యువ మంత్రం సాంకేతిక తంత్రం

* ఐఎస్‌బీ వేదికగా సమస్యలకు పరిష్కారానికి కసరత్తు
* ముందుకొచ్చిన విద్యార్థి లోకం

ఈనాడు, హైదరాబాద్‌ : కాలం మారింది.. వేగం పెరిగింది.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అయినా కొన్ని సమస్యలు మాత్రం ప్రజలను వీడటం లేదు. రోజులు, నెలలు తరబడి వాటి పరిష్కారానికి కుస్తీ పట్టాల్సిన పరిస్థితిని నగరవాసులు ఎదుర్కొంటున్నారు. ఎన్నాళ్లీ దుస్థితి అంటూ ఎవరికి వారు సర్దుకుపోతున్నారు. యువతరం మాత్రం ఇలా ఆలోచించడం లేదు. ప్రతి సమస్యకు చిటికెలో పరిష్కారం చూపుతామని ముందుకొస్తున్నారు. ప్రభుత్వం కూడా పరుగులు పెట్టాలని కోరుతున్నారు.ఇలాంటి వారికోసమే అన్వేషిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందర్నీ ఒక వేదిక మీదకు తెచ్చింది. 'అందమైన నగరం.. అందరి బాధ్యత' అంటూ ప్రజలను భాగస్వాములను చేస్తోంది. ఈ క్రమంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సహకారంతో స్మార్ట్‌ సిటీల రూపకల్పనకు వారి సూచనలు, సలహాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, తాగునీటి సరఫరా, వైపరీత్యాలు ఎదుర్కోవడం.., ఫిర్యాదుల పరిష్కారం, ప్రజాభద్రత, శాంతిభద్రతలు ఇలా నిత్యం ప్రజలకు ఎదురయ్యే ఆయా సమస్యల పరిష్కారానికి మార్గాలను వెతకాలని వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులను ప్రభుత్వం కోరింది. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఐటీ నిపుణులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులు 'హైదరాబాద్‌ అర్బన్‌ హ్యాకథాన్‌ రోప్స్‌ ఇన్‌ సిటిజెన్స్‌ ఫర్‌ అర్బన్‌ ప్లానింగ్‌'లో తలమునకలయ్యారు. ఇలాంటి వారందరికీ శనివారం గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో నిర్వహించిన హ్యాకథాన్‌ సదస్సు వేదికయ్యింది. మొత్తం 390 బృందాల నుంచి 80 బృందాలను ఎంపిక చేశారు. ఈ బృందాలు ఈ నెల 27, 28 తేదీల్లో మొత్తం 36 గంటలు చర్చించి 15 ప్రధాన సమస్యల పరిష్కారానికి మార్గాలు కనుక్కొనే పనిలో పడ్డాయి.
వైపరీత్యాలు సంభవిస్తే...
హైదరాబాద్‌.. లక్షలాది మంది నివసించే ఈ మహానగరంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవించినా క్షణాల్లో స్పందించే వ్యవస్థ ఉండాలి. అందుకు టిప్స్‌ (ట్రాకింగ్‌ ఇంపార్టెంట్‌ పర్సన్స్‌ అండ్‌ సర్వీసెస్‌) పరిష్కారం చూపుతుంది అంటున్నారు వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు సుజిత్‌, మృదుల, ప్రణతి, విశ్వనాథ్‌. డాక్టర్లు, ఇంజినీర్లు, గ్యాస్‌ కట్టర్లు, క్రేన్‌ ఆపరేటర్లు ఇలా అందరి వివరాలు ప్రాంతాల వారీ సేకరించి సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే ఈ అప్లికేషన్‌ ముఖ్య ఉద్దేశం. వర్షాలకు భవనం కూలిపోయినా.. మరే ప్రమాదం సంభవించినా.. ఈ బృందం వెంటనే స్పందించి.. సహాయక చర్యలు చేపడుతుంది. సహాయం త్వరగా అందిఉంటే ప్రాణాలు కొన్నైనా దక్కేవి అనే మాట మనం ప్రమాదాల సమయంలో ఎన్నోసార్లు వింటుంటాం.. అలాంటి సమస్యకు పరిష్కారమే టిప్స్‌ అప్లికేషన్‌ ప్రధాన ఉద్దేశం.
మెరుగైన పారిశుద్ధ్యం ఇలా..
నగరవాసుల్ని నిత్యం పీడించే సమస్య పారిశుద్ధ్యం. ఎక్కడి చెత్త అక్కడే కుళ్లిపోయి దుర్వాసన ప్రబలి ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు తాము రూపొందించిన 'శుభ్రం' అప్లికేషన్‌ చక్కటి పరిష్కార మార్గం చూపుతుందని వాసవి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు గాయత్రి, రవితేజ, శ్రీకాంత్‌, సాయిసుజీత్‌రాజ్‌ అంటున్నారు. ఇళ్లనుంచి చెత్తను సేకరించే మూడు చక్రాల రిక్షాలతో పాటు యార్డులకు తరలించే వాహనాలకు జీపీఎస్‌ విధానం అమరిస్తే.. ఆ వాహనం ఎక్కడ ఉన్నదీ ఇట్టే కనిపెట్టేయవచ్చని చెబుతున్నారు.ఒక్కోసారి రాకుండా వచ్చేశాం అని చెత్త సేకరణ చేసే వారు చెబుతుంటారు. అలాంటి సందర్భాల్లో వారి రాకపోకల సమయాలను రుజువు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని అంటున్నారు. ఇదే సమయంలో అధికారులూ వీటి కదలికలను పరిశీలించవచ్చని వివరిస్తున్నారు.
నగరమంతా సైకిల్‌పై సవారీ..
కాలుష్యానికి దూరంగా హైదరాబాద్‌ నగరాన్ని ఉంచాలంటే సైకిల్‌ వినియోగం బాగా పెరగాలని, ఇంధన వాహనాల వినియోగం తగ్గాలని పెడల్‌ ది సిటీ సంస్థ ప్రతినిధులు విష్ణువర్ధన్‌, శ్రీకాంత్‌, చైతన్య చెబుతున్నారు. ప్రతి బస్సు స్టాపు, రైల్వే స్టేషన్లలో సైకిల్‌ స్టాండ్లు ఏర్పాటు చేయాలంటున్నారు. ఇలా అందరికీ సైకిల్‌ అందుబాటులో ఉండేలా తాము రూపొందించిన అప్లికేషన్‌ ఉపయోగపడుతుందన్నారు. స్మార్ట్‌ కార్డును రూపొందించి ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణానికి సైకిల్‌ను అందుబాటులోకి తేవచ్చని వివరించారు. సైకిల్‌ తమ వెంటే తీసుకెళ్లకుండా.. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఈ విధానం అనువైనదని పేర్కొన్నారు.
ఆశాతో పిల్లలకు భద్రత..
నగరంలోని పిల్లలకు పూర్తిస్థాయి భద్రత కల్పించడం తమ ఆశా అప్లికేషన్‌ ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు ఐటీ రంగ నిపుణులు రఘు కంచుస్తంభం, శ్రీకాంత్‌, కార్తీక్‌. భారత్‌లో ప్రతి 21 నిమిషాలకు ఒక బాలికపై అత్యాచారం నమోదు అవుతోందని.. ఇలా 2001 నుంచి 2011 వరకూ 48,338 కేసులు నమోదయ్యాయని వారు పేర్కొన్నారు. 336 శాతం ఈ నేరాల సంఖ్య అధికమవుతోందన్నారు. ఉపాధ్యాయులే బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలూ అనేకం. ఇలాంటి వివరాలు తమ అప్లికేషన్‌లో అందుబాటులో ఉంటాయని.. దీంతో ఉపాధ్యాయుల నియామకం, ఆటోవాలాను కుదుర్చుకోవడం వంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆధార్‌ కార్డు ఆధారంగా.. నేరానికి పాల్పడిన వారి సమాచారం అందుబాటులో ఉంచవచ్చని స్పష్టం చేస్తున్నారు. తమ అప్లికేషన్‌ చూస్తే నేర చరితుల చిట్టా తెలిసిపోతుందంటున్నారు.
పార్కింగ్‌ ఇక్కట్లు తీరేదిలా..
కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు వాహనం ఎక్కడ పార్కు చేయాలో దిక్కు తోచని పరిస్థితి ప్రతి నగరవాసినీ ఇబ్బంది పెడుతుంది. రోడ్ల మీద పార్కింగ్‌ చేస్తే వాహనానికి భరోసా ఉండదు. సమీపంలోనే పార్కింగ్‌ స్థలం ఉన్నా.. ఎవరికీ తెలియదు. ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారంగా తాము రూపొందించిన స్మార్ట్‌ పార్కింగ్‌ అప్లికేషన్‌ ఉపయోగపడుతుందని అంటున్నారు శ్రేయ, భరద్వాజ్‌, విష్ణుప్రియ, ఆకాష్‌. వీరంతా నారాయణమ్మ, వీఐటీ, ఎం.ఎన్‌.ఆర్‌., గీతం ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు. హాకథాన్‌ సదస్సు వీరిని ఒక బృందంగా చేసింది... అంతే ఈ అప్లికేషన్‌ ఆవిష్కృతమైంది. తమ అప్లికేషన్‌ ద్వారా.. పార్కింగ్‌ ప్లేస్‌ ఉందా లేదా.. ఫీజు ఎంత, మనం హడావుడిలో ఉండి పార్కింగ్‌ నిర్వాహకులకు ఫోన్‌ చేస్తే వచ్చి వాహనాన్ని తీసుకెళ్లి మళ్లీ తీసుకురావడం, కారు వాషింగ్‌... ఇలా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయంటున్నారు. ట్రాఫిక్‌ సమస్యకు సగం పరిష్కారం ఈ తరహా పార్కింగ్‌తో తీరుతుందంటున్నారు.
ప్రజల సహకారంతోనే స్మార్ట్‌ సిటీ సాధ్యం: ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌
ఒక్క ఫోన్‌ కాల్‌తో సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని (అప్లికేషన్‌) రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఇందుకు ఓ టోల్‌ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. 'హైదరాబాద్‌ అర్బన్‌ హ్యాకథాన్‌ రోప్స్‌ ఇన్‌ సిటిజన్స్‌ ఫర్‌ అర్బన్‌ ప్లానింగ్‌' పేరిట శనివారం గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరిగిన సదస్సును కేటీఆర్‌ ప్రారంభించి ప్రసంగించారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా మెట్రోపొలిస్‌ సదస్సు సన్నాహాల్లో భాగంగా ఈ సదస్సును నిర్వహించాయి. హైదరాబాద్‌ను స్మార్ట్‌ సిటీగా రూపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరాలతో సరిపోల్చుకొని హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనుకోవడం కాకుండా... ఇక్కడి సమస్యలను స్థానిక దృక్పథంతో ఆలోచించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌, పారిశుద్ధ్యం, రవాణా వ్యవస్థ ఇలా హైదరాబాద్‌ ప్రజలు స్మార్ట్‌గా నివసించేలా చర్యలు తీసుకోవడంతోనే స్మార్ట్‌సిటీ పేరుకు సార్థకత ఏర్పడుతుందన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, ఐఎస్‌బీ సీనియర్‌ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం, వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు, ఐ.టి. సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
చాలా విలువైన సూచనలు - బాబు (జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్‌)
ఐఎస్‌బీలో జరిగిన హాకథాన్‌లో చాలా విలువైన సూచనలు వచ్చాయని జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్‌ ఎ. బాబు అన్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో యువతరం అద్భుతాలు సృష్టించారన్నారు. స్మార్ట్‌ నగరానికి అవసరమైన అన్నిరకాల అప్లికేషన్లను రూపొందించారని చెప్పారు. వాణిజ్య ప్రకటనల నుంచి ఇంటి నంబర్ల వరకూ.. పలు సమస్యల పరిష్కారానికి ఈ సదస్సు ద్వారా మార్గం దొరికింది... ఈ సూచనలను తప్పనిసరిగా జీహెచ్‌ఎంసీ అమలు చేస్తుం దన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న ప్రకటనల ఎలక్ట్రానిక్‌ హోర్డింగ్‌లను ఒకే చోట నుంచి నిర్వహించేలా అప్లికేషన్‌ను రూపొందించారు. ప్రకటనల్లో మార్పులూ ఒకే చోట నుంచి చేసేలా అనువైన మార్గాన్ని కనుగొన్నారు. వాణిజ్య పన్నుల వసూళ్లకు కూడా వీరి అప్లికేషన్లు తోడ్పడతాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning