ముందుచూపుతో... మున్ముందుకు!

ఇంజినీరింగ్‌ చదివే నాలుగేళ్ల వ్యవధిని ప్రయోజనకరంగా మల్చుకుంటేనే భవితకు భరోసా. కొత్తగా కళాశాలలో ప్రవేశించిన విద్యార్థులు ఏ దిశలో ముందడుగు వేయాలి?
'ప్రణాళికాబద్ధంగా ప్రారంభించిన పని సగం పూర్తిచేసినదానితో సమానం' అనే నానుడి ఉంది. ఏదైనా పనిలో ఆశించిన ఫలితాలు సాధించాలంటే దానిని ప్రణాళిక ప్రకారం చెయ్యడం ఎంతో అవసరం. అప్పుడు మిగిలిన సగం పని కూడా తప్పకుండా సంతృప్తికరంగా పూర్తిచెయ్యవచ్చు. మొదటి మూడు నెలల ఇంజినీరింగ్‌ చదువు గాడిలో పడిన తరువాత భవిష్యత్‌ ప్రణాళికపై దృష్టి సారించాలి.
అంటే బ్రాంచికి సంబంధించిన ఏ రంగంలో మనకు అభిరుచి ఉంది, బీటెక్‌ రెండు, మూడు, నాలుగు సంవత్సరాల్లో ఏ అంశం మీద ప్రాజెక్టు చేస్తే బాగుంటుంది, ప్రస్తుతం విపణిలో లభ్యమౌతున్న మన రంగానికి సంబంధించిన టెక్నాలజీలు, వివిధ రకాల పనిముట్లు, సాధకాలు (Tools and Utilities) ఏమిటి, వాటి వల్ల అవకాశాలు ఎలా మెరుగవుతాయి, ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది... ఇలాంటి అంశాలపై విషయ సేకరణ జరపాలి. అవసరమైతే అధ్యాపకులతో, సహ విద్యార్థులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
ఒకవేళ ఉన్నత విద్యలకు వెళ్ళే ఆలోచనలు ఉంటే, విదేశాలలోనా, స్వదేశంలోనా అన్నది కూడా నిర్ణయించుకోవాలి. జి.ఆర్‌.ఇ. లాంటి పరీక్షలు రెండో సంవత్సరంలోనే చెయ్యడం అభిలషణీయం. జి.ఆర్‌.ఇ. స్కోరు చెల్లుబాటు వ్యవధిని ఇటీవలే ఐదేళ్ళకు పెంచారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడో సంవత్సరం నుంచి సబ్జెక్టులపై ప్రత్యేక, కేంద్రీకృత శ్రద్ధ చూపించవచ్చు. తమ బ్రాంచికి సంబంధించిన ఉద్యోగ పరీక్షల పూర్వ ప్రశ్నపత్రాలు సేకరించి వాటిని సాధించడం అలవరచుకోవాలి.
* ఉదాహరణకు గేట్‌కు తయారు కావాలనుకుంటే బీటెక్‌ మొదటి సంవత్సరం నుంచే సంబంధిత ప్రశ్నపత్రాలను సేకరించి, అభ్యాసం చెయ్యడం లక్ష్యంగా పెట్టుకోవాలి. అంతేకాదు- గేట్‌లో ఎంత స్కోరు, ర్యాంకు సాధించాలి, ఏ ఐ.ఐ.టి.లో ఎంటెక్‌ చెయ్యాలి, అందులోకి ప్రవేశం దొరకాలంటే సాధించవలసిన ర్యాంకు ఎంత అన్న విషయాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి.
* విదేశాలలో చదువులకైతే మన బ్రాంచికి సంబంధించిన వివిధ కోర్సులకు ఏయే యూనివర్సిటీలు బాగుంటాయి, ఎక్కడ అభ్యాసక బృందం బాగుంటుంది అన్న విషయంలో స్పష్టత తెచ్చుకోవాలి. ఆ దిశగా అడుగులు వేసి పటిష్ఠమైన బీటెక్‌ పునాదిగా భవిష్యత్తును మలచుకోవాలి.
చెయ్యకూడని పనులు
నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే పైన చెప్పిన పనులు చెయ్యడమే కాకుండా చెయ్యకూడనివి కూడా తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలి.
1. ఇంటర్మీడియట్‌లో సంపాదించుకున్న పరిజ్ఞానాన్ని మరవకూడదు.
* ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఎన్నో మౌలికాంశాలుంటాయి. వాటి ఆధారంగానే ఇంజినీరింగ్‌ చదువుంటుంది. అంతేకానీ పూర్తిగా కొత్తగా నేర్చుకునేదేదీ ఉండదు. కాబట్టి 'ఇంజినీరింగ్‌లోకి వచ్చేశాం, ఇక ఇంటర్మీడియట్‌ సంగతి మరచిపోవచ్చు' అనే ఆలోచన వట్టి భ్రమే. కోచింగ్‌ సెంటర్లలో, ట్యూషన్లలో మౌలిక స్థాయిలో కాకుండా కొంత పైస్థాయిలోనే శిక్షణనిస్తుంటారు. పరీక్షల్లో ఫలితాలు మాత్రమే వారికి ప్రధాన అంశంగా ఉంటుంది. నైపుణ్యాలూ, పరిజ్ఞానం పెంచుకోవాలనుకున్నవారు అలాంటి శిక్షణ మీద అతిగా ఆధారపడటం మంచిది కాదు.
* క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్ళాలి.
* అధ్యాపకులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
* కోచింగ్‌ కేంద్రాలకంటే కళాశాలలో చెప్పే విషయాలకే ప్రాధాన్యమివ్వాలి. కాలేజీలో నేర్చుకున్న సబ్జెక్టు ఆధారంగా కోచింగ్‌ సెంటర్లో చెప్పే విషయాలను అర్థం చేసుకోవడం సులువౌతుంది. కానీ దీనికి భిన్నంగా కాదు.
* బీటెక్‌కీ, ఇతర పరీక్షలకీ కూడా సమాన ప్రాధాన్యమివ్వాలి.
2. ఏ పనినీ వాయిదా వెయ్యకూడదు.
* 'ఈ పని తరువాత చేద్దాంలే' అన్న అలసత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావీయకూడదు. అసలు ఆ ఆలోచనే మన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడాలి.
* గెలుపును కాంక్షించేవారి ప్రథమ శత్రువు బద్ధకం. నేడు చెయ్యవలసిన పనిని రేపటికి వాయిదా వెయ్యడం ద్వారా వచ్చే లాభమేమీ లేదు. దానికి విరుద్ధంగా రేపు చెయ్యవలసిన పని ఈ రోజే చేస్తే ఎన్నో లాభాలుంటాయి.
3. చివరి నిమిషందాకా ఆగకూడదు.
* చివరి నిమిషంలో చదువుకుని పాస్‌ అవ్వవచ్చులే అనుకోకూడదు. కేవలం పాస్‌ అవ్వడానికి బీటెక్‌లో చేరలేదని గుర్తుంచుకోవాలి. ఇంజినీరింగ్‌ డిగ్రీ ఆధారంగా ఒక గౌరవప్రదమైన ఉద్యోగం, సంఘంలో పరువు కోసం బీటెక్‌లో చేరామే కానీ ఇంకా వేరే దాని కోసమేమీ కాదు అని తెలుసుకోవాలి. అత్తెసరు మార్కులతో పాస్‌ ఐతే సరిపోదు. సబ్జెక్టుపై పట్టు సాధించాలి. అలా జరగాలంటే కళాశాలలో సమయం కాకుండా, అదనంగా ప్రతిరోజూ కనీసం 3- 4 గంటలపాటు చదువు కోసం కేటాయించి శ్రమించాలి. ఈ నాలుగేళ్ళ శ్రమ నలభై ఏళ్ళ బంగారు భవిష్యత్తుకు పునాది అని మరవకూడదు. కష్టపడి చదవాలి. ఇష్టంతో చదవాలి. చదువులలోని ఆనందాన్ని ఆస్వాదించాలి.
కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వార్తాపత్రికలు చదవడం, చుట్టూ ప్రపంచంలో ఏమి జరుగుతున్నది అన్న విషయం కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకించి వార్తాపత్రికల్లో సామాజిక విషయాలపై నిపుణులు వెలిబుచ్చే అభిప్రాయాలను తప్పకుండా చదవాలి. ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, సివిల్‌ సర్వీసెస్‌, ఇతర ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో చాలావరకు జవాబులు వార్తాపత్రికల్లో వచ్చే అంశాలపై ఆధారపడి ఉండేవే ఉంటాయి. వాటిని చదివేవారు సమాధానాలు సులువుగా రాయగలుగుతారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning