా సుదూరం నుంచి ఇంట్లో ఉన్న పరికరాలను నియంత్రించవచ్చు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పరిజ్ఞానం 2016 నాటికి 25 బిలియన్‌ డాలర్ల మార్కెట్టుకు చేరుతుంది. ఓ క్లౌడ్‌ ద్వారా కావలిసిన సాఫ్ట్‌వేర్‌ను విద్యార్థులు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

  - కె.చంద్రశేఖరన్‌, ఆచార్యులు, డీన్‌(రీసెర్చి), ఎన్‌ఐటీ, సూరత్‌కల్‌
  2016 నాటికి 15 మిలియన్ల కొలువులు
  దేశంలో ప్రస్తుతం ప్రైవేటు క్లౌడులు అధికంగా ఉన్నాయి. అనేక ప్రముఖ సంస్థలు పబ్లిక్‌ క్లౌడులు నిర్మాణానికి సిద్ధమయ్యాయి. 2016 నాటికి ఈ ప్రక్రియ పూర్తయి ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయి. ఆ పరిజ్ఞానం ద్వారా తక్కువ ఖర్చుతో అంతర్జాల సేవలను వినియోగించుకోవచ్చు. డేటా సెంటర్లు ఈ పరిజ్ఞానంలో కీలకపాత్ర పోషించనున్నాయి. జర్నలిస్టులు వారికి సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌ బాక్సు లాంటి క్లౌడు స్టోరేజీ అప్లికేషన్లలో నిక్షిప్తం చేసుకోవచ్చు. సంప్రదాయ కంప్యూటింగ్‌ నుంచి క్లౌడ్‌కు వడివడిగా సంస్థలు అడుగులు వేస్తున్నాయి.
  - నితిన్‌సింగ్‌ చౌహాన్‌, ఇన్ఫోసిస్‌, హైదరాబాదు‌
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning