మూడు నగరాలు... కలల కొలువుల నెలవులు!

 •  

  * చెన్నై, నోయిడా, గుర్గావ్‌లపై దృష్టి పెట్టాలి
  * ఐటీ ఉద్యోగాలు అక్కడ సులువు
  * నిపుణుల సూచన


       ఇంజినీరింగ్‌తోపాటు వివిధ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన రాష్ట్ర విద్యార్థులు ఉద్యోగ వేటలో హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇతర నగరాలకు పయనమవుతున్నారు. కనీసం అనుభవం వచ్చేవరకైనా ఆయా ప్రాంతాలకు వెళ్లక తప్పదని నిపుణులూ సూచిస్తున్నారు. వృత్తి అనుభవం లేని వారు చిన్న, మధ్యతరహా ఐటీ పరిశ్రమలు ఉన్న నగరాలను ఎంచుకుంటే త్వరగా కొలువుల్లో స్థిరపడవచ్చని వారు చెబుతున్నారు.

       ఇంజినీరింగ్ విద్యార్థుల్లో 10-15 శాతానికి మించి ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కావడం లేదు. మిగిలిన వారిలో మరో 35 శాతం మంది వరకూ ఉన్నత విద్య చదివి, విదేశాలకు వెళ్లేవారు కొందరైతే... తమ కుటుంబ వృత్తుల్లో స్థిరపడుతున్నవారు మరికొందరు. మిగతా 50 శాతం ఉద్యోగాలకు ఎదురుచూస్తున్నారు. వారిలో అధిక శాతం సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చేరేందుకు రాజధానికి చేరుకొని ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ పొందుతున్నారు. చదువు పూర్తయి ఏడాది దాటితే వారిని తాజా అభ్యర్థులుగా పరిశ్రమలు పరిగణించడం లేదు. ఎక్కడికెళ్లినా ఉద్యోగ అనుభవం అడుగుతుండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకోవడం వరకు పర్వాలేదని, ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉద్యోగా లు రావాలని ఎదురు చూస్తూ కూచుంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు సలహా ఇస్తున్నారు.

  ఆలస్యమయ్యేకొద్దీ...

       ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కు ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ)లో నమోదైన సంస్థలు హైదరాబాద్‌లో 1,200 వరకున్నాయి.

  ఇతర సంస్థలు వందల్లో ఉంటాయి. ఉన్న వాటి విస్తరణ పెద్దగా లేకపోవడం, కొత్తవి ఎక్కువగా రాకపోవడం, పోటీ అధికం కావడం వల్ల ఇక్కడ ఉద్యోగం దొరకడం కష్టంగా మారుతోంది.

  అక్కడ పరిశ్రమలు ఎక్కువ...

       దేశంలోని 3,400 ఇంజినీరింగ్ కళాశాలలుంటే రాష్ట్రంలో వాటి సంఖ్య 700. ఏటా ఏడు లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు డిగ్రీ పట్టాలతో బయటకు వస్తుండగా వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే 1.50 లక్షల మంది. అందువల్ల పోటీ అధికం. హైదరాబాద్‌తో పోల్చుకుంటే చెన్నై, బెంగళూరు, నోయిడా, గుర్గావ్‌లో పరిశ్రమలు ఎక్కువ. అక్కడ ప్రముఖ సంస్థలతోపాటు మధ్యతరహా ఐటీ కంపెనీలూ ఉన్నాయి. బెంగళూరులో ఈ పరిశ్రమలు, అవకాశాలూ బాగానే ఉన్నా పోటీదీ అదే తీరు. ఈ నేపథ్యంలో చెన్నైతోపాటు ఢిల్లీ సమీపంలోని నోయిడా, గుర్గావ్‌లపైనా మన విద్యార్థులు దృష్టి పెట్టడం మంచిదని ఈ రంగంలోని అనుభజ్ఞుల స్పష్టం చేస్తున్నారు. నోయిడా, గుర్గావ్‌లో ఏడాది పనిచేసి, అనుభవం పొందాక సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయేవారు ఎంతోమంది. అందువల్ల ఖాళీలు బాగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మన విద్యార్థులు అక్కడికి వెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ఐటీ నిపుణుడు ఆర్ఎన్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటకే ఉద్యోగాల్లో స్థిరపడిన స్నేహితులు, క్లాస్‌మేట్లు, పరిచయస్తుల సలహాలను తీసుకోవడం మంచిదని .. దూరమైనా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉద్యోగాల్లో చేరడం ద్వారా ముందు అనుభవం సంపాదించవచ్చని ఆయన వివరించారు.

  రకరకాల కోర్సులతో గందరగోళం

       బెంగళూరు, ఇతర నగరాల్లో వివిధ ఐటీ కోర్సులు నేర్చుకోవాలంటే కనీసం 15 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజుంటుంది. హైదరాబాద్‌లో అది రూ.3 వేల నుంచి రూ.6 వేలకు మించదు. ఇంజినీరింగ్ తర్వాత ఇక్కడకు వస్తున్న విద్యార్థులు కచ్చితమైన లక్ష్యమంటూ లేకుండా మొదట జావాలో చేరుతుంటారు. అందులో ప్రోగ్రామింగ్ ఎక్కువ ఉన్నందున కష్టంగా భావించి డాట్‌నెట్‌కు మారతారు. కొందరు ఒక దానిపై పట్టు సాధించకుండానే మరో కోర్సును పైపైన నేర్చుకుంటారు. రూ.3 వేలకు డాట్‌నెట్‌లో మూడు నెలలు, రూ.6 వేలకు ఆరు నెలల జావా శిక్షణ దొరుకుతుంది. ఫీజు తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులూ రకరకాల కోర్సుల్లో చేరుతున్నారు. దీనివల్ల ఏ ఒక్క దానిపైనా పట్టు రావడం లేదని శిక్షణ సంస్థల అధ్యాపకులు చెబుతున్నారు. కేవలం సంస్థల్లో చేరి తరగతులకు పరిమితం అవుతున్నారు. 10 శాతం మందే ల్యాబ్‌లకు వచ్చి ప్రాక్టికల్స్ చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.

  మూడేళ్ల వరకు తాజా అభ్యర్థులే...

       చదువు పూర్తయిన ఏడాది వరకే తాజా అభ్యర్థులుగా సంస్థలు పరిగణిస్తున్నాయి. ఆ లోపు ఉద్యోగావకాశాలు లభించకపోతే ... తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు పరిశ్రమలు వృత్తి అనుభవం అడుగుతున్నాయి. దీంతో ఉద్యోగాలు రాని అభ్యర్థులు ఏదో ఒక పరిశ్రమలో పనిచేసినట్లుగా అనుభవ ధ్రువపత్రాన్ని ఎలాగోలా సంపాదిస్తున్నారు. అందుకు రూ.25 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఏటా రూ.పదుల కోట్లు ఆయా చిన్నాచితక సంస్థల పరం అవుతున్నాయి. అంతేకాకుండా ఎంపిక చేసుకున్న కంపెనీ వారూ ఉద్యోగి గురించి విచారణ జరిపే బాధ్యతను థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగిస్తున్న పరిస్థితి ఉంది. ఇందుకోసం రూ.వేలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చదువు పూర్తయిన మూడేళ్ల వరకు తాజా అభ్యర్థులగానే పరిగణించాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి వస్తోంది. ఇటీవల బెంగళూరులో ఇదే డిమాండ్‌తో అభ్యర్థులు ర్యాలీలు తీయడం గమనార్హం. ఈ డిమాండ్ ఇతర నగరాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది.

  ఎక్కువ ఇంటర్వ్యూలకు వెళ్లండి...

       పదో తరగతి వరకు తల్లిదండ్రులు, ఇంటర్‌లో కళాశాల యాజమాన్యం పర్యవేక్షణ ఉంటోంది. ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరిన తర్వాత పిల్లలు పెద్దవారయ్యారని తల్లిదండ్రులు పర్యవేక్షణ తగ్గిస్తారు. కళాశాల యాజమాన్యాలు అసలే పట్టించుకోవు. ఫలితంగా విద్యార్థులు నాలుగేళ్లు భవిష్యత్తుపై దృష్టి పెట్టడం లేదు. తర్వాత వచ్చి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో చేరుతున్నారు. ఇక్కడా తరగతులు విని ల్యాబ్‌లను నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది రెండు మూడు ఇంటర్వ్యూలను ఎదుర్కొని నిరాశపడుతుంటారు. ఇంటర్వ్యూల్లో ప్రశ్న లకు సమాధానం చెప్పలేని వాటిపై దృష్టి పెట్టాలి. అలా పది ఇంటర్వ్యూలకు హాజరయ్యారంటే ఇక 11వ ఇంటర్వ్యూలో కొత్తగా వేసే ప్రశ్నలు ఉండవు. అంటే ప్రశ్నపత్రం లీకయినట్లే. ఇక మీరు చేయాల్సింది అందుకు తగ్గ సమాధానాలు వెతుక్కోవడమే.నిరాశపడకుండా ఉండ టం, విషయ పరిజ్ఞానం పెంచుకోవడం ప్రధానం.


  - ఆర్ఎన్ రెడ్డి, డాట్ నెట్ శిక్షకుడు

  పరిష్కారవంతులు కావాలి

       మార్కుల శాతం బాగానే ఉంటున్నా విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జి ఉండటం లేదు. పైపైన నేర్చుకుంటున్నారు. ఒక సమస్య ఇస్తే దానికి సాఫ్ట్‌వేర్ ద్వారా పరిష్కారం కనుగొనాలి. సొంతంగా సమస్యను పరిష్కరించే సత్తా ఉందా అనేది కంపెనీలు చూస్తాయి. ఒక బ్యాంకు ఉద్యోగి రోజూ ఒకే పని చేయాల్సి ఉంటుంది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలి. చాలా వరకు ఉద్యోగాలు అలానే ఉంటాయి. సాఫ్ట్‌వేర్ రంగం అందుకు భిన్నం. నిత్యం ఒకే సమస్య ఉండదు.. మారుతుంటాయి. వాటికి సాఫ్ట్‌వేర్‌తో పరిష్కారం కనుగొనాలి. అందుకు లోతైన పరిజ్ఞానం, ఆలో చన, సృజనాత్మకత ఉండాలి. అందుకే ఈ రంగంలోని వారికి అధిక వేతనాలు ఇస్తున్నారు. మొత్తానికి సొంతంగా సమస్యను పరిష్కరించే నేర్పే ఈ రంగంలో ప్రధానం.

  - నల్లగట్ల శివ, సీనియర్ సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంజినీరు

  చెన్నైలో చాలా త్వరగా...

       మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. ఇటీవలే ఎంసీఏ పూర్తయ్యింది. నాలుగు నెలల క్రితం అమీర్‌పేటలోని ఓ శిక్షణ సంస్థలో చేరాను. ఇక్కడ కోర్సు పూర్తయిన తర్వాత చెన్నై వెళ్లి త్వరగా ఉద్యోగంలో చేరాలనుకుంన్నా. నా స్నేహితులు చాలామంది అక్కడికి వెళ్లి ఉద్యోగాల్లో చేరారు. నాన్నకు ఆరోగ్యం సరిగా లేనందున హైదరాబాద్‌లో నే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా. ఇక్కడ కొంత ఆలస్యం కావొచ్చు.


  - జి.వాహిని, ఉద్యోగ అన్వేషిణి

  నేర్చుకోవడానికి వచ్చా...

       ఇటీవలే ఎంసీఏ పూర్తిచేశా. సాఫ్ట్‌వేర్ శిక్షణలో హైదరాబాద్‌కు మంచి పేరుంది. అందుకే ఇక్కడకు వచ్చా. శిక్షణ పూర్తయ్యాక బెంగళూరులో ఉద్యోగం వెతుక్కుంటా. చెన్నైలోనూ ఉద్యోగ మార్కెట్ బాగానే ఉంది. శిక్షణ కోసం హైదరాబాద్... ఉద్యోగం కోసం బెంగళూరు అనే మాట మా ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది.


  - ఎస్.హరీష్‌రావు,బళ్లారి
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning