శె'భాస్‌' అనిపించుకోవాలంటే..!

ఉద్యోగంలో చేరి ఏళ్లు గడిచిపోయాయి. గతంతో పోల్చితే బాగా పని చేయడం లేదని బాస్‌ వ్యాఖ్యలు. బాగా పని చేస్తున్నామని అనుకుంటున్నా.. సమీక్ష వద్దకు వచ్చేసరికి ఆశించిన మార్కులు లేదా గ్రేడ్‌ రావడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు..! ఇదీ చాలా మంది సీనియర్‌ ఉద్యోగులకు ఉండే సమస్య. వాస్తవానికి సంస్థలో ఎవరికి వారు బాగానే పని చేస్తున్నామని అనుకోవచ్చు. కాని సంస్థ, ఉన్నతాధికారులు, బాస్‌ మాత్రం సదరు ఉద్యోగి పనితీరు మెరుగుపడాలని సూచిస్తుంటారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసుకొని.. దానికి తగినట్లు పనితీరును మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని అదనపు నైపుణ్యాలు, అర్హతలు, శిక్షణ కూడా అవసరమై ఉంటుంది. దీన్ని గుర్తించి పరిస్థితికి అనుగుణంగా మారాలి. లేకుంటే మీరు అక్కడే ఉంటే మీ తర్వాత సంస్థలోకి వచ్చిన వారు దూసుకువెళ్తారు.
కాలం.. అవసరాలు.. పనితీరు.. పరిస్థితులు ఇవన్నీ మారుతున్నపుడు నేనుమాత్రం మారను ఇలాగే ఉంటాను.. ఇలాగే పని చేస్తాను.. నా పనితీరే గొప్ప.. అనుకుంటే మీరు దారి తప్పినట్టే. మీ వృత్తిగత జీవితం ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం.. వినియోగదారులు, సంస్థల అవసరాలు పెరగడంతో పనితీరు కూడా మారుతోంది. ఉద్యోగులు వెంటనే దీన్ని గుర్తించి అవసరాలకు తగినట్లు పనితీరును మార్చుకోవాలి. మెరుగుపరచుకోవాలి. అలా మార్చుకోనపుడు సంస్థ మీకు ప్రాధాన్యం ఇవ్వదు. మీ తర్వాత సంస్థలో చేరినా అవసరాలకు తగినట్లు పని చేస్తున్నవారికి ప్రాధాన్యమిస్తుంది. దీంతో మీకు నిరాశకు తప్పదు. అందువల్ల ఎప్పుడూ సంస్థ ఆశిస్తున్న మేర పని చేస్తూనే ఉండాలి. ఇందుకు సంస్థ లేదా బాస్‌.. ఎప్పుడు ఎలాంటి ఫలితాలు, పనితీరును ఆశిస్తున్నారో గుర్తించడం ముఖ్యం. దీనికిపై స్పష్టత ఉన్నపుడు చక్కగా పని చేసుకొంటూ.. సంస్థలో గుర్తింపు సాధిస్తూ ముందుకు వెళ్లవచ్చు.
ప్రతి సంస్థా ఉద్యోగుల పనితీరు, ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సమీక్షలో కొందరు ఉద్యోగులను వెనుకబడినట్లు చెబుతూ ఉంటుంది. బాగా పని చేసిన వారిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందరూ ఆశించిన మేర పని చేయాలన్నది ఈ సమీక్ష ఉద్దేశం. అయితే కొందరు వెనుకబడిన ఉద్యోగులు ఈ విషయం గుర్తించక తాము బాగా పని చేస్తున్నా.. ఉన్నతాధికారులు పనిని గుర్తించడం లేని అనుకుంటూ ఉంటారు. గతంలోలాగానే పని చేస్తున్నా సరిగ్గా పని చేయడం లేదని అంటున్నారని భావిస్తుంటారు. మీపై సంస్థ భావన నిజమే. ఎందుకంటే ఒక ఉద్యోగి అనుభవం గడించే కొద్దీ మరింత బాగా పని చేయాలని ప్రతి సంస్థా కోరుకుటుంటుంది. సంస్థలో చేరిన తొలినాళ్లలో బాగా పని చేసి తర్వాత మరింత బాగా పని చేయకుండా తొలినాళ్లలో పని తీరే కనబరుస్తుంటే మీరు బాగా పని చేసినట్లు కాదని సంస్థ భావిస్తుంది. అందువల్ల నిత్యం వీలైనంత బాగా పని చేసేందుకు కృషి చేస్తూనే ఉండాలి. అయినా.. మీకు మీరు బాగా పని చేస్తున్నారని అనిపిస్తే.. అసలు మీ నుంచి సంస్థ ఏం ఆశిస్తుందో తెలుసుకోండి. ఇందుకోసం బాస్‌ లేదా ఉన్నతాధికారులను ప్రత్యక్షంగా లేదా మెయిల్‌ ద్వారా అయినా చర్చించడం మంచిది. ఇలాంటి చర్చ ఫలప్రదంగా ముగియాలంటే ముందు బాగా కసరత్తు చేయాలి. బాస్‌తో చర్చించే ముందు మీ పని తీరు, సాధనలు, విజయాల వివరాలను గుర్తుపెట్టుకోవాలి. అసలు మీ నుంచి బాస్‌ ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నారో స్పష్టంగా అడిగి తెలుసుకోవడంతో పాటు.. మరింత బాగా పని చేసేందుకు సూచనలూ కోరవచ్చు. సంస్థ ఆశించినట్లు మీరు పని చేస్తుంటే ఏ సందర్భంలో ఎలా చేశారో ఉదాహరణలతో సహా వెల్లడించాలి. దీంతో మీపై బాస్‌ దృక్పథం మారవచ్చు.
ఒక్కోసారి సమీక్ష లేదా బాస్‌ కూడా మీ పనితీరును విశ్లేషించే అంశంలో తప్పు చేయవచ్చు. అందువల్ల సమీక్షలు, ర్యాంకులు, గ్రేడ్‌లు మాత్రమే మీ పనితీరుకు కొలమానం అని భావించవద్దు. మీ పనితీరే మెరుగైందని మీకు నమ్మకం ఉన్నపుడు కొనసాగించవచ్చు. అయితే కాస్త సమయం తీసుకున్నా తర్వాత గొప్ప ఫలితాలను చూపెట్టాల్సి ఉంటుంది. అప్పుడే సంస్థ మీ పనితీరును ప్రశంసిస్తుంది. గొప్ప ఫలితాలను సాధించలేమని భావిస్తే పనితీరును మార్చుకొని సంస్థ సూచించినట్లు నడచుకోవడం మంచిది.
నిత్యం ఒకే విధంగా పని చేయడం కన్నా రోజూ మరింత మెరుగైన ఫలితాల లక్ష్యంగా పని చేసే వారికి సంస్థ ప్రాధాన్యమిస్తుంది. మీరూ ఇలా పని చేయాలంటే ఎంచుకున్న రంగంలో ఆధునిక పోకడలను, మార్పులపై అవగాహన సాధించాలి. మీ అర్హతలు నైపుణ్యాలను తప్పనిసరిగా మెరుగుపరచుకోవాలి. ఇందుకోసం అవసరమైతే కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకోవాలి. దీని వల్ల పనితీరును మెరుగుపరచుకోవడంతో పాటు పనిలో ప్రత్యేకత చూపి గుర్తింపును సాధించవచ్చు. సీనియర్లకు ఇప్పటికే ఎంతో కొంత అనుభవం ఉటుంది కనుక కొన్ని అదనపు నైపుణ్యాలు తోడైతే గొప్ప ఫలితాలు సాధించగలరు. మరి ఆ నైపుణ్యాలను సాధించే విషయంలోనే ఎక్కువ మంది వెనుకబడుతూ ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగానికి సంబంధించిన అంశాలను నిత్యం అనుసరిస్తూ.. అవసరానికి తగినట్లు నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకొంటూ ముందుకు వెళ్లడం ఉత్తమం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning