ప్రాంగణ నియామకాల జోరు!

* ఈసారి 20 శాతం అధికం!
* వేతనాలు మాత్రం పెరగట్లేదు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నెలరోజుల కిందట ఆరంభమైన ప్రాంగణ నియామకాలు జోరుగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే వేతనాలు భారీగా పెరగకున్నా నియామకాల సంఖ్య పెరిగిందని అంటున్నారు. సుమారు 15-20 శాతం దాకా ఎక్కువ నియామకాలు జరుగుతున్నట్లు సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ''ఎంత ఎక్కువ జరుగుతాయనేది తుదికంటా తెలుస్తుంది. నిరుటికంటే ఎక్కువని మాత్రం చెప్పగలం. సహజంగానే ఎలక్ట్రానిక్స్‌ విద్యార్థులకు ప్రాధాన్యం కనిపిస్తోంది. తర్వాతి స్థానం కంప్యూటర్‌ సైన్స్‌... ఆ తర్వాత మెకానిక్‌. ఐటీలతో పాటు కోర్‌గ్రూప్‌లకూ కంపెనీలొస్తున్నాయి'' అని నారాయణమ్మ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామలింగారెడ్డి, బీవీఆర్‌ఐటీ ప్లేస్‌మెంట్స్‌ ఇంఛార్జి సతీశ్‌చంద్ర తెలిపారు. ''ఈసారి మా కళాశాలలో వెయ్యిమందికిపైగా నియామకాలు అందుకున్నారు. 24 కంపెనీలు రాగా... మైక్రోసాఫ్ట్‌ అత్యధికంగా రూ.12 లక్షల ప్యాకేజీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇంకా ఆరునెలల సమయం మిగిలిఉంది కాబట్టి చాలామందికి దొరికే అవకాశాలున్నాయి'' అని సీబీఐటీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ బి.చెన్నకేశవరావు చెప్పారు. ''మా కళాశాలలో ఈసారి 700 మంది అమ్మాయిలకు ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు వచ్చాయి. అన్ని కళాశాలల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. వేతనాల్లో మాత్రం ఒకట్రెండేళ్లుగా తేడా కన్పించట్లేదు. మా విద్యార్థులకు అత్యధికంగా ఈసారి డెలాయిట్‌ 5 లక్షల రూపాయల ప్యాకేజీతో తీసుకుంది'' అని డాక్టర్‌ రామలింగారెడ్డి తెలిపారు. టీసీఎస్‌, మైక్రోసాఫ్ట్‌, డెలాయిట్‌, కాగ్నిజెంట్‌, టెక్‌ మహీంద్ర, ఐబీఎమ్‌....తదితర సంస్థలతో పాటు చెన్నై, బెంగళూరుల నుంచి కొత్తగా మొదలవుతున్న సంస్థలు కూడా నియామకాలకు ముందుకొస్తున్నాయి. రాత పరీక్ష.... గ్రూప్‌ డిస్కషన్‌... ఇంటర్వ్యూ... క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కొన్ని సంస్థలు అనుసరించే పద్ధతిది! వీటికి తోడుగా...రాష్ట్రంలో ప్రాంగణ నియామకాల్లో కొత్త పద్ధతి కనిపిస్తోందీసారి! అదే... సమస్య... పరిష్కారం! ముఖ్యంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో... ప్రాంగణ నియామకాలు చేస్తున్న చాలా నూతన కంపెనీలు విద్యార్థులకు ఓ సమస్యనిచ్చి దాన్ని పరిష్కరించమంటున్నాయి. అదీ... అప్పటికప్పుడు కాదు! నాలుగైదు రోజులు సమయం ఇచ్చి! ఒకరకంగా ఇది అసైన్‌మెంట్‌ కింద లెక్క. ఇందులో చేసిన పనిని బేరీజు వేస్తూ... దాని ఆధారంగా... వేతనాలను నిర్ణయిస్తున్నారు.
ఆ కళాశాలలకు తర్వాత...:
ఇప్పుడు జరుగుతున్న ప్రాంగణ నియామకాలన్నీ అగ్రశ్రేణి కళాశాలల్లోనే జరుగుతుండటం గమనార్హం. ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలలవైపు కంపెనీలు దృష్టి పెట్టడం లేదు. అగ్రశ్రేణి కళాశాలల్లో ముగిశాక...మిగిలిన వాటిలోని ప్రతిభావంతులపై కంపెనీలు దృష్టిసారిస్తాయని భావిస్తున్నారు. పది కళాశాలలకో క్లస్టర్‌ చొప్పున... ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning