నేర్చుకుంటూనే ఉండండి..

* ఎంత ఎత్తుకు ఎదిగినా అధ్యయనం ఆపొద్దు
* చేసే పనిపై ఎంతో ప్రేమను పెంచుకోవాలి..
* విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సూచన

న్యూఢిల్లీ: ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకోవడం ఆపరాదని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల విద్యార్థులకు సూచించారు. ఇదే చివరి రోజు అన్న భావనతో జీవించాలని, కానీ ఎప్పటికీ జీవించే ఉంటామనే భావనతో నేర్చుకోవాలన్న గాంధీ సూక్తిని గుర్తు చేశారు. మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. చేసే పని పట్ల ఎంతో ప్రేమను పెంచుకోవాలంటూ ''ఇక అప్పుడు అది పనిలాగానే అనిపించదు. అంతా సులభంగానే అనిపిస్తుంది.'' అని చెప్పారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీ పాల్గొన్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 300 నగరాలు, 750 ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారమయింది. భారత్‌లోని యువతతో మాట్లాడడం అద్భుతంగా ఉందంటూ ''ఇక్కడ ఉత్సాహాన్ని గమనించొచ్చు. ఆశావాదాన్ని గమనించొచ్చు. ఆత్మవిశ్వాసాన్ని చూడొచ్చు. భారత్‌లో చాలా మందిని కలిసే అవకాశం నాకు కలిగింది. వారందిరిలోనూ వీటిని గమనించా.'' అని సత్య నాదెళ్ల చెప్పారు. భారత్‌లో అవకాశాల గురించి మాట్లాడుతూ ''ప్రపంచాన్ని మార్చడానికి మీరు సిద్ధమయితే.. మీ ముందు ఉండే అవకాశాలు అసమానం.'' అని చెప్పారు. భారత్‌లో తెలివైన మానవవనరుల సంపద ఉందని, అవకాశాల సృష్టి జరిగిందని, మార్పు వచ్చిందని అన్నారు. ఇతరుల కోసం స్పందించే నైజం వల్ల విజయాలు వరిస్తాయని చెప్పారు. ''దీర్ఘకాలంలో ఐక్యూ (ఇంటెలిజెంట్‌ కోషెంట్‌)పై ఈక్యూ (ఎమోషనల్‌ కోషెంట్‌) పై చేయి సాధిస్తుంది. ఇతరుల కోసం స్పందించకుంటే సాధించేది చాలా తక్కువ'' అని అన్నారు. తన ప్రస్థానం గురించి చెబుతూ పశ్చిమానికి వెళ్తానని తాను వూహించలేదని చెప్పారు. ''... విస్కాన్సిన్‌కు వెళ్లాను. ఈ స్థాయికి చేరుకోవడం వెనక ప్రయాణం సాఫీగా ఏమీ జరగలేదు. ఎత్తులు, పల్లాలు చాలా ఉన్నాయి. ప్రతిసారీ నేను తీసుకున్న నిర్ణయాలే నేను సాధించిన విజయాలకు తోడ్పడ్డాయి.నాకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒక అనుభవ పాఠంలా భావించాను'' అని అన్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning