వస్తువులు చౌక.. ఉద్యోగాలు కేక

* ఒక మాదిరి విద్యావంతులకూ అవకాశం
* వచ్చే మూడేళ్లలో భారీ నియామకాలు
* దూసుకెళ్తున్న ఇ కామర్స్‌ పోర్టళ్లు

ఖరీదైన వస్తువు కొనేముందు నాలుగైదు విక్రయశాలల్లో ధర వాకబు చేసి, తక్కువగా ఉన్న చోట తీసుకునేవారు. ఇప్పుడు నాలుగైదు విక్రయశాలలకు బదులు ఆన్‌లైన్‌లోనే ధరలను పరిశీలించడం పెరిగింది. ముఖ్యంగా. సెల్‌ఫోన్‌ కొనే యువతీ, యువకులు మరింత కచ్చితంగా ఇ కామర్స్‌ పోర్టళ్లను అనుసరిస్తున్నారు. ఆన్‌లైన్‌ ధరలో దుకాణదారు ఇవ్వకుంటే, వెనక్కి వచ్చేస్తున్నారు కూడా. ఇంతగా ప్రాచుర్యం పొందుతున్న ఆన్‌లైన్‌ పోర్టళ్లతో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే రెండు, మూడేళ్లలో దేశీయంగా ఇ కామర్స్‌ పోర్టళ్లు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాయనే అంచనా ఉంది.
దేశీయంగా ఇంటర్‌నెట్‌ వాడకందార్ల సంఖ్య భారీగా పెరగడం, ఇ కామర్స్‌ పోర్టళ్లకు కలిసొస్తోంది. 2,000వ సంవత్సరంలో 50 లక్షల మంది ఇంటర్‌నెట్‌ వినియోగిస్తే, ఇప్పుడు 20 కోట్ల మంది రోజూ గంటసేపు నెట్‌ వాడనిదే నిద్రపోవడం లేదు. 2018కి దేశంలో 50 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ ఖాతాదారులుగా మారతారనే అంచనా ఉంది. స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్‌ పీసీల ధరలు అంతకంతకూ తగ్గడం, డేటా పథకాలు కూడా మరీ భారంగా లేనందున, మొబైల్‌పైనే నెట్‌ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. బస్సు, రైలు, విమాన, సినిమా టికెట్లతో ప్రారంభించి వివిధ ఉత్పత్తుల కొనుగోలుకూ ఇ కామర్స్‌ పోర్టళ్లను ఆశ్రయిస్తున్న వారు అధికమౌతున్నందున, ఈ వ్యాపారం సగటున 34 శాతం వార్షిక వృద్ధితో సాగుతోంది. ఈ తీరును గమనించిన అంతర్జాతీయ, దేశీయ ఇ కామర్స్‌ పోర్టళ్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, ఈబే వంటివి తమ కార్యకలాపాలు భారీగా విస్తరిస్తుండగా, ప్రైవేటు ఈక్విటీ సంస్థల దన్నుతో కొత్త సంస్థలు ఉనికిని చాటుతున్నాయి. ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దేశంలో రిటైల్‌ వ్యాపారం 478 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్లు) స్థాయిలో ఉంటే, అందులో సంఘటిత రంగ వాటా 8 శాతమే (సుమారు రూ.2.30 లక్షల కోట్లు). 2013లో సంఘటిత రిటైల్‌ వ్యాపారంలో 10 శాతం వాటా (సుమారు రూ.23,000 కోట్లు) ఆన్‌లైన్‌ రంగం సాధించిందని అంచనా. 2016కు ఆన్‌లైన్‌ వ్యాపారం రూ.50,000 కోట్లకు చేరుతుందనే అభిప్రాయం ఉంది.
ఎన్నో అవకాశాలు
ఆన్‌లైన్‌ వ్యాపారంలో 70 శాతం వ్యాపార సంబంధ అంశాలపై, 30 శాతం వినియోగదారుకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చే టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. క్లౌడ్‌, మొబైల్‌, సామాజిక మాధ్యమాలు, బిగ్‌డేటా, అనలిటిక్స్‌, డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలు ముఖ్యం. ఇ కామర్స్‌ పోర్టళ్లలో ధర కీలకమే అయినా, చెప్పిన సమయానికి కొనుగోలుదారుకు నాణ్యమైన ఉత్పత్తిని అందించడం అత్యంత ప్రధానం. వస్తువుల సరఫరాదార్లు, గోదాములు, రవాణా (లాజిస్టిక్స్‌), ఈ కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించే వ్యవస్థ (బ్యాక్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌) ముఖ్య పాత్ర పోషిస్తాయి. కార్యకలాపాల విస్తరణకు అమెజాన్‌ 2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.12,000 కోట్లు), ఫ్లిప్‌కార్ట్‌ బిలియన్‌ డాలర్లు (రూ.6,000 కోట్లు) వెచ్చిస్తామని ప్రకటించాయి. ఇక దేశీయ బ్రాండ్లు, గొలుసుకట్టు విక్రయశాలలను నిర్వహిస్తున్న సంస్థలు కూడా సొంతగా ఆన్‌లైన్‌ పోర్టళ్లను అభివృద్ధి చేసి, ఆర్డర్లు తీసుకుంటూ, తమ ఖాతాదారులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌, అరవింద్‌ లైఫ్‌స్త్టెల్‌, వాల్‌మార్ట్‌ ఇండియా, గోద్రజ్‌ నేచర్‌ బాస్కెట్‌ వంటివీ ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్థిరాస్తి/అద్దె ధరలు, పెరిగిన వేతనాల స్థాయిలో వ్యాపారం లేకపోతే, విక్రయశాలలను తగ్గించుకుంటున్న సంస్థలు, ఈ భారం తక్కువగా ఉండే ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని పెంచుతున్నాయి.
* పోర్టళ్లను వీక్షించేవారు/కొనుగోలుదారుల అభిరుచిని గ్రహించి, వ్యాపారవృద్ధికి తోడ్పడే విశ్లేషణలు అందించగల డేటా అనలిస్ట్‌లు 50,000 మందికి రాబోయే 3 ఏళ్లలో అవకాశాలుంటాయని మానవ వనరుల సంస్థ యునిసన్‌ ఇంటర్నేషనల్‌ అంచనా వేస్తోంది. వీరికి బ్యాంకింగ్‌, ఆర్థికసేవలు, బీమా రంగాల్లో అధిక వేతనం లభిస్తుంది. అభ్యర్థి సామర్థ్యానికి అనుగుణంగా అంతకుమించి ఇ కామర్స్‌ పోర్టళ్లు వేతనం ఆఫర్‌ చేస్తున్నాయి.
* డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులు, వివిధ స్థాయిల ఐటీ నిపుణులు, ధరలు-లాభాల నిర్వహణ నిపుణులు, డెలివరీ సిబ్బంది (సప్త్లెచెయిన్‌), కార్యకలాపాలు (కస్టమర్‌ సర్వీస్‌), విక్రయాలు వంటి విభాగాల్లో నియామకాలు పెరుగుతున్నాయి. వెబ్‌ యాప్‌ డెవలపర్లు, క్వాలిటీ నిపుణులు, కంటెంట్‌ రచయితలు, గ్రాఫిక్‌ డిజైనర్లకూ అధిక అవకాశాలున్నాయి. వస్తువుల నిల్వ, డెలివరీకి సంబంధించిన వ్యవహరాల్లో తక్కువ విద్యార్హతలున్న వారికీ ఉద్యోగాలు లభిస్తున్నాయి.
అగ్రశ్రేణి సంస్థల నుంచీ..
శరవేగంతో వృద్ధి చెందుతున్న రంగంలో, దూసుకెళ్లాలంటే ఉన్నతస్థాయిలో అత్యున్నత మేనేజ్‌మెంట్‌/టెక్నాలజీ నిపుణులు కావాలనేది ఇ కామర్స్‌ పోర్టళ్ల అభిప్రాయం. ఇందుకోసమే ఐఐటీలు, ఐఐఎంల వంటి దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచీ, ఐటీ-ఎఫ్‌ఎంసీజీ సంస్థల నుంచీ నిఫుణులను ఎక్కువ జీతంపై నియమించుకుంటున్నారు. ఈ వ్యాపారంలోని సంక్లిష్టతను అర్థం చేసుకుని, మెరుగైన సేవలు అందించే వారినే ఎంచుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ పోర్టళ్లకు యువతే మహారాజ పోషకులు కనుక, వారి అభిరుచులను అంచనా వేసే 'యువ నైపుణ్యానికి' ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలోని అగ్రశ్రేణి మేనేజ్‌మెంట్‌ స్కూళ్లలో ఎంబీఏ పూర్తిచేసిన వారిలో నాలుగోవంతు మంది ఇ కామర్స్‌ పోర్టళ్లలో ఉపాధికి ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) నుంచీ నిపుణులను అధిక వేతనాలపై ఇ కామర్స్‌ పోర్టళ్లు ఎంపిక చేసుకున్నాయి. ఉద్యోగస్థాయికి అనుగుణంగా రిటైల్‌, బ్యాంకింగ్‌, ఐటీ-బీపీఓ రంగాల కంటే ఎక్కువ వేతనం ఇస్తూ, ఆయా రంగాల వారిని ఆకర్షిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ స్థాయిలోని వారికి ఏడాదికి రూ.8-12 లక్షలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.50లక్షలు అంతకుమించి ఆఫర్‌ చేస్తున్నారని రాండ్‌స్టడ్‌ తెలిపింది. ఉన్నతోద్యోగులు రిస్క్‌ చేసి, ఈ రంగంలోకి వస్తున్నందునే అధిక వేతనాలు ఇస్తున్నారు. వచ్చే ఏడాది ఈ రంగం 60,000 మందికి కొత్త ఉద్యోగాలు ఇస్తుందని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా అంచనా వేస్తోంది.
నిర్వహణ ఖర్చు తగ్గించడంపైనే విజయం
తక్కువ ధరల్లో వస్తువులను విక్రయించడం వల్లే ఇ కామర్స్‌ పోర్టళ్లు అమిత ఆదరణ పొందుతున్నాయి. విక్రయశాలల కంటే తగ్గించి అమ్మేందుకు, ప్రత్యేక బడ్జెట్లను ఈ సంస్థలు కేటాయిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఇది సాధ్యం కాదు. అందుకే నిర్వహణ ఖర్చులు తగ్గించే వ్యవస్థలపై దృష్టిసారిస్తున్నాయి. పుస్తకాలు, దుస్తులు, ఫ్యాషన్‌ ఉపకరణాలు, బూట్లు, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌, మందులు, నిత్యావసరాలు, కూరగాయలను కూడా ఆర్డరుపై, తక్కువ ధరల్లో, సాధ్యమైనంత త్వరగా ఖాతాదారులకు చేర్చేందుకు ఇ కామర్స్‌ పోర్టళ్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారవ్యయం, విక్రయాల్లో రెండు-మూడు వ్యవస్థలు (ప్రాంతీయ నిల్వదారు టోకు, రిటైల్‌ వ్యాపారులు) లేకపోవడం వంటివి కలిసి వస్తున్నాయి. ఇందుకోసం వినూత్న పద్ధతులు రూపొందించే వారికి మంచి అవకాశాలున్నాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning