బుక్కయిపోతారు... జాగ్రత్త!

* ఉద్యోగార్థుల సామాజిక ఖాతాలపై సంస్థల నిఘా
* వాటిని చూస్తారు.. ప్రవర్తన తేల్చేస్తారు

 • రోజురోజుకీ పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో ఒకే ఉద్యోగానికి వేల మంది దరఖాస్తులు చేస్తున్నారు. దీంతో ఉద్యోగాలను ఇచ్చే సంస్థలు కొత్తకొత్త విధానాలతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ..

  అభ్యర్థుల మానసిక పరిపక్వతను అంచనా వేస్తున్నాయి. ప్రతిభ, బహుభాషా నైపుణ్యాలు, ఉంటే... చాలు ఉద్యోగం ఇట్టే పట్టేయొచ్చనే భావన అభ్యర్థుల్లో ఉండటం సహజం. దీనికితోడు మంచి వ్యక్తిత్వం కూడా ఉండాలని ఆయా సంస్థలు కోరుకుంటున్నాయి. సామాజిక అనుసంధాన వేదికల ద్వారా వారికి కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటున్నాయి. కొలువుకు పోటీపడే అభ్యర్థులకు తెలియకుండానే అనేక అంశాలను యాజమాన్యాలు పరిశీలిస్తున్నాయి. నిత్యం సామాజిక వెబ్‌సైట్లు. సోషల్‌ నెట్‌వర్క్‌లలో వీరవిహారం చేసే యువత.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. వారికి తెలియకుండానే ఆ సైట్లు వారి ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపిస్తున్నాయి.

  ప్రతిభ ఉన్నా దూరం.. దూరం...

  ఇప్పటివరకూ ఉద్యోగానికి వెళ్లే అభ్యర్థికి కావాల్సింది ముందుగా సంబంధిత రంగంలో ప్రతిభాపాటవాలు మెండుగా ఉండటం. మాతృభాష, ఆంగ్లంపై పట్టు, సామాజిక అంశాలపై అవగాహన ఇవే ప్రధానం. కానీ ఇవన్నీ ఉన్నా.. కొందరు అభ్యర్థులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు. దీనికి కారణం ఆయా సంస్థలు అనుసరిస్తున్న సామాజిక నిఘా విధానమే. ప్రముఖంగా సాఫ్ట్‌వేర్‌, మరికొన్ని రంగాల సంస్థలు అభ్యర్థి మనస్తత్వం, శైలి, గుణగణాలు తెలుసుకునేందుకు సామాజిక వెబ్‌సైట్లపై నిఘా పెడుతున్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో పొందుపరిచిన ఈమెయిల్‌ ఐడీ ఆధారంగా అతని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఆర్కుట్‌, లింక్డ్‌ఇన్‌ తదితర ప్రముఖ సైట్లలో అభ్యర్థికి ఉన్న ఖాతాలపై సంస్థలు నిఘా పెడుతున్నాయి. ఈమెయిల్‌ ఐడీ లేక అభ్యర్థి పూర్తిపేరు ఆధారంగా ఖాతాను కనుగొనడం ప్రస్తుతం సామాజిక సైట్లలో సులభంగానే మారింది. రాతపరీక్ష, ముఖాముఖికి హాజరైన అభ్యర్థులు వ్యక్తిత్వం ఎలాంటిదనే అంశంపై యాజమాన్యాలు పరిశీలన జరుపుతున్నాయి. అద్భుతమైన ప్రతిభ ఉన్నా... వ్యక్తిత్వంలో ప్రతికూలాంశాలు కనిపిస్తే ఉద్వాసన పలుకుతున్నాయి. అతని వల్ల భవిష్యత్తులో సంస్థకు నష్టం కలగకూడదని భావిస్తున్నాయి.

  వ్యక్తిత్వానికే పెద్దపీట వేస్తూ...

  ఈ విధానం ఉత్తర భారతదేశంలో ఇప్పటికే బాగా విస్తరించింది. దాదాపు 40శాతానికి పైగా సంస్థలు అభ్యర్థుల సామాజిక సైట్ల ఖాతాలను పరిశీలించి, తదనంతరం మాత్రమే ఉద్యోగం విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాయి. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లోనూ ప్రముఖ సంస్థలన్నీ.. ఈమెయిల్‌ ఐడీతో పాటు, ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌నూ అడుగుతుండటం గమనార్హం. మనం పెట్టే పోస్టింగులు, షేరింగ్‌లు, పంచుకునే అభిప్రాయాలనే సంస్థలు ప్రముఖంగా చూస్తున్నాయి. ఈ అంశాల ఆధారంగానే అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా స్త్రీలకు ఇబ్బంది కలిగించడం, వారి మనోభావాలు దెబ్బతినేలా పోస్టింగులు చేయడం, కుల, మత, ప్రాంతీయ అంశాలపై ప్రభావం చూపేవాటిని పరిగనలోకి తీసుకుంటున్నారు. న్యాయస్థానాల తీర్పులను తప్పుబట్టే వ్యాఖ్యానాలు, రాజ్యాంగ వ్యతిరేకమైనవి, రాజకీయ నాయకులు, పార్టీలను కించపరిచే పోస్టులపై సంస్థలు నిఘా పెడుతున్నాయి. ప్రతి విషయంపైనా.. దృష్టిసారించి తమకు కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లూ జరగకూడదనే ఇలా చేస్తున్నామని కొన్ని యాజమాన్యాలు చెబుతున్నాయి.

  మనకున్న స్నేహితులూ పరిగణ‌నలోకే....

  సామాజిక సైట్లలో మనకు ఎంతోమంది తెలియని వ్యక్తులు స్నేహితులుగా మారుతుంటారు. ఈ క్రమంలో నిత్యం సామాజిక ఖాతాలు వినియోగించే వారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తుంటాయి. అయితే వచ్చిందే తడవుగా కొందరు నాకు ఎక్కువ మంది మిత్రులు ఉన్నారని చెప్పుకొనేందుకు అందర్నీ యాడ్‌ చేసుకుంటూ ఉంటారు. అలాంటి విధానానికి ఇక స్వస్తి పలికితే మంచిది. ఎందుకంటే మనకున్న స్నేహితులు ఎలాంటి వారు, వారు ఎలాంటి పోస్టులు చేస్తున్నారనేది చాలా ముఖ్యమైన అంశం. కొందరు తెలియని వ్యక్తులు నగ్న చిత్రాలను వారి ఖాతాల్లో ఉంచుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం గమనించకుండా వాటిని షేర్‌ చేస్తే అది అభ్యర్థి ఖాతాపై తీవ్ర ప్రభావం చూపనుంది. కాబట్టి మనం వీలై నంతవరకూ తెలిసిన వారి నే స్నేహితులు గా చేసుకుంటే భవితకు మంచి దని గుర్తించాలి.

  ఇలాంటి పోస్టులతో జాగ్రత్త....

  * ఇతర కులాలను, మతాలను కించపరుస్తూ, ద్వేషిస్తూ, చులకన చేస్తూ ఉండే పోస్టింగులకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు.
  * స్త్రీలు, వారికి సంబంధించిన చట్టాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పొద్దు.
  * రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రాంతీయ మనోభావాలకు సంబంధించిన పోస్టులు చేయకుండా ఉండటమే మంచిది.
  * న్యాయస్థానాల తీర్పులను వ్యతిరేకించడం, తప్పు పట్టడం లాంటి వాటికి దూరంగా ఉండాలి.
  * గతంలో పనిచేసిన సంస్థలను కించపరిచే పోస్టులతోనూ జాగ్రత్తగా ఉండాలి.
  * రాజకీయ నాయకులు, పార్టీల గురించి అసభ్యకరంగా పుట్టుకొస్తున్న వాటిని వదిలేయాలి.
  * సున్నితమైన అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం కోరి కష్టం తెచ్చుకోవడమే.
  * మద్యం తాగే చిత్రాలు ప్రస్తుతం వెబ్‌సైట్లతో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు.
  షేర్‌ చేసినా ప్రమాదమే...

  ఎవరో పెట్టిన పోస్టును మనం కేవలం షేర్‌ చేస్తున్నాం కదా అని అనుకుంటే ప్రమాదమే. ప్రస్తుతం సైట్లలో కొన్ని అసందర్భ, అనుచిత అంశాలపై తయారవుతున్న పోస్టులను లక్షల మంది షేర్‌ చేస్తున్నారు. వీటిలో అనేక అనుచిత వ్యాఖ్యానాలు ఉంటున్నాయి. అది మనం పోస్టు చేయలేదు కదా అనుకుంటే నష్టం జరిగేది మనకే. అందుకే ఏ అంశాన్ని షేర్‌ చేస్తున్నామో ఆచితూచి చేయాలి.

  వ్యక్తిగత పోస్టుల విషయంలో...

  ఇటీవల ఫేస్‌బుక్‌ను యువత విరివిగా ఉపయోగించుకుంటోంది. నిద్రలేచింది మొదలు పడుకునే వరకు మనం ఏం చేశాం. ఎక్కడికి వెళ్లాం అనే వివరాలను స్నేహితులతో పంచుకుంటున్నారు. దీంట్లో కొన్ని వ్యక్తిగత అంశాలు ఉంటున్నాయి. ప్రేమ వ్యవహారాలు, మందు పార్టీలకు హాజరు తదితర అంశాలను యువత వెబ్‌సైట్లలో ఉంచుతోంది. ఇతరులకు సంబంధించిన అర్ధనగ్న చిత్రాలు, అసభ్య వ్యాఖ్యానాలు యువత పొందుపర్చుతోంది. ఇది సరదాకే చేస్తున్నా... కొన్ని సందర్భాలలో ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని గుర్తించాలి.

  వాటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ...

  అభ్యర్థులకున్న ప్రొఫైళ్లపైనే సంస్థలు ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు నగరంలోని ఓ సంస్థ పేర్కొంది. అభ్యర్థి గతంలో ఎక్కడైనా పనిచేసి ఉంటే... అతని అనుభవం, హోదాలను పరిశీలిస్తున్నామని, కొత్త సంస్థకు ఇచ్చిన సమాచారంతో అది సరిపోలకపోతే అలాంటి వారిని పక్కనపెడుతున్నట్లు వివరించారు. పాత సంస్థను కించపరుస్తూ వ్యాఖ్యానాలు ఉన్నా పెద్దగా ఆసక్తి చూపట్లేదన్నారు.

  సగం మందికి 'ఫేస్‌' ఖాతాలు

  మన దేశంలో ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న వారిలో 45 శాతం మందికిపైగా అంటే దాదాపు సగం మంది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. 2012 చివరి నాటికి 6.27 కోట్ల మంది ఫేస్‌బుక్‌లో ఖాతాలు కలిగి ఉన్నారు. వీరిలోనూ అత్యధికంగా యువతే ఎక్కువగా సామాజిక సైట్లను వినియోగిస్తోంది. ఫేస్‌బుక్‌తో పాటు ఆర్కుట్‌, ట్విట్టర్‌ సైట్లనూ యువత విరివిగా వాడుతున్నారు. రకరకాల పోస్టింగులను చేస్తున్నారు. వీటి విష‌యంలో అప్రమ‌త్తంగా ఉండాలి.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning