ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లస్‌లలో ఆరా!

* ఉద్యోగ సమాచారం కోసం సామాజిక వెబ్‌సైట్లపై దృష్టి
* మూడింట ఒక వంతు అభ్యర్థుల ధోరణి

న్యూఢిల్లీ :కంపెనీల్లో ఖాళీలు, వారికిష్టమైన సంస్థల కోసం మూడింట ఒక వంతు ఉద్యోగార్థులు ఫేస్‌బుక్‌, గూగుల్‌+, లింక్డ్‌ఇన్‌ వంటి సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగిస్తున్నారు. ఆ మేరకు మ్యాన్‌పవర్‌గ్రూప్‌ సొల్యూషన్స్‌ సర్వేలో తేలింది. ఈ సంస్థ తయారు చేసిన నివేదిక ప్రకారం.. సరైన నైపుణ్యం గల వ్యక్తులను కనిపెట్టాలంటే.. కంపెనీలు తమ వెబ్‌సైట్ల కంటెంట్‌, వ్యవహార శైలిపై దృష్టి సారించాలని చెబుతోంది. ఎందుకంటే పదింట తొమ్మిది మంది వాటిని కంపెనీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లను అభ్యర్థులను ఆకర్షించే విధంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంద'ని మాన్‌పవర్‌ గ్రూప్‌ సొల్యూషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జిమ్‌ మెక్‌కాయ్‌ పేర్కొన్నారు. 'సామాజిక వెబ్‌సైట్లలో ఉనికిని పెంచుకోవడంతో పాటు ఎంచుకున్న వెబ్‌సైట్‌తో సరైన అవగాహన కలిగి ఉండడం ద్వారా కంపెనీలు సరైన అభ్యర్థులను వేగంగా.. మరింత సమర్థవంతంగా ఎంపిక చేసుకోవచ్చ'ని మెక్‌కాయ్‌ అభిప్రాయపడుతున్నారు. ఆ నివేదిక ప్రకారం..
* సామాజిక వెబ్‌సైట్లను వినియోగించే వారిలో దాదాపు 70 శాతానికి పైగా మందికి ఫేస్‌బుక్‌ ఖాతాలు ఉన్నాయి. వారు కంపెనీలు, అందులో ఉన్న ఖాళీల వివరాల కోసం వెతుకుతున్నారు.
* మరో 43 శాతం మంది గూగుల్‌+, లింక్డ్‌ఇన్‌ ఖాతాల ద్వారా ఉద్యోగ సమాచారాన్ని, కంపెనీల గురించి తెలుసుకుంటున్నారు.
* ఇంకా పింటరెస్ట్‌(22%), ఇన్‌స్టాగ్రామ్‌(15%), ట్విట్టర్‌(13%) వంటి సామాజిక మాధ్యమాలనూ ఉద్యోగార్థులు ఉపయోగించుకుంటున్నారు.
* సామాజిక వెబ్‌సైట్లు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కంపెనీలు తమ బ్రాండ్‌ను బలోపేతం చేసుకోవచ్చు.. ఉనికిని పెంచుకోవచ్చు. కానీ మానవ సంబంధాలకు సాంకేతికత ప్రత్యామ్నాయంగా నిలవలేదు. అందుకే ఇప్పటికీ చాలా వరకు కంపెనీలు వ్యక్తిగతంగా, ఫోన్‌ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు జరుపుకుంటున్నాయి.
* సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 72 శాతం సంప్రదాయబద్ధమైన వ్యక్తిగత ఇంటర్వ్యూల వైపే మొగ్గుచూపగా.. 15 శాతం టెలిఫోన్‌ ఇంటర్వ్యూలకు ఓటేశాయి.
కరిక్యులమ్‌ విటేల్లో అబద్ధాలు..సర్వే
చాలా వరకు ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలను ఎక్కువ చేసి చెప్పుకుంటున్న విషయాన్ని కంపెనీలు కనిపెడుతున్నాయని ఓ సర్వే తెలిపింది. ఉద్యోగార్థుల కరిక్యులమ్‌ విటే(సీవీ)ల్లో కనీసం ఒక అబద్ధం ఉంటోందని ఎక్కువ మంది నియామక మేనేజర్లు తేల్చిచెప్పినట్లు కెరీర్‌బిల్డర్‌ ఇండియా చేసిన సర్వేలో తేలింది. మాంద్యం అనంతర కాలంలో ఉద్యోగార్థులు బయోడాటాలను అబద్ధాలమయం చేస్తున్నారని సగానికిపైగా కంపెనీలు చెబుతున్నాయి.
* ఎక్కువగా నైపుణ్యాల గురించి అసత్యాలు చెబుతున్నారని 61 శాతం సంస్థలు తేల్చాయి.
* తాము పనిచేసిన కంపెనీల గురించి అబద్ధం చెబుతున్నారని సగం కంపెనీలు పేర్కొన్నాయి.
* ఇంకా తాము చేపట్టిన బాధ్యతలు(49%), ఉద్యోగ తేదీలు(47%), హోదా(46%), గుర్తింపులు(35%), డిగ్రీలు(30%) తదితరాలపైనా అభ్యర్థులు అసత్యాలు పలుకుతున్నారని కంపెనీలు చెబుతున్నాయి.
* వారు చెప్పేది అసత్యమని తేలితే ఇంటర్వ్యూ సమయంలో వారిని తిరస్కరిస్తామని 28% రిక్రూటర్లు చెబుతుండగా.. 58 శాతం మంది మాత్రం ఆ అబద్ధం ఏమిటనే దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరో 14% మంది మాత్రం అభ్యర్థి నచ్చితే అందులో అసత్యాన్ని పట్టించుకోమన్నారు.
* ప్రతీ సీవీపైనా రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయిస్తామని 59 శాతం సంస్థలు చెబుతుండగా.. 60 సెకన్ల కంటే తక్కువ సమయం కేటాయిస్తామని 23%; 30 సెకన్లు లేదా అంతకంటే తక్కువ చాలని 11% కంపెనీలు అంటున్నాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning