s

ఐటీ ఉత్పత్తి సంస్థల చూపు అటే!

* విదేశీ విపణులే కీలకం
* 2020 నాటికి 10 బిలియన్‌ డాలర్ల ఆదాయ లక్ష్యం

 • టీ సేవల్లో దేశీయ సంస్థలు తిరుగులేని ఆధిపత్యం చూపుతున్నాయి. అయితే, ఐటీ ఉత్పత్తులకు వచ్చేసరికి తడబాటు తప్పడం లేదు. ఐటీ ఉత్పత్తుల వినియోగానికి విదేశీ విపణులే కీలకం. దీంతో అందుకనుగుణంగా టెక్నాలజీ సామర్థ్యం పెంచుకోవడానికి దేశీయ సంస్థలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. 2020 నాటికి దేశీయ ఐటీ ఉత్పత్తుల రంగం 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.61,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించగలుగుతుందని ఒక అంచనా.
  దేశంలో ఐటీ ఉత్పత్తుల తయారీ రెండు రకాలుగా జరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌, ఒరకల్‌, సీఏ లాంటి బహుళజాతి సంస్థలు అంతర్జాతీయ అవసరాల కోసం ఇక్కడ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తే, దేశీయ సంస్థలు సొంతగా దేశీయ, అంతర్జాతీయ విపణులకు ఉత్పత్తులను చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలను వూహించి, వాటిని తీర్చగలిగేలా ఐటీ ఉత్పత్తులను తయారు చేసినప్పుడే ఈ రంగంలో ప్రగతి సాధ్యమని చెప్పవచ్చు. వినూత్న ఐటీ ఉత్పత్తులకు పెద్ద సంస్థలతో పాటు చిన్న-మధ్యస్థాయి వాణిజ్య సంస్థలు, రిటైల్‌ ఖాతాదారుల నుంచి కూడా గిరాకీ ఉంది.

  ఏటా 500 కొత్త సంస్థలు

  ఐటీ ఉత్పత్తుల తయారీ కోసం దేశీయంగా 3,400 సంస్థలు ఉన్నాయని, ఏటా మరో 500 వరకు కొత్తగా ఏర్పాటవుతున్నాయని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్‌కామ్‌) అంచనా. ఎంటర్‌ప్రైజ్‌ సెక్యూరిటీ, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, అనలిటిక్స్‌, క్లౌడ్‌, ఇమెయిల్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్వహణ, సైబర్‌ ఇంటెలిజెన్స్‌, ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ వంటి విభాగాల ఉత్పత్తులకు గిరాకీ అధికంగా ఉంది. టెక్నాలజీ, బ్యాంకింగ్‌-ఆర్థిక సేవలు-బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), ఫార్మా, ఆరోగ్య సంరక్షణ, విద్యా, రిటైల్‌, తయారీ వంటి రంగాల్లో ఐటీ ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది. ఐటీ సేవల సంస్థలకు మహా నగరాలు కేంద్రాలు కాగా, ఐటీ ఉత్పత్తులకు కోల్‌కతా, అహ్మదాబాద్‌, త్రివేండ్రం, కోచి లాంటి నగరాలు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చని చెబుతున్నారు. అయిదారేళ్ల క్రితం స్థాపించిన సంస్థలు ఈ రంగంలో ప్రగతి సాధించడం కొత్తవారికి ప్రేరణగా నిలుస్తోంది. అధిక విలువ కలిగిన, వినూత్న ఐటీ ఉత్పత్తుల తయారీకి దేశాన్ని కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నాస్‌కామ్‌ ఉంది.

  సవాళ్లు ఇవీ..

  * ఐటీ ఉత్పత్తుల సంస్థలకు ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌, నిర్వహణ కోసం అనుభవజ్ఞులు కావాలి. దాదాపు 15-20 ఏళ్ల పాటు టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారు ఈ పదవులను చేపట్టగలుగుతారని అమెరికాకు చెందిన ఐటీ ఉత్పత్తుల తయారీసంస్థ ప్రోగ్రెస్‌ సాఫ్ట్‌వేర్‌ దేశీయ కేంద్రం అధిపతి రమేశ్‌ లోగనాధన్‌ 'ఈనాడు'తో చెప్పారు. వీరిని సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్టుగా వ్యవహరిస్తారన్నారు. కొత్త ఉత్పత్తిలో ఏమేం అభివృద్ధి/మార్పులు చేయాలి, మార్కెటింగ్‌ వంటి అంశాలను వీరు నిర్ణయిస్తారని, వీరి పాత్ర కీలకమని వివరించారు. అమెరికాలో ఈ స్థాయి అనుభవం ఉన్నా, టెక్నాలజీలోనే పనిచేయడం వల్ల నిపుణుల లభ్యత ఉందని, భారత్‌లో ఉన్నత పదవులకు మారిపోతున్న కారణంగా ఆ స్థాయి నిపుణుల లభ్యత కష్టంగా ఉందని విశ్లేషించారు. బహుళజాతి సంస్థలకు పర్వాలేకున్నా, దేశీయంగా కొత్తగా ప్రారంభం అవుతున్న ఐటీ ఉత్పత్తుల సంస్థలు నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
  * విపణిలో గిరాకీ లభిస్తేనే ఆదాయం లభిస్తుంది కనుక పెట్టుబడి సంస్థలూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
  * కొత్తగా నెలకొల్పిన సంస్థలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయంగా మార్కెట్‌ చేసుకోవడం కష్టం అవుతోంది. ఖాతాదారులను అన్వేషించి, వారి దరికి ఉత్పత్తిని చేర్చేందుకు తగిన సరఫరా వ్యవస్థ ఏర్పడాల్సి ఉంది.
  * మేధోపరమైన హక్కుల లాంటి న్యాయపరమైన అంశాలు, పన్నుల అంశాల్లో సహకారం కావాల్సి ఉంది.

  ఇవీ ప్రయత్నాలు..

  * అంతర్జాతీయ ఖాతాదారుల అవసరాలు తీర్చేలా, తమ సామర్థ్యాలను పెంచుకొనేందుకు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల సంస్థలు కొనుగోళ్లపై, స్వాధీనంపై దృష్టి సారించాయి.
  * విదేశాల్లో మార్కెటింగ్‌ కోసం అక్కడి స్థానికులనే సిబ్బందిగా చేసుకుంటున్నాయి. గంపగుత్త (బండెడ్‌ ఆఫర్స్‌) అవకాశాలు కల్పిస్తున్నాయి.
  * ప్రారంభ కంపెనీల ఏర్పాటుకు, ఔత్సాహికులకు అవగాహన కల్పించేందుకు నాస్‌కామ్‌ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning