నిర్మాణ రంగంలో పెనుమార్పులకు అవకాశం

* వచ్చే ఐదేళ్లలో భారత్‌ ముందుంటుంది
* ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ ఎండీ వి.బి.గాడ్గిల్‌
* ఘనంగా ప్రారంభమైన 'టెక్నోజియాన్‌-14' వేడుకలు
ఈనాడు, హన్మకొండ: రానున్న ఐదేళ్లలో మన దేశం నిర్మాణ రంగంలో ముందుండేలా ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఇది అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచేలా పెనుమార్పులకు కారణం కాబోతోందని హైదరాబాద్‌ ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ ఎండీ వి.బి.గాడ్గిల్‌ అన్నారు. ఎన్‌ఐటీ వరంగల్‌లో విద్యార్థుల సాంకేతిక వేడుక 'టెక్నోజియాన్‌-14'ను ప్రారంభించడానికి ఆయన గురువారం సాయంత్రం ఇక్కడకు వచ్చారు. ప్రారంభవేడుకలో మాట్లాడుతూ '1970-80ల మధ్య భారతదేశానికి నిర్మాణరంగం ప్రవేశించబోయి.. కొన్ని కారణాల వల్ల జపాన్‌కు మరలిపోయింది. అదిప్పుడు ఆ రంగానికి హబ్‌గా మారింది. ఆ తర్వాత కొరియా, వియత్నాం, చైనా.. ఇలా విస్తృతపరచుకుంది. అదే అవకాశాన్ని భారత్‌ అందుకుని ఉంటే.. దేశాన్ని అగ్రగామిగా చూసేవాళ్లం. ఈ మధ్య భారత ప్రభుత్వం నిర్మాణరంగాన్ని ఇక్కడికి తెచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రానున్న ఐదేళ్లలో మంచి మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను' అని అన్నారు. ఆ రంగం వస్తే ఉద్యోగావకాశాలు బాగా పెరుగుతాయన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు గురించి మాట్లాడుతూ.. ''ఈ ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైంది. మొట్టమొదటి పీపీపీ భాగస్వామ్య ప్రాజెక్టు ఇది. 72 కిలోమీటర్ల దూరం, 66 స్టేషన్లతో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్టులో ఇంజినీరింగ్‌లో ఉండే అన్ని విభాగాలకు చెందిన ఇంజినీర్లను వినియోగిస్తున్నాము. సుమారు 1600 మంది ఇంజినీర్లు ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నట్లు'' ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో తమకెన్నో అడ్డంకులున్నా అధిగమిస్తున్నామన్నారు. 'ఈ ప్రాజెక్టు వల్ల ఒక గంటలో నాలుగు లక్షల మంది ప్రయాణించొచ్చు. ప్రతి రెండు నిమిషాలకు ఒక రైలు ఉంటుంది. అలాగే ప్రతి రైలు 1800 మందితో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందని' వివరించారు. నిరంతరం సాధన చేసేవారు, తమకు తామే పోటీగా ఉన్నవారే ప్రపంచంలో మేటిగా ఎదుగుతున్నారని విద్యార్థులకు గుర్తుచేశారు.
భారీగా తరలివస్తున్న విద్యార్థులు.: ఈ నెల 19 వరకు జరిగే టెక్నోజియాన్‌ వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక బయటి రాష్ట్రాల నుంచీ టెక్నోక్రాట్స్‌ భారీగా తరలివస్తున్నారు. గురువారం రాత్రికి ఈ సంఖ్య ఐదువేలు దాటినట్లు తెలిసింది. ఇంకా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. వి.బి.గాడ్గిల్‌తో పాటు టెక్‌వేదిక సీఈవో సాయి సంగినేని, వరంగల్‌ డీఐజీ ఎం.కాంతారావు, ఎన్‌ఐటీ డైరెక్టర్‌ టి.శ్రీనివాసరావు, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన్‌ ఎస్‌.శ్రీనివాసరావు, టెక్నోజియాన్‌ సాంకేతిక సలహాదారు వెంకటరత్నం తదితరులు జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning