విదేశీ డిగ్రీలకే పట్టం

* కంపెనీల మొగ్గు అటువైపే
* పంథా మారితే మనమూ పట్టొచ్చు కొలువులు

మేథోపరంగా ముందంజలో ఉంటున్న మన విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాల విషయంలో వెనకబడుతున్నారు. ఏకకాలంలో పలు పనులు చేసే సామర్థ్యమున్నా దేన్నీ ఫోకస్‌గా చేయకపోవడమే ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఉద్యోగాన్ని పొందడంలో నైపుణ్యలేమి వెక్కిరిస్తోంది. కొలువిచ్చి.. ఆరునెలలు. ఏడాది పాటూ శిక్షణ ఇస్తే తప్ప ఉత్పాదక స్థాయికి రాలేకపోతుండటంతో కంపెనీలు వీరిపై ఆసక్తిగా లేవు. దేశీయ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే.. విదేశీ విశ్వవిద్యాయాల నుంచి పట్టాలందుకున్న వారు మెరుగైన నైపుణ్యాలతో ముందుంటున్నారని ఇండియా ఎంప్లాయబిలిటీ సర్వే -2014'లో వెల్లడైంది. బిజినెస్‌ మార్కెట్‌ పరిశోధన సంస్థ ఐఎంఏ ఇండియాతో కలిసి నిర్వహించిన అధ్యయన వివరాలను బ్రిటీష్‌ కౌన్సిల్‌ ఇటీవల వెల్లడించింది.
రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో దేశం పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో దూసుకెళుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వృద్ధి పథంలో పయనిస్తే సహజంగానే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివిన వారికి భారీ వేతనాలతో అవకాశాలు రారమ్మంటుంటాయి. ఇతర వర్సిటీల్లో చదివిన వారు అవకాశాలు పొందడం అంత సులువుగా ఏమీ లేదు. అందుకు కంపెనీలు రకరకాల కారణాలు చెబుతున్నాయి. అందుకే అవి మొదటి విదేశీ విశ్వవిద్యాయాల నుంచి పట్టాలు పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నైపుణ్యమున్న వారికే అగ్రతాంబూలం వేస్తున్నాయి. భారీ వేతనాలు చెల్లించేందుకు కూడా సిద్ధమని ప్రకటిస్తున్నాయి.
ఒకటే మాట..: దేశీయ కంపెనీలతో పాటూ విదేశీ సంస్థలు అభ్యర్థుల నైపుణ్యాలపై ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లోని కంపెనీలతో సహా 200 సంస్థల్లో అభిప్రాయాలను సేకరించారు. ఉద్యోగార్థుల పరంగా వేర్వేరు అంశాలను బేరీజు వేశారు. నైపుణ్యాలు, అందుబాటులో ఉండటం, ప్రతిభావంతుల నాణ్యతతో పాటూ మరిన్ని అంశాలను పరీక్షించారు.
సరిదిద్దుకోగలిగితే..
మన విద్యాసంస్థల్లో సరైన ప్రమాణాలు లేకపోవడంతో అంతర్జాతీయంగా పోటీపడలేకపోతున్నాం. కొన్ని సంస్థలు ఐఐటీ, ఐఐఎం, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఒకటి రెండు రాష్ట్రానికి చెందిన వర్సిటీలు మినహాయిస్తే చాలా వాటిలో కనీస ప్రమాణాలు ఉండటం లేదు. ఉద్యోగాలు పొందడంలో వెనకబడటానికి ప్రధానంగా ఐదు సమస్యలున్నాయని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ పేర్కొన్నారు. చాలామంది విద్యార్థులు డిగ్రీ కోసం చదువుతున్నారు. విజ్ఞానం కోసం చదివే వారు తక్కువ. ఈ దృక్పథం మారాలి. ఆసక్తి రంగంలో కాకుండా మార్కెట్లో డిమాండు ఉన్న.. కోర్సుల్లో చేరుతున్నారు. మార్కులు వస్తున్నాయి తప్ప సబ్జెక్ట్‌ ఉండటం లేదు. నైపుణ్యాలు పెరగడం లేదు.
విద్యావిధానంలోనూ మార్పులు రావాలి. మార్కుల ప్రాతిపదికన కాకుండా నైపుణ్యాలు పెంచే ఓరియేంటేషన్‌ పెంపొందించాలి. కేవలం థియరీ మీదనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అప్లికేషన్‌ లేకపోవడంతో వెనకబడుతున్నారు. కాలం చెల్లిన అంశాలనే బోధిస్తున్నారు. పరిశ్రమలతో విద్యాసంస్థలకు అనుసంధానం లేదు. వారి అవసరాలు తెలియడం లేదు. కాలానుగుణంగా సిలబస్‌ అప్‌గ్రేడ్‌ చేయాలి. భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెంపొందించాలి. ఎక్స్‌పోజర్‌ లేక ఈ విషయంలో వెనకబడుతున్నారు. అనుభవజ్ఞులైన బోధకుల నియామకంతో చదువులో నాణ్యత పెంచాలి.
సగానికి సగం...
దేశంలో మొదటి పది స్థానాల్లో ఉన్న విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు పాతికశాతం లోపు కంపెనీలు ఉద్యోగాలను ఇస్తున్నాయి. మొదటి 20 స్థానాల్లో ఉన్న విద్యాసంస్థల నుంచి పట్టభుద్రులైన విద్యార్థులను 51 శాతం కంపెనీలు తమ ఉద్యోగులుగా నియమించుకున్నాయి. విదేశీ పట్టభద్రుల్లోనూ ప్రపంచంలో మొదటి 50స్థానాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో చదివిన వారికే 60 శాతం కంపెనీలు ఉద్యోగాన్ని ఇస్తున్నాయి.
మళ్లీ శిక్షణ అంటే..
కంపెనీల ఆలోచనలకు ఉద్యోగార్థుల నైపుణ్యాలకు అంతరం ఉంటుంది. దేశీయ విశ్వవిద్యాలయాలు పూర్తిగా అకడమిక్‌గా దృష్టిపెడుతుండటంతో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో వెనకబడుతున్నాయి. కేవలం 14 శాతం మంది మాత్రమే పనికొస్తున్నారు. ఈ విషయంలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఒకింత మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ చదివిన వారిని ఎంపిక చేస్తే 39 శాతం మందికి ఏ మాత్రం ప్రత్యేక శిక్షణ లేకుండా తొలిరోజు నుంచే బాధ్యతలు అప్పగించొచ్చు అనే భరోసాలో ఉన్నారు.
ఆ మూడింటిదే హవా...
మూడు దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కంపెనీలు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అమెరికా విశ్వవిద్యాలయల్లో చదువుతున్న వారిని నియమించుకుంటామని 41.6 శాతం కంపెనీలు ఆ దేశానికి మొదటి ర్యాంకు ఇచ్చాయి. మిగతా కంపెనీలు అమెరికాకు రెండో స్థానాన్ని ఇచ్చాయి. యు.కె. విశ్వవిద్యాలయాల విద్యార్థుల వైపు 25.8 శాతం కంపెనీలు మొగ్గుచూపాయి. మిగతావి రెండో ర్యాంకును కట్టబెట్టాయి. జర్మనీ విశ్వవిద్యాలయాలు మూడో స్థానంలో ఉన్నాయి. 6.9 శాతం కంపెనీలు జర్మనీ వైపు మొదటగా మొగ్గుచూపుతున్నాయి.
రంగాల్లో తేడా...
విదేశాల్లోని యూనివర్సిటీల డిగ్రీలకు ఇక్కడ ఆయా రంగాలను బట్టి ప్రాధాన్యం ఇస్తున్నారు. కన్జూమర్‌ గూడ్స్‌(60 శాతం), సేవల రంగం(52.2శాతం), మౌలిక వసతుల రంగం, టెలికాం, విద్యుత్తు రంగాల్లో(50 శాతం) ఎంపికకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిశ్రమల్లో34.5శాతం), ఐటీ(35.7) చివరి స్థానాల్లో ఉన్నాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning