టోఫెల్‌లో మెరుగైన స్కోరు ఎలా?

ఆంగ్లం మాతృభాషగా లేని వారందరూ ఈ భాషలో తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి రాసే పరీక్ష టోఫెల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌). దీని ప్రత్యేకత, సన్నద్ధమయ్యే పద్ధతీ... తెలుసుకుందాం!
ప్రపంచవ్యాప్తంగా అండర్‌గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థులందరూ ఆంగ్లంలో తమ భావప్రకటన సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. చాలా అమెరికన్‌, ఆంగ్ల కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థానికేతరులను ప్రవేశానికి ముందే ఈ పరీక్షలో నిర్ణీత స్కోరు సాధించాల్సిందిగా కోరుతున్నాయి. విదేశాల్లోనే జన్మించిన వృత్తినిపుణులకు కూడా యూఎస్‌, కెనడాల్లో తమ వృత్తుల్లో సర్టిఫికేషన్‌ పొందడానికి తరచు టోఫెల్‌లో మంచి స్కోరు అవసరం.
కళాశాలల్లో చర్చల్లో పాల్గొనడానికీ, అసైన్‌మెంట్లను రాయడానికీ, చదవడానికీ ఆంగ్లంలో నైపుణ్యం అవసరం. మరికొన్ని కోర్సుల్లో మౌఖిక ప్రదర్శనలూ అవసరమవచ్చు. మాస్టర్స్‌ ప్రోగ్రాములో టీచింగ్‌ అసిస్టెంట్‌గా నియమితులయ్యే అవకాశం కొందరికి వస్తుంది. అంటే.. అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు వారి పనిలో సహాయం చేయడం, సూచనలివ్వడం, అసైన్‌మెంట్లను గ్రేడ్‌ చేయడం వంటివి చేయాల్సివుంటుంది. కళాశాలలు, ఇతర సంస్థల్లో టీచింగ్‌ అసిస్టెంట్‌గా నియామకం పొందడానికి టోఫెల్‌ స్కోరు కావాలని అడగవచ్చు.
110 దేశాల్లోని 6000కుపైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఏజెన్సీలు టోఫెల్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
జీఆర్‌ఈ మాదిరిగానే టోఫెల్‌ను కూడా ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ప్రిన్స్‌టన్‌, న్యూజెర్సీ, యూఎస్‌ఏలో ఉన్న ఈటీఎస్‌... టోఫెల్‌ అభివృద్ధి, పర్యవేక్షణలను చూసే లాభాపేక్షలేని విద్యాసంస్థ.
పరీక్ష విధానమేంటి?
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ ద్వారా నిర్దిష్ట పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే పరీక్ష టోఫెల్‌ iBT. ఇది ఆంగ్లభాషా నైపుణ్యాన్ని అంచనా వేయడానికి పూర్తిగా భిన్నమైన విధానాన్ని ఉపయోగిస్తుంది. వివిధ ఆంగ్లభాషా నైపుణ్యాలను అభ్యర్థులు ఏ రకంగా సమన్వయం చేసుకుంటున్నదీ టోఫెల్‌ అంచనా వేస్తుంది. ఈ రకంగా అభ్యర్థి విద్యా ప్రపంచంలోకి ప్రవేశించడానికీ, ఆలోచనలను అర్థం చేసుకుని సమర్థంగా ఇతరులతో పంచుకోవడానికీ ఈ నైపుణ్యాలు దోహదపడతాయి.
టోఫెల్‌లో నాలుగు విభాగాలుంటాయి. రీడింగ్‌, లిసనింగ్‌, స్పీకింగ్‌, రైటింగ్‌. మొత్తం పరీక్షకు 4 గంటల సమయముంటుంది. అన్ని పరీక్షలనూ ఒకేరోజు నిర్వహిస్తారు. పరీక్షలో మొదట రీడింగ్‌ విభాగాన్నీ, తరువాత వరుసగా లిసనింగ్‌, స్పీకింగ్‌, రైటింగ్‌ విభాగాలనూ నిర్వహిస్తారు.
రీడింగ్‌: అకడమిక్‌ పుస్తకం నుంచి 700 పదాలు గల 3- 5 ప్యాసేజీలను ఇస్తారు. ప్రతి ప్యాసేజీకీ 12- 14 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్యాసేజినీ 60 నిమిషాల్లోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రశ్నలు విద్యార్థి గ్రహణ, ఇచ్చిన సమాచారం ఆధారంగా గ్రహించే, నేర్చుకునే సామర్థ్యాలను పరీక్షిస్తాయి. పరీక్ష రాసేవారు ప్యాసేజీపై ప్రశ్నలను పొందడానికి ముందు తప్పకుండా దాన్ని పూర్తిగా చదవాలి. రీడింగ్‌ విభాగాన్ని సరిగా పూర్తిచేయడానికి అభ్యర్థులకు ప్రత్యేకమైన నేపథ్యమేమీ అవసరం లేదు.
లిసనింగ్‌: ఈ విభాగం ఆంగ్లంలో సంభాషణలు, ఉపన్యాసాలను అభ్యర్థి అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. ఈ విభాగంలోని ప్రశ్నలు ఉపన్యాసకుడి వైఖరి/ విద్యార్థి గ్రహణ సామర్థ్యాన్ని/ సమాచారాన్ని కలపడంలోగల ప్రయోజనాన్ని పరీక్షించేలా ఉంటాయి. నోట్స్‌ రాసుకోవచ్చు. సంభాషణలు, ఉపన్యాసాలు సుదీర్ఘం. భాష చాలా సహజంగా ఉంటుంది. కొన్ని ప్రశ్నల్లో సంభాషణలు, ఉపన్యాసాలను తిరిగి వినిపిస్తారు. కాబట్టి విద్యార్థులు జ్ఞాపకశక్తిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
స్పీకింగ్‌: ఈ విభాగం విద్యార్థి తరగతి గది లోపలా, బయటా అలవోకగా మాట్లాడగల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. ఈ పరీక్షలో సంబంధిత అంశంపై అభిప్రాయాన్ని వ్యక్తీకరించేలా రెండు వేర్వేరు టాస్కులుంటాయి. ఇంకో నాలుగు టాస్కుల్లో విద్యార్థి విన్న, చదివిన విషయాలపై మాట్లాడాల్సి ఉంటుంది. స్పీకింగ్‌ టాస్క్‌లన్నింటిలో విద్యార్థి హెడ్‌సెట్‌, మైక్రోఫోన్‌లను ఉపయోగించాలి. విద్యార్థి తన సమాధానాలు రికార్డ్‌ కావడానికి మైక్రోఫోన్‌లో మాట్లాడాలి. స్పీకింగ్‌ టెస్ట్‌ వ్యవధి 20 నిమిషాలు.
రైటింగ్‌: ఈ విభాగం విద్యార్థి తన ఆలోచనలను స్పష్టంగా, వ్యవస్థీకృతంగా చెప్పిన విధానాన్ని పరీక్షస్తుంది. దీనిలో ఒక ఇంటిగ్రేటెడ్‌ టాస్క్‌ చదవడం, రాయడంపైనా; మరొకటి ఒక అంశంపై తన అభిప్రాయాన్ని బలపరిచేలా రాసేదిగా ఉంటుంది. వ్యవధి 50 నిమిషాలు.
స్కోరు ఎలా?
టోఫెల్‌ నాలుగు విభాగాల్లో ఒక్కోదానికి 0- 30 మార్కుల స్కోరు ఉంటుంది. నాలుగు విభాగాల మొత్తం స్కోరు 120. పరీక్ష తరువాత 15 పనిదినాల్లో స్కోరును ఆన్‌లైన్లో ఉంచుతారు. విద్యార్థులు తమ స్కోరును ఆన్‌లైన్లో ఉచితంగా చూసుకోవచ్చు. విద్యార్థుల స్కోరును కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఏజెన్సీలు కూడా చూసే వీలుంటుంది.
విశ్వవిద్యాలయ అవసరమేంటి?
విదేశాల్లో చదవాలనుకునే అభ్యర్థులు 120కుగానూ కనీసం 85 మార్కులు సాధించాలి. ప్రతి సంస్థా నిర్దిష్ట సొంత స్కోరు కావాలని నిర్దేశిస్తుంది. విద్యార్థులు తాము కోరుకున్న సంస్థలో దరఖాస్తు చేసేముందు ఆయా సంస్థలు నిర్ణయించిన స్కోరును తెలుసుకోవాలి.
నిర్వహణ ఎలా?
టోఫెల్‌ను సంవత్సరానికి యాభైసార్లకు పైగా నిర్వహిస్తారు. దీనిని హైద్రాబాద్‌, విశాఖపట్నంలలో ఈటీఎస్‌ అనుమతించిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. భారత్‌లో పేపర్‌ ఆధారిత పరీక్ష లేదు. పరీక్ష ఫీజు 170 యూఎస్‌ డాలర్లు. ఫీజును ఆన్‌లైన్లో క్రెడిట్‌ కార్డు ద్వారా కట్టొచ్చు. ఈటీఎస్‌ అధికారిక టెస్ట్‌ రిపోర్టులను నేరుగా విద్యాసంస్థలకు పంపిస్తుంది. ఆన్‌లైన్లో www.ets.org/toefl/info/registerలో నమోదు చేసుకోవచ్చు. పరీక్షను ఎన్నిసార్త్లెనా రాసుకునే అవకాశముంది.
సిద్ధమవడమెలా?
ఈ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులు విద్యాపరంగా విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను కూడా ఏర్పరచుకునే అవకాశముంది. క్రమం తప్పకుండా చదవడం ద్వారా పఠన నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ముఖ్యంగా విశ్వవిద్యాలయ పాఠ్యపుస్తకాలు/ ఇతర మెటీరియళ్ళు అకడమిక్‌ విధానంలో ఉంటాయి పైగా వివిధ విషయాలను (ఉదాహరణలు, సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌, బిజినెస్‌ మొ.వి.) కవర్‌ చేస్తాయి. రీడింగ్‌ ప్యాసేజీలో ఇచ్చిన పదాలనే తిరిగి రాయకూడదు. సినిమాలు, టీవీ చూడడం, రేడియో వినడం వంటివి లిసనింగ్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకునేందుకు మంచి మార్గాలు. ప్యాసేజీలను క్రోడీకరించడం, వివరించడం వంటివి తప్పకుండా సాధన చేయాలి.
టోఫెల్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కాబట్టి కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద చదవడం, సమాధానాలు రాయడం సాధన చేయడం మంచిది. స్పీకింగ్‌ స్కిల్స్‌ను అభివృద్ధి పరచుకోవడానికి.. వార్తాపత్రిక/ మ్యాగజీన్‌లోని ఒక చిన్న వ్యాసాన్ని తీసుకుని బిగ్గరగా చదవాలి. తరువాత దాని గురించిన సమాచార సారాంశాన్ని మౌఖికంగా చెప్పాలి. ప్రాచుర్యంలో ఉండే మరికొన్ని టాపిక్స్‌ సేకరించి, వాటి గురించి మాట్లాడడం సాధన చేయాలి. బిగ్గరగా చదివిన వ్యాసంపై మీ అభిప్రాయాన్ని చెప్పాలి. కానీ వాక్యాలను సరిగా పలకడం ప్రధానం.
లేఖన నైపుణ్యాల (రైటింగ్‌ స్కిల్స్‌) కోసం.. మీకు నచ్చిన టీవీ కార్యక్రమాన్ని చూసి, దానిపై సారాంశాన్ని రాయాలి. ఆ కార్యక్రమం మీకు ఎలా అనిపించిందో వివరించాలి. అంటే అంతకుముందు ఎపిసోడ్లతో పోలిక/ తేడాలు ఏమున్నాయో రాయాలి. మీరు విన్న, చదివిన వాటిని నోట్‌ చేసుకుంటూ సరైన క్రమంలో రాయడానికి వీలుగా దాన్ని మలచుకోవాలి. పరీక్షకు ముందు క్వెర్టీ కీప్యాడ్‌పై సాధన చేయడం మంచిది. పారాఫ్రేజింగ్‌ వర్డ్స్‌, ఫ్రేజెస్‌, సెంటెన్స్‌, పూర్తి పేరాగ్రాఫ్‌లను సాధన చేయాలి. ఈటీఎస్‌లో పొందుపరిచిన అంశాలను సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
టోఫెల్‌కు సిద్ధమవడానికి ఉపయోగపడే సైట్లు
http://www.ets.org/toefl/ibt/about
https://www.youtube.com/user/TOEFLtv
http://www.ets.org/Media/Tests/TOEFL/pdf/TOEFL Tips.pdf
http://www.toeflgoanywhere.org/

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning