గూగుల్‌లో గెలిచా ఫేస్‌బుక్‌కి ఎంపికయ్యా!

గణితమంటే చాలా మందికి భయం... కానీ స్పందనకి ఆ సబ్జెక్టే ఇష్టం. ఆరోతరగతిలో ఉన్నప్పుడే పదోతరగతి లెక్కలు చేసేది. అలాంటి అమ్మాయికి ఐఐటీయే లక్ష్యమైంది. ఆ లక్ష్యాన్ని సులువుగా సాధించడమే కాదు, మూడేళ్లుగా మద్రాస్‌ ఐఐటీ టాపర్‌గా నిలుస్తూనే ఉంది. ఆ నేపథ్యంతో ఆసియా పసిఫిక్‌ దేశాల్లో ప్రతిభావంతులైన విద్యార్థినులకు గూగుల్‌ ఇచ్చే ప్రతిష్టాత్మక ఉపకార వేతనానికి ఎంపికైంది. అందులో భాగంగా టోక్యోలోనిగూగుల్‌ కార్యాలయాన్ని చుట్టొచ్చింది వరంగల్‌ అమ్మాయి స్పందనారాజ్‌.
ఈ ఏడాది జులైలో ఇంటర్న్‌షిప్‌ కోసం బెంగళూరు వెళ్లా. ఓ రోజు మధ్యాహ్నం భోంచేశాక మెయిల్‌ తెరిచా. అందులో ఉన్న ఒక మెయిల్‌ చూసి నన్ను నేనే నమ్మలేకపోయా. ఆనందం పట్టలేక నాన్నకి ఫోన్‌ చేసి విషయం చెప్పా. ఆ మెయిల్‌లో... గూగుల్‌ సంస్థ ఉపకార వేతనానికి ఎంపికైనట్టూ, త్వరలో టోక్యోలోని తమ కార్యాలయ సందర్శనకు నన్ను ఆహ్వానిస్తున్నట్టూ సమాచారం ఉంది. కొన్ని నెలల క్రితం దానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు నేను ఎంపికవుతానా అని ఆలోచించా. ఎన్నో దేశాల నుంచి, నా కన్నా బాగా చదివే వాళ్లు వేలూ, లక్షల్లో దరఖాస్తు చేస్తారు కదా అనుకున్నా. కానీ ఎంపికయ్యానని తెలిశాక చాలా సంతోషపడ్డా. అయితే దీనికి నేను ఎంపికయ్యానంటే కారణం... నా చదువే.
ఒక్కసారి మనసులో పడ్డాక...
మా నాన్న లెక్కల టీచరు. ఆ ప్రభావం నాపై ఉందేమో... చిన్నప్పట్నుంచీ ఎక్కువ సమయం లెక్కలు చేస్తూనే గడిపేదాన్ని. తరగతిలో పాఠాలు విన్నాక నాకు నేనే నోట్సు రాసుకునేదాన్ని. బట్టీ పట్టడం నేనింత వరకూ చేయని పని. చెబితే నమ్ముతారో లేదో కానీ... నేను నర్సరీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ క్లాసులో ఫస్టే. అంతేకాదు, పదో తరగతిలో ఐదొందల డెబ్భై రెండు మార్కులతో జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలిచా.ఇంటర్‌లో 983 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు తెచ్చుకున్నా. అలాగని నేనేమీ పుస్తకాల పురుగుని కాదు. అందరిలాగే ఆడుకునే దాన్ని. స్నేహితులతో సరదాగా గడిపేదాన్ని. స్కూల్లో చదవడమే తప్ప ట్యూషన్లకు వెళ్లింది లేదు. ఇంటి దగ్గర నాన్నగారే చదివించే వారు. క్లాసులో పాఠాలు చెబుతున్నప్పుడు టీచర్లు చాలా విషయాలు చెబుతారు. వాటిని అప్పటికప్పుడు రాసుకుని, తరవాత సొంతంగా నోట్స్‌ సిద్ధం చేసుకుంటాను. ఈ అలవాటు ఇప్పటికీ నాకెంతో మేలు చేస్తోంది. మార్కుల్ని తెప్పిస్తోంది. పదో తరగతిలో ఉండగా ఐఐటీ గురించి విన్నా. చాలా కష్టపడి చదివే వాళ్లకే అందులో సీటు వస్తుందని చెప్పారు కొందరు. ఒకసారి దాని గురించి తెలిశాక, అదే నా లోకమైంది. అందులో సీటు సంపాదించాల్సిందే అని పదో తరగతిలోనే నిశ్చయించుకున్నా. అందుకే ఇంటర్‌ ఎంపీసీలో చేరా. మా కాలేజీలోనే ఐఐటీ కోచింగ్‌ కూడా ఇచ్చేవారు. ఐఐటీ-జేఈఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 369వ ర్యాంకు సాధించా. నా మొత్తం చదువులో ఒకే ఒక్కసారి కొంచెం బాధపడ్డా. అది ఐఐటీ ర్యాంకు తెలిశాక. ఎందుకంటే నేను అంతకంటే మంచి ర్యాంకు వస్తుందని ఆశించా!
మూడేళ్లుగా టాపర్‌ని...
ఎప్పటికప్పుడు లక్ష్యాలను విస్తరించుకుంటూ ఉండాలి. ప్రతిభను పెంచుకుంటూ వెళ్లాలి. ఈ రెండింటినే నేను పాటించాను. చిన్నప్పట్నుంచి వరంగల్‌ తప్ప నాకు వేరే ప్రాంతం తెలియదు. వేరే రాష్ట్రానికి వెళతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఐఐటీలో చేరాలి అనుకున్నాక ఇతర రాష్ట్రానికి వెళ్లయినా చదవాలనుకున్నా. చదువు కోసం అమ్మానాన్నలకు దూరంగా చెన్నై వెళ్లా. ఇక్కడ ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ కోర్సు చేస్తున్నా. అంటే కంప్యూటర్‌ సైన్సులో బీటెక్‌, ఎంటెక్‌ ఒకేసారి పూర్తి చేస్తున్నా. ఈ ఏడాది ఫైనల్‌ ఇయర్‌. ఐఐటీలో చేరిన తరవాత కూడా మూడు సార్లు చెన్నై ఐఐటీ టాపర్‌గా నిలిచా. నా మార్కులూ, చదువులో నా విజయాలే నన్ను ప్రతిష్టాత్మక గూగుల్‌ ఉపకారవేతనానికీ, అలాగే ఫేస్‌బుక్‌ సంస్థ ఇచ్చే ఉపకార వేతనానికీ ఎంపికయ్యేలా చేశాయి.
ఇలా ఎంపికయ్యా...
గూగుల్‌ సంస్థ ప్రతి ఏడాది ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో చదువుల్లో చిన్నప్పట్నుంచీ ప్రతిభ కనబరిచే అమ్మాయిలకు ప్రతిష్టాత్మక అనితా బోర్గ్‌ స్మారక ఉపకార వేతనం ఇస్తోంది. దీనికి ఎంపికైన వారికి లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌ ఇస్తారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. అటువంటి చోట మహిళల శాతం కేవలం పదిహేను. ఈ రంగంలోకి మరింత మంది అమ్మాయిలొచ్చి, మంచి అవకాశాలు పొందేలా గూగుల్‌ ఈ తరహా ప్రోత్సాహం అందిస్తోంది. మా ఉపాధ్యాయులు కొంతమంది ఆ ఉపకారవేతనం గురించి చెబితే, నేను ఉత్సాహంగా దరఖాస్తు చేశాను. గూగుల్‌ ఉన్నతాధికారులు వాళ్లకొచ్చిన వేల దరఖాస్తుల నుంచి మొత్తంగా 27 మంది అమ్మాయిల్నీ ఎంపిక చేశారు. అందులో మన దేశం నుంచి ఏడుగురున్నారు. వీరిలో తెలుగమ్మాయిని నేనే. నాతో సహా ఎంపికైన వారందర్నీ ఈ నెలలో వారం పాటు గూగుల్‌ సంస్థ... టోక్యోలోని తన కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ ఉద్యోగుల్ని కలిసి, పని వాతావరణాన్ని పరిశీలించే అవకాశం కల్పించింది. అక్కడ నేను కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగుల స్ఫూర్తిమంతమైన ప్రసంగాలను విన్నా. మాటలకు దీటుగా పని చేస్తుండటాన్ని గమనించి ప్రేరణ పొందా. కంప్యూటర్‌ రంగంలో అమ్మాయిలు ముందడుగు వేయాలన్నిది వారి అభిలాష. అక్కడ నేను చాలా విషయాలు గమనించా. భారతీయుల ప్రతిభపైనా, అందులోనూ మహిళా శక్తిపైనా గూగుల్‌ సంస్థకి అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి.
ఫేస్‌బుక్‌ సదస్సుకి వెళ్తున్నా...
ఫేస్‌బుక్‌ కూడా గూగుల్‌ తరహాలోనే కంప్యూటర్‌ రంగంలో ఉన్న అమ్మాయిలకి ఉపకార వేతనాలు అందిస్తోంది. వివిధ దేశాల నుంచి చదువులో ముందుండే అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రపంచం మొత్తమ్మీద కేవలం పాతిక మందికే దీన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది దీనికీ నేను ఎంపికయ్యా. త్వరలో అమెరికాలోని ఫీనిక్స్‌లో జరిగే సదస్సుకు వెళ్తున్నా. దానికి మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల లాంటి దిగ్గజాలు వస్తున్నారు. నా దరఖాస్తులో కూడా 'సత్య నాదెళ్లను కలవాలనుంది'అని రాశా. ఆయన్ని కలిసే అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నా.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning