ఐఈఎల్‌టీఎస్‌... రాస్తున్నారా?

మనదేశ విద్యార్థులు ఆంగ్లం ప్రధానభాషగా ఉన్న విదేశాల్లో చదవాలన్నా, పని చేయటానికి వెళ్లాలన్నా రాయాల్సిన పరీక్ష ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌ (IELTS ). ఇది ఇంగ్లిష్‌ భాషలో వారి ప్రతిభను పరీక్షిస్తుంది. 130కుపైగా దేశాల్లో నిర్వహించే ఈ పరీక్ష ఎంతో ప్రాచుర్యం పొందింది!
ఐఈఎల్‌టీఎస్‌ను బ్రిటిష్‌ కౌన్సిల్‌, ఆస్ట్రేలియన్‌ కౌన్సిల్‌- ఐడీపీలు నిర్వహిస్తాయి. ఈ టెస్టు స్కోరును ప్రపంచవ్యాప్తంగా 9వేలకు పైగా సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. విశ్వవిద్యాలయాలూ, బహుళజాతి సంస్థలూ, ఇమిగ్రేషన్‌ విభాగాలూ, ప్రభుత్వ ఏజెన్సీలూ వీటిలో ఉన్నాయి.
ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష రెండు వర్షన్లుగా ఉంటుంది. ఇంగ్లిష్‌ మాట్లాడే ప్రజలున్న యు.ఎస్‌.ఎ., కెనడా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో చదువుకోవడానికి 'ఎకడమిక్‌ ఐఈఎల్‌టీఎస్‌' రాయాల్సివుంటుంది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, కెనడా, యు.కె. లాంటి దేశాల్లో పనిచేయదల్చినవారూ, శిక్షణ కార్యక్రమాల్లో చేరదల్చినవారూ 'జనరల్‌ ఐఈఎల్‌టీఎస్‌' పరీక్ష రాయాల్సివుంటుంది.
పరీక్షా పద్ధతి
ఐఈఎల్‌టీఎస్‌ పేపర్‌ ఆధారిత పరీక్ష. అంటే పెన్‌/పెన్సిల్‌తో సమాధానాలు రాయాలి. ఈ పరీక్షలో నాలుగు మాడ్యూళ్లు ఉంటాయి. అభ్యర్థి ఆంగ్లభాషను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇవి పరీక్షిస్తాయి. ఇవి లిసనింగ్‌ (30 నిమిషాలు), రీడింగ్‌ (60 నిమిషాలు), రైటింగ్‌ (60 నిమిషాలు), స్పీకింగ్‌ (11-14 నిమిషాలు). మొదటి మూడింటినీ one sitting లో నిర్వహిస్తారు. స్పీకింగ్‌ టెస్టు అదేరోజు గానీ, ఇతర టెస్టులు పూర్తయిన ఏడురోజుల్లో గానీ ఉంటుంది. అకడమిక్‌ జనరల్‌ ఐఈఎల్‌టీఎస్‌లు రెంటికీ లిసనింగ్‌- స్పీకింగ్‌ విభాగాలు ఒకటే.
కానీ రీడింగ్‌, రైటింగ్‌ మాడ్యూళ్ళు మాత్రం అకడమిక్‌ - జనరల్‌ టెస్టులకు వేర్వేరు. అకడమిక్‌ రీడింగ్‌ మాడ్యూల్‌కు పాఠ్యపుస్తకాలూ, జర్నల్స్‌ నుంచీ; జనరల్‌ రీడింగ్‌ మాడ్యూల్‌కు వార్తాపత్రికలూ, మ్యాగజీన్ల నుంచీ పాసేజ్‌లను ఇస్తారు. అకడమిక్‌ ఐఈఎల్‌టీఎస్‌ రైటింగ్‌ మాడ్యూల్‌కి రిపోర్ట్‌ రైటింగ్‌, పర్సువేసివ్‌ ఎస్సే అనే టాస్కులుంటాయి. జనరల్‌ ఐఈఎల్‌టీఎస్‌లో లెటర్‌ రైటింగ్‌, పర్సువేసివ్‌ ఎస్సే ఉంటాయి.
స్కోరు తీరు?
ఐఈఎల్‌టీఎస్‌ టెస్ట్‌ స్కోరింగ్‌ 0 నుంచి 9 బ్యాండ్‌ స్కేల్‌ మధ్య ఉంటుంది. ప్రతి విభాగానికి చెందిన లిసనింగ్‌, రీడింగ్‌, రైటింగ్‌, స్పీకింగ్‌లకు విడివిడిగా స్కోరుంటుంది. నాలుగు మాడ్యూళ్ల సగటును బట్టి ఓవరాల్‌ ఐఈఎల్‌టీఎస్‌ స్కోరు ప్రకటిస్తారు.
విదేశాల్లో చదవదల్చినవారు మొత్తమ్మీద కనీసం 6.5 బ్యాండ్‌ స్కోరు సాధించాల్సివుంటుంది. విద్యాసంస్థను బట్టి ఈ స్కోరు మారవచ్చు. పరీక్షకు హాజరయ్యేముందే తాము దరఖాస్తు చేసే విశ్వవిద్యాలయం ఎంత స్కోరును పరిగణనలోకి తీసుకుంటుందో తెలుసుకోవటం మేలు.
నెలకు నాలుగు సార్లు- గురు, శనివారాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. లిసనింగ్‌, రీడింగ్‌, రైటింగ్‌ మాడ్యూళ్ళు అదేరోజు పూర్తవుతాయి. ఒక్కో అభ్యర్థికి ఒక సమయం కేటాయించి వేరే రోజున స్పీకింగ్‌ టెస్ట్‌ జరుపుతారు. ఐఈఎల్‌టీఎస్‌కు ప్రతి సంవత్సరం 48 నిర్దిష్ట టెస్ట్‌ తేదీలుంటాయి. అకడమిక్‌ వర్షన్‌ 48 సార్లూ, జనరల్‌ వర్షన్‌ 24 సార్లూ జరుగుతుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమకు దగ్గర్లో ఉన్న పరీక్ష కేంద్రం, జరిగే తేదీలను చూడవచ్చు. www.britishcouncil.in/exam/ielts , www.ieltsidpindia.com/లో గానీ టెస్టుకు రిజిస్టర్‌ చేసుకోవాలి.
అకడమిక్‌, జనరల్‌ టెస్టులకు ఒకేరకమైన ఫీజుంటుంది. మనదేశంలో రూ.9900ను నిర్ణయించారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నాల్లోని బ్రిటిష్‌ కౌన్సిల్‌, ఐడీపీ కేంద్రాల్లోని కౌంటర్లలో గానీ, ఆన్‌లైన్‌లో క్రెడిట్‌ కార్డు ద్వారా గానీ ఫీజు చెల్లించవచ్చు. ఆశించిన స్కోరు సాధించేదాకా ఎన్నిసార్లయినా ఈ పరీక్షకు హాజరుకావొచ్చు.
పరీక్ష రాశాక స్కోరు రెండేళ్ళపాటు చెల్లుతుంది. ఆ వ్యవధి దాటాక విశ్వవిద్యాలయాలూ, ఇమిగ్రేషన్‌ విభాగాలూ, ఇతర సంస్థలూ ఈ స్కోరును అంగీకరించకపోవచ్చు.
ఇలా సిద్ధమవ్వాలి
ఈ టెస్టు రాయదల్చిన విద్యార్థులు తమ ఆంగ్లభాషా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. టీవీలో వచ్చే ఇంగ్లిష్‌ ఆధారిత కార్యక్రమాలు చూడటం- లిసనింగ్‌ కాంప్రహెన్షన్‌కు ఉపయోగం. వార్తాపత్రికలూ, మ్యాగజీన్లూ, పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంటే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నైపుణ్యాలు పెరుగుతాయి. స్నేహితులతోనైనా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూవుంటే స్పీకింగ్‌ నైపుణ్యాలు మెరుగవుతాయి.
నాలుగు మాడ్యూళ్ళకూ సంబంధించి ఆన్‌లైన్లో విస్తృతంగా మెటీరియల్‌, సమాచారం లభ్యమవుతోంది. అభ్యర్థులు టెస్ట్‌ స్వరూపంపై మంచి అవగాహన పెంచుకోవాలి. వివిధ సైట్లలో ఉన్న నమూనా ప్రశ్నలూ, ప్రాక్టీస్‌ టెస్టుల సాయంతో ఎవరికి వారు తమ భాషాసామర్థ్యాలను అంచనా వేసుకోవచ్చు.
సుశిక్షితులైన ఐఈఎల్‌టీఎస్‌ ట్యూటర్ల సాయం తీసుకుంటే మార్గదర్శకత్వం లభించి స్కోర్లు పెరుగుతాయి. సన్నద్ధతకు ఎంత సమయం అవసరమనేది అభ్యర్థి భాషాపరిజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. టెస్ట్‌ తేదీ కంటే ముందు తగినంత సమయం ఉండేలా చూసుకుని సన్నద్ధమవటం ఎల్లప్పుడూ మంచిది. టెస్ట్‌ స్లాట్‌ను ముందుగానే బుక్‌ చేసుకోవటం శ్రేయస్కరం.
ఉపయోగపడే సైట్లు
www.ielts.org
www.britishcouncil.org/learning-ielts.htm
www.cambridgeesol.org/exam/academic-english/ielts.html
www.idp.com/examinations/ielts/about the test.aspx
www.ieltsusa.org.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning