పరిజ్ఞానం కోసం నిరంతరం తపించాలి

* మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ విద్యార్థులు పరిజ్ఞానం కోసం నిరంతరం పరితపించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీంతోపాటు ఉత్తమ లక్షణాలు కూడా ఎంతో అవసరమన్నారు. మంగళవారం కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌ ఆడిటోరియంలో 'ఇన్నోవేటివ్‌ టెక్నాలజీస్‌'పై జరిగిన జాతీయస్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
థామస్‌ ఆల్వాఎడిసన్‌, గ్రాహంబెల్‌, సీవీ రామన్‌ వంటి మహానుభావుల గురించి విద్యార్థులకు వివరిస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. దేశంలోని యువతను ఏమవుతారని ప్రశ్నిస్తే, ప్రత్యేక గుర్తింపుతో ఎదగాలన్నదే తమ లక్ష్యమని చెబుతున్నారన్నారు. ప్రత్యేకత కలిగిన వ్యక్తిని గమనిస్తే వారిలో నాలుగు గొప్ప అలవాట్లు ఉంటాయని చెప్పారు. చిన్న లక్ష్యం నేరం లాంటిదని, గొప్ప లక్ష్యంతో ముందడుగు వేయాలన్నారు. ఇందుకోసం ఆయన విద్యార్థులతో ఇలా ఉంటామంటూ చెప్పించారు.
ఉద్యోగాల కోసం చదివేవారిని జేఎన్‌టీయూహెచ్‌లో తయారుచేయవద్దని, ఉద్యోగాలను ఉత్పత్తి చేయగల సమర్థులను దేశానికి అందించాలన్నారు. నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏడాది నుంచి ఏడాదిన్నర కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి విద్యే తనకు ఇష్టమని, నేటి తరాలకూ అదే కావాలన్నారు. సరికొత్త ఆలోచనలు, పరిశోధనలు రావాలన్నారు.
భవిష్యత్తులో బయో, నానో, ఇన్ఫో, ఎకో రంగాలకే భవిష్యత్తు ఉంటుందన్నారు. వీటిల్లో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఉత్తమ లక్షణాలు, దేశభక్తితో ఎదుగుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో పెట్టాలంటూ కొన్ని పుస్తకాలను వీసీ రామేశ్వరరావుకు అందజేశారు. అంతకుముందు వీసీతోపాటు రెక్టార్‌ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రమణరావు మాట్లాడారు. సదస్సు కన్వీనర్‌గా మాధవీలత వ్యవరించారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning