స్వర్ణోత్సవాల్లో సీఎస్‌ఐ

* పాలుపంచుకోనున్న 2,500 మంది విద్యార్థులు
* 1,000 మంది ఐటీ నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు
* విద్యార్థులకు హ్యాకథాన్‌లు
ఈనాడు, హైదరాబాద్‌: కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా), డీఆర్‌డీఓ, జేఎన్‌టీయూ, జీఎన్‌ఐఐటీతో కలిసి విద్యార్థులు, ఐటీ నిపుణుల కోసం వివిధ రకాల సదస్సులను ఏర్పాటు చేసింది. అయిదు రోజుల పాటు జరిగే సదస్సుల్లో వంద మందికి పైగా వక్తలు ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలు, ఐటీలోని కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు మొదలైన అంశాలపై ప్రసంగిస్తారు. 1,000 మందికి పైగా పరిశ్రమ, ప్రభుత్వ, విద్యా రంగ ప్రతినిధులు, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారు(సీఐఓ)లతో పాటు 2,500 మంది విద్యార్థులు పాల్గొంటారు. డిసెంబరు 10, 11 తేదీల్లో జరిగే విదార్థుల సదస్సులో 'విద్యాలయ ప్రాంగణం నుంచి కంపెనీ వరకు, ఆ తర్వాత' అనే అంశంపై మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. కళాశాలల్లో విద్యార్థుల కోసం హ్యాకథాన్‌లు నిర్వహించి, విద్యార్థుల ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. హ్యాకథాన్‌లలో గెలిచిన బృందానికి రూ.లక్ష బహుమతి లభిస్తుంది. ఇ-పాలనపై డిసెంబరు 12న నిర్వహించే నాలెడ్జ్‌ షేరింగ్‌ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఇ-పాలన వంటి అంశాలపై తమ అనుభవాలను పంచుకుంటారు. జేఎన్‌టీయూ ప్రాంగణంలో 12-14 తేదీల్లో 'ఐసీటీ-డిజిటల్‌ భారత్‌లో అవకాశాలు' పేరుతో సీఎస్‌ఐ స్వర్ణోత్సవ సదస్సు జరుగుతుంది. దీన్ని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ప్రారంభిస్తారు. ఈ వివరాలను స్వర్ణోత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ జె.ఎ.చౌదరి బుధవారం ఇక్కడ తెలిపారు. హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ సొసైటీ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. సీఎస్‌ఐ@ 50 వెబ్‌సైట్‌ www.csi-2014.org ను తెలంగాణ ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్‌ సింగ్‌ ప్రారంభించారు.
మెరుగైన బోధన సిబ్బంది కీలకం: ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో సరైన నైపుణ్యాలు లేకపోవడానికి అనేక కాలేజీల్లో తగిన బోధనా సిబ్బంది లేకపోవడం ప్రధాన కారణమని హర్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. ఐటీ రంగంలో ఎదగాలంటే అభ్యాసం ముఖ్యమని, దీనికి ఆంగ్ల పరిజ్ఞానం అవసరం అన్నారు. ఆంగ్ల పరిజ్ఞానం ఉంటే.. బోధన సిబ్బంది సరిగా లేకపోయినా.. ఆన్‌లైన్‌ ద్వారా అవసరమైన విజ్ఞానాన్ని పొందొచ్చని వివరించారు. తెలంగాణాలో ఏటా 60 వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు పట్టాలు పుచ్చుకుని వస్తుంటే.. అందులో 25 వేల మందికే ఉద్యోగులు వస్తున్నాయి. మనతో పోల్చుకుంటే తమిళనాడులో కాలేజీలు మెరుగ్గా ఉన్నాయి. అక్కడ ఏటా 35,000 మంది ఇంజినీరింగ్‌ చదువుతుంటే.. 25,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని సింగ్‌ వివరించారు. సీఎస్‌ఐకి అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని.. బోధన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించే ఆలోచన ఉందని చెప్పారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning