ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కాస్ట్‌ అకౌంటింగ్‌

* ముందుగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కసరత్తు చేస్తున్న ఐసీఏఐ
* ఇ-లెర్నింగ్‌ ద్వారా సీఎంఏ కోర్సు పూర్తి చేసే వీలు
* ఈనాడు ఇంటర్వ్యూ ఐసీఏఐ ప్రెసిడెంట్‌ దుర్గా ప్రసాద్‌

కంపెనీలో కాస్ట్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (సీఎమ్‌ఏ)లు కీలకం. వ్యయ అంచనా లేకుండా.. ఏ కంపెనీ కూడా ఒక ప్రాజెక్టును చేపట్టదు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సీఎంఏలు ముఖ్య ప్రాత పోషిస్తారు. కంపెనీల్లోని వ్యయ అంచనా, మార్కెటింగ్‌లో ధర నిర్ణయించడం, పరోక్ష పన్నులు, అకౌంటింగ్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో వీరి అవసరం ఎంతో ఉంటుందని చెబుతున్నారు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్‌ ఎ.ఎస్‌.దుర్గా ప్రసాద్‌. రానున్న కాలంలో సేవల రంగంలో సీఎంఏలకు మరింత గిరాకీ ఉంటుందని 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన ఏమన్నారంటే..
వచ్చే అయిదేళ్లలో ఎంత మంది కాస్ట్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్లు (సీఎమ్‌ఏలు) అవసరమవుతారు ?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 68,000 మంది సీఎంఏలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 2,000 మంది వరకూ ఉండొచ్చు. ఒక్క హైదరాబాద్‌లోనే 1,400 మంది ఉన్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు తయారీ రంగంలోనే సీఎమ్‌ఏలు పని చేసేవారు. సేవల రంగం అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. వచ్చే అయిదేళ్లలో 15,000 నుంచి 20,000 మంది కాస్ట్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్లు అవసరమవుతారు. ఒక్క సేవల రంగంలోనే కనీసం 10,000 మంది కావాలి.
కొత్త వారిలో నైపుణ్యాలు పెంచడానికి ఐసీఏఐ ఏం చేస్తోంది ?
విద్యార్థుల్లో ఆంగ్లంలో భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు తక్కువగా ఉంటున్నాయి. కొంతమంది విద్యార్థులు ఆంగ్లం మాట్లాడగలిగినప్పటికీ.. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఇప్పటికే 100 గంటల పాటు నిడివి ఉండే కార్యక్రమాన్ని ఐసీఏఐ నిర్వహిస్తోంది. ఇది కాక ప్రత్యేక కార్యక్రమాన్ని ఒకటిన్నర నెలల్లో చేపట్టబోతున్నాం. ఇందుకు ప్రముఖ సంస్థతో చేతులు కలుపుతున్నాం. ఆ సంస్థ అందించే సహకారంతో సీఎంఏ ఫైనల్‌ పూర్తి చేసిన వారికి భావ వ్యక్తీకరణలో వారాంతాల్లో 3 నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం.
విద్యా సంస్థలతో ఏమైనా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారా?
కాస్టింగ్‌ అనేది సాంకేతిక అంశం. ఇతరులతో పోలిస్తే.. ఇంజినీరింగ్‌ చదివిన వారికి సీఎంఏ కోర్సు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా తయారీ రంగంలో కాస్టింగ్‌కు ఇంజినీరింగ్‌ పరిజ్ఞానం ఉంటే మంచిది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలో ప్రవేశించిన వారికి కాస్టింగ్‌ సబ్జెక్టులను ప్రవేశపెట్టి (కొన్ని సబ్జెక్టులను మినహాయిస్తారు) ఈ కోర్సును కూడా పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇంజినీరింగ్‌తోపాటు సీఎమ్‌ఏ కోర్సు కూడా పూర్తవుతుంది. రెండు పట్టాలు పొందొచ్చు. కాస్టింగ్‌ సబ్జెక్టులను కరికులమ్‌లో ప్రవేశపెట్టడానికి ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆసక్తి చూపుతోంది. ముందుగా ఈ విశ్వవిద్యాలయం పరిధిలోని కాలేజీల్లో దీన్ని ప్రవేశపెడతాం. తరువాత ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరిస్తాం.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త చాప్టర్లు పెడతారా?
ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరులలో ఐసీఏఐ చాప్టర్లు ఉన్నాయి. కొత్తగూడెం, కర్నూలు పట్టణాల్లో రెండు చాప్టర్లను ప్రారంభించే అవకాశం ఉంది. వీటితో పాటు తెలంగాణలో మరో చాప్టర్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. వివిధ పరిశ్రమల్లో వ్యయ నియంత్రణపై పరిశోధనలు జరపడానికి, ప్రత్యేక కోర్సులు నిర్వహించడానికి దేశవ్యాప్తంగా 8 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయనున్నాం. ఇందులో ఇప్పటికే హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాల్లో మూడు పని చేస్తున్నాయి. హైదరాబాద్‌ సెంటర్‌లో మౌలిక సదుపాయాలు, ఔషధ, ఐటీ రంగాలపై పరిశోధన జరుగుతోంది. మూడు అడ్వాన్స్‌ కోర్సులను నిర్వహిస్తోంది.
కోర్సు పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసే అవకాశం ఉందా?
దాదాపు రెండేళ్ల క్రితమే కొత్త కరికులమ్‌ను ప్రవేశపెట్టాం. విశ్లేషణ, సమగ్రత వంటి ఆరు నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచే విధంగా దీన్ని రూపొందించాం. ఇది అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి అనుగుణంగా ఉంది. 2016 వరకూ ఇది మారదు. ప్రస్తుతం నేరుగా, దూర విద్య ద్వారా అధ్యయనం చేసి విద్యార్థులు కోర్సును పూర్తి చేయొచ్చు. త్వరలో ఇ-లెర్నింగ్‌ను ప్రవేశపెట్టనున్నాం. అంతేకాక వెబ్‌నార్‌లను నిర్వహించనున్నాం.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోని ప్రాజెక్టులు ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణాలు ఏమిటి?
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) తరహాలో చేపట్టిన రహదారుల ప్రాజెక్టులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాయి. భూ సేకరణలో జాప్యం కారణంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరిగింది. దీని వల్ల ప్రాజెక్టు వ్యయాలు పెరిగాయి. దీంతో ముందుగా వూహించిన ప్రతిఫలాలు రాక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. పీపీపీ ప్రాజెక్టులు విజయం సాధించాలంటే ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు రావాలి. పీపీపీ ప్రాజెక్టులపై హైదరాబాద్‌లోని ఎక్స్‌లెన్స్‌ కేంద్రం పరిశోధన నిర్వహిస్తోంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning