లక్ష్యం మారుతోంది..

* ఉద్యోగాన్ని కాదని.. ఉన్నత విద్యే కావాలని..
* విదేశీ వర్సిటీలకు త్రిపుల్‌ఐటీ విద్యార్థులు
* ఏటా పదుల సంఖ్యలో చేరిక
* పరిశోధనలపై పెరుగుతున్న ఆసక్తి

ఈనాడు, హైదరాబాద్‌: అక్కడ బీటెక్‌ మూడో సంవత్సరంలో ఉండగానే ప్రాంగణ నియామకాల్లో కంపెనీలు ఎగరేసుకుపోతాయి... బహుళజాతి కంపెనీలు సైతం ప్లేస్‌మెంట్ల కోసం క్యూ కడతాయి. కానీ అక్కడి విద్యార్థులు మాత్రం వాటిపై పెద్దగా ఆసక్తి చూపరు.. వాస్తవానికి ఉద్యోగం కోసమే విద్యార్థులు అక్కడ చేరుతున్నా.. తదనంతరం తమ లక్ష్యాన్ని మార్చుకుంటున్నారు. ఉన్నత విద్య, పరిశోధనే మా లక్ష్యమంటూ అనేక మంది ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలైన ఎంఐటీ, సీఎంయూ, స్టాన్‌ఫర్డ్‌ లాంటి వాటిల్లో చేరిపోతున్నారు. డీమ్డ్‌ విశ్వవిద్యాలయమైన గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(త్రిపుల్‌ఐటీ)లో ప్రస్తుత పరిస్థితి ఇది. ఉన్నత విద్య, పరిశోధనే ధ్యేయంగా ఇక్కడ బోధన కొనసాగుతుండడం విశేషం.
గచ్చిబౌలిలోని త్రిపుల్‌ఐటీలో బీటెక్‌ కోర్సుల్లో చేరిన వారిలో అధిక శాతం మంది ఐఐటీలతోపాటు కొన్ని ప్రముఖ ఎన్‌ఐటీల్లో సీటు రాని వారే ఉంటారు. ఇక్కడ చేరే ముందు బీటెక్‌ పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని వచ్చే విద్యార్థులు అనంతరం ఇది పరిశోధనా విశ్వవిద్యాలయమని అర్థం చేసుకుంటున్నారు. బీటెక్‌లోనే సదస్సుల్లో పాల్గొనడం, ఐటీకి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం, బీటెక్‌లోనూ పరిశోధనకు సౌకర్యాలు ఉండటం, ఆచార్యులు సైతం వివిధ పరిశోధనల్లో క్రియాశీలకంగా పాల్గొననుండటం..అతిపెద్ద ఇంక్యుమేటర్‌ కేంద్రం సంస్థలో నెలకొల్పడం తదితర అంశాలను గమనించి తమ లక్ష్యాన్ని మార్చుకునే వారు అధికంగా ఉంటున్నారు. బీటెక్‌ సీనియర్లు, ఎంటెక్‌, పీహెచ్‌డీ విద్యార్థులు సైతం తరగతులు తీసుకుంటుంటారు. దీనివల్ల జూనియర్‌ విద్యార్థులు వారిని చూసి కొత్త ఆలోచనలు మొదలు పెడుతున్నారు. ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు.
20 శాతం మంది విదేశీ వర్సిటీల్లోకి...
ఇక్కడ చేరే బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ విద్యార్థుల్లో కనీసం 20-25 శాతం మంది విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు, పరిశోధన చేసేందుకు వెళ్తున్నారు. బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ మొత్తం సీట్లు సుమారు 335 వరకుంటాయి. వారిలో అత్యధిక శాతం మంది లక్ష్యం అమెరికాలోని మసాచుసెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ), స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, కార్నెగీ మిలన్‌ యూనివర్సిటీ(సీఎంయూ)లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని త్రిపుల్‌ఐటీ ఆర్‌ అండ్‌ డీ డీన్‌ ఆచార్య వాసుదేవ వర్మ చెప్పారు.వాటితోపాటు యూరప్‌ దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో అధిక శాతం మంది చదువుతున్నారు. ప్రస్తుతం ఎంఐటీ, సీఎంయూ విశ్వవిద్యాలయాల్లో ఇక్కడ చదివిన వారు పదుల సంఖ్యలోనే ఉంటారని ఆయన తెలిపారు. త్రిపుల్‌ఐటీ ఛాన్సెలర్‌గా ఆచార్య రాజిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన సీఎంయూలోనే పనిచేస్తున్నారు. ఐటీ నిపుణుడిగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. కంప్యూటర్‌ సైన్స్‌లో ఆ వర్సిటీ అగ్రస్థానంలో ఉంది. దాంతో విద్యార్థులు సీఎంయూను లక్ష్యంగా నిర్ణయించుకుంటున్నారు. ఎంఐటీ లాంటి సంస్థల్లో నోబెల్‌ గ్రహీతలుంటారు. అక్కడ చదివితే వారితో కలిసి పనిచేయవచ్చని కూడా ఆలోచిస్తుంటారని ఆచార్యులు చెబుతున్నారు. 'ప్రతిఏటా ఒకరో ఇద్దరో నా విద్యార్థులు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో 2-3 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు ఎంపికవుతుంటారు. ఆ తర్వాత వారి లక్ష్యం మరింత పెరుగుతుంది' అని అసోసియేట్‌ ప్రొ.వెంకటేష్‌ చొప్పెల్ల చెప్పారు. గతేడాది భారీ వేతనంతో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు ఫేస్‌బుక్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. వారిలో ఒకరు తాను విదేశీ విశ్వవిద్యాలయంలో పీజీ చేయాలని భావించి ఉద్యోగంలో చేరలేదు.
పోటీ ఏదైనా పాల్గొనాల్సిందే..
గూగుల్‌ కంపెనీ ప్రతిఏటా గూగుల్‌ సమ్మర్‌ ఆఫ్‌ కోడింగ్‌ పేరిట ఇంటర్న్‌షిప్‌ కోసం పోటీలు నిర్వహిస్తుంది.ఎంపికైతే 5,500 అమెరికా డాలర్లు చెల్లిస్తారు. సాధారణంగా మూడో సంవత్సరం విద్యార్థులకు ఇస్తారు. వేసవి కాలంలో సమర్పించిన ఆలోచనపై ఓపెన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఇక్కడి నుంచే పని చేయాల్సి ఉంటుంది. దీనికి భారత్‌లో అత్యధిక మంది ఇక్కడి త్రిపుల్‌ఐటీ విద్యార్థులే ఎంపికవుతున్నారు. గతేడాది 80 మంది ఎంపిక కావడం విశేషం. మొత్తం మీద 2005-12 వరకు గణాంకాలను తీసుకుంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది ఎంపికైన సంస్థల్లో త్రిపుల్‌ఐటీ 8వ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన నాసా ప్రతిఏటా కాన్‌శాట్‌ పేరిట పోటీలు నిర్వహిస్తుంది. ఆ పోటీల్లో 2009 నుంచి ఫైనల్‌కు చేరుకుంటున్న ఏకైక భారత విద్యార్థి బృందం త్రిపుల్‌ఐటీదే కావడం విశేషం.
జీఆర్‌ఈ, టోఫెల్‌ గురించి అసలే ఆలోచించరు - ఆచార్య వాసుదేవ వర్మ, ఆర్‌ అండ్‌ డీ డీన్‌, త్రిపుల్‌ఐటీ
ఇక్కడ చేరిన తర్వాత సాధారణ పనిపై అనాసక్తి కలుగుతుంది. లక్ష్యాలు పెరుగుతాయి. పూర్తిగా సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనే ఆలోచన పెరుగుతుంది. బీటెక్‌ చదువుతూ చాలా మంది సదస్సుల్లో పాల్గొనడం, పరిశోధనా పత్రాలు సమర్పిస్తుంటారు. వాళ్లను చూసి జూనియర్లు సైతం ఆసక్తి పెంచుకుంటారు. త్రిపుల్‌ఐటీకి 30 విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలున్నాయి. దానివల్ల 3-6 నెలలపాటు ఇక్కడి విద్యార్థులు అక్కడికి, అక్కడి విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. దానివల్ల విద్యార్థులు విదేశాల్లోని సౌకర్యాలు, అక్కడి పరిశోధన, విద్యాబోధన గురించి తెలుసుకుంటూ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. బీటెక్‌ లో ఉండగానే పరిశోధనా పత్రాలపై దృష్టి పెడుతున్నారు. ఫలితంగా ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య సీట్లు పొందేందుకు వెయిటేజీ పెరుగుతుంది.కొందరు చదువు పూర్తయిన వెంటనే ఉన్నతవిద్య, పరిశోధన కోసం విదేశాలు వెళ్తుండగా మరికొందరు ఒకటీరెండు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత వెళ్తున్నారు.
ఉద్యోగమే ముఖ్యం కాదు.. - రవిరాజా, బీటెక్‌ రెండో సంవత్సరం విద్యార్థి
త్రిపుల్‌ఐటీకి రాకముందు అధిక శాతం మంది బీటెక్‌ పూర్తి చేయడం, ఆ తర్వాత ఉద్యోగం వెతకడం గురించే ఆలోచిస్తారు. ఇక్కడ చేరిన తర్వాత కొద్ది నెలల్లోనే ఆలోచన తీరు మారుతుంది. ఉద్యోగం కావాలంటే మూడో సంవత్సరంలో ఎంపిక కావొచ్చు. ఇక్కడ 100 శాతం ప్రాంగణ నియామకాలుంటాయి. కాన్సెఫ్ట్స్‌ నేర్చుకుంటూ...వివిధ కార్యక్రమాల్లో, పోటీల్లో పాల్గొంటూ ఉండటం ముఖ్యం అన్న ఆలోచన ధోరణి పెరిగిపోతుంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం, కొత్త ఆవిష్కరణల గురించి ఆలోచిస్తారు. నా లక్ష్యం కచ్చితంగా ఉద్యోగమైతే కాదు... మరో ఏడాదిలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటా.
మొదటి ఏడాది నుంచే... - కొల్లా సాయిరామ్‌, బీటెక్‌ మొదటి సంవత్సరం
మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా పరిశోధనా విశ్వవిద్యాలయం. అందువల్ల ఇక్కడ పని వాతావరణం విభిన్నంగా ఉంటుంది. పరిశోధనకు సౌకర్యాలు చాలా బాగుంటాయి. జేఎన్‌టీయూహెచ్‌ లాంటి వర్సిటీ పరిధిలో మొదటి సంవత్సరం భౌతిక, రసాయన శాస్త్రాలు ఉంటాయి. త్రిపుల్‌ఐటీలో అవి ఉండవు. మొదటి సంవత్సరం నుంచే ప్రత్యక్షంగా సాంకేతిక సబ్జెక్టులోకి దిగుతాం. ఇక్కడ 3-4 గంటలు మాత్రమే తరగతి బోధన ఉంటుంది. మిగతావి ప్రాక్టికల్స్‌, ఇతర కార్యక్రమాలుంటాయి. ఇక్కడ చాలా మంది విద్యార్థులు విదేశాలు వెళ్తున్నా ఉన్నత విద్య, పరిశోధన కోసమేగానీ ఉద్యోగాల కోసం కాదు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning