ఆకాంక్ష ఉంది.. కొలువుంది.. కానీ

ఒకవైపు భారీగా ఉద్యోగ ప్రకటనలు. కొలువులకు సంబంధించిన ఏ వెబ్‌సైట్‌, వార్తాపత్రిక చూసినా ఉద్యోగులు కావాలంటూ పెద్దఎత్తున ప్రకటనలు. మరోవైపు అదే స్థాయిలో నిరుద్యోగులు. పదుల సంఖ్యలో సంస్థలకు, ఉద్యోగాలకు దరఖాస్తులు పంపినా అందని కొలువులు. ఇదీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. అంటే ఒకవైపు ఉద్యోగ అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకోలేని స్థాయిలో ఎక్కువ శాతం యువత ఉంది. ఈ పరిస్థితి మారాలంటే యువత సంస్థలు ఆశించిన మేరకు తమ అర్హతలు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఇలా చేయాలంటే నియామకాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకొని వాటికి తగినట్లు ఉద్యోగ అన్వేషణను కొనసాగించాలి.
రెండు మార్గాలు
సకాలంలో ఉద్యోగం సాధించాలంటే ప్రస్తుతం రెండు మార్గాలున్నాయి. వాటిలో ఒకటి.. తక్కువ నైపుణ్యాలు, అర్హతలు కలిగిన ఉద్యోగాల్లో చేరి.. తర్వాత సరిపడా ఉద్యోగాలను వెదుక్కోవడం. రియల్‌ఎస్టేట్‌, బీమా, మార్కెటింగ్‌ రంగాలకు సంబంధించిన ఉద్యోగాలకు ఎక్కువ సాంకేతిక నైపుణ్యాలు, అర్హతలు అవసరం ఉండదు. కనీస డిగ్రీ, కొన్ని అర్హతలు ఉంటే చాలు. దీంతో కాస్త శ్రద్ధతో ప్రయత్నిస్తే ఈ రంగాల్లో వెంటనే ఉద్యోగాలు సాధించవచ్చు. సంస్థలో వారం పది రోజుల పాటు శిక్షణ ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తారు. జీతం కాస్త తక్కువనిపించినా కలల ఉద్యోగం సాధించే వరకు ఇక్కడ కొనసాగవచ్చు. ఎందుకంటే అనుభవం వస్తుంది. ఇక్కడే పని చేస్తూ.. కోరుకున్న ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు సాధించవచ్చు. ఈ ఉద్యోగం నచ్చి.. రాణిస్తే ఇందులోనే దూసుకెళ్లొచ్చు.
ఎలాగైనా సరే కాస్త ఆలస్యమైనా.. కోరుకున్న కొలువును సాధించడం రెండోరకం. ఈ కొలువును సాధించాలంటే అందుకు సరిపడిన అర్హతలు, నైపుణ్యాలను, ప్రత్యేకతలను తప్పక సాధించి తీరాలి. లేకుంటే పోటీ ఎక్కువైన ప్రస్తుత తరుణంలో నెగ్గడం.. ఉద్యోగాన్ని సాధించడం కష్టమవుతుంది. ఇందుకు ఆంగ్ల భాష, స్థానిక భాషలపై పట్టు, మంచి భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఉండాలి. ఎంచుకున్న రంగానికి సంబంధించిన అంశంలో నైపుణ్యం, ప్రత్యేకతలు సాధించాలి. కాస్త సృజనాత్మకత, తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలు వచ్చేలా పని చేయగలగడం తదితర లక్షణాలు ఉండాలి.
అవగాహన ఉండాలి
ఎంచుకున్న రంగంలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? ఎలాంటి నైపుణ్యాలు, పనితీరును సంస్థలు ఆశిస్తున్నాయి.. భవిష్యత్తులో ఆ రంగంలో రానున్న మార్పులు ఏంటి తదిరత అంశాలపై అవగాహన సాధించాలి. వీటికి తగినట్లు నైపుణ్యాలు, అర్హతలు సాధించాలి. ఇవేమీ లేకుండా ఆ రంగానికి సంబంధించిన విద్యార్హతలు, కొన్ని కనీస నైపుణ్యాలతో మంచి ఉద్యోగాలు వస్తాయని అనుకొంటే అది పొరపాటవుతుంది. ప్రత్యేకత, ఇతర అభ్యర్థులతో పోల్చితే ఏదో ఒక గొప్పతనం లేకుంటే ఏ సంస్థా మీకు ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడదు.
నైపుణ్యాలు ముఖ్యం
ఒకవేళ మీలో నైపుణ్య లేమి ఉంటే దాన్ని వెంటనే అధిగమించాలి. ఆలస్యం చేస్తే కుదరదు. పైగా కొన్ని సాంకేతిక అంశాలు ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతూనే ఉంటాయి. ఇలాంటి రంగంలో స్థిరపడాలనుకొంటున్నవారు నిత్యం తమ నైపుణ్యాలను తాజా పరచుకొంటూనే ఉండాలి. లేకుంటే వెనుకబడిపోతారు. అందువల్ల ఉద్యోగం కోసం వెదుకుతున్న వారు, ఇప్పటికే ఉద్యోగంలో స్థిరపడిన వారు ఎవరైనా సరే.. వారిలో సరిపడా నైపుణ్యాలు లేకుంటే వారికి వృత్తిగత జీవితంలో భవిష్యత్‌ క్లిష్టతరమవుతుంది.
కొత్త సమాచారం
ఉద్యోగ అవకాశాల వివరాలను వెల్లడించేందుక ఇప్పటికే మార్కెట్‌లో చాలా యాప్స్‌ ఉండగా తాజాగా మరొకటి అందుబాటులోకి వచ్చింది. అదే ఇన్ఫోపార్క్‌. దీన్ని కాబోట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ మొత్తం 130 కంపెనీలకు సంబంధించి ఖాళీల తాజా సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఈ యాప్‌ అభ్యర్థులను ఉద్యోగ ఖాళీలను వెల్లడించంతో పాటు రిక్రూటర్లకు అభ్యర్థుల వివరాలను కూడా పంపుతుంది. ఇతర యాప్స్‌లా కాకుండా ఈ యాప్‌ను వారానికి ఒకసారి తాజాపరుస్తామని (అప్‌డేట్‌ చేస్తామని) దీంతో వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త సమాచారం తెలుస్తుందని తయారీదారులు వివరించారు. ఉద్యోగ అవకాశాలతో పాటు హోటెళ్లు, ఆసుపత్రులు, బ్యాంక్‌లు, ఏటీఎంలు, పోలీస్‌ స్టేషన్లు, పెట్రోల్‌ బంక్‌లు, జిమ్‌లు, ఇతర వివరాలను కూడా అందిస్తుంది. ఇది యువతకు అన్ని రకాలుగా పనికి వస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. ఈ యాప్‌లో ఉద్యోగ వివరాలు మాత్రమే కాకుండా సంస్థలు, వాటి నేపథ్యం, ప్రస్తుత మార్కెట్‌లో వాటి పరిస్థితి, ఆయా సంస్థల మానవ వనరులను విభాగ అధికారుల ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ చిరునామాలు కూడా అందుబాటులో ఉంటుందని కాబోట్‌ టెక్నాలజీ సీఈవో వెంకటేశ్‌ త్యాగరాజన్‌ వెల్లడించారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning