హైదరాబాద్‌లో చిన్న కంపెనీల జాబ్‌ మేళా

* పాలుపంచుకుంటున్న 40కి పైగా సంస్థలు
* భవిష్యత్తులో మరిన్ని...

ఈనాడు - హైదరాబాద్‌: సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్‌ఎంఈ) కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌లో జాబ్‌ మేళా జరగనుంది. ఈ మేళాలో పాలుపంచుకోవాలనుకునే ఉద్యోగార్థులు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు www.msmetalentmela.com లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత కంపెనీల అవసరాలకు అనుగుణంగా వారిలో కొంతమందిని ఎంపిక చేసి వారికి హాల్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో పంపుతారు. వారు మేళాకు హాజరైతే.. అక్కడకు వచ్చిన కంపెనీలు ఇంటర్వ్యూ చేసి వెంటనే ఎంపిక చేసుకుంటాయి. తమకు నచ్చిన ఉద్యోగిని.. సంస్థను ఎంచుకోవడానికి ఇరువర్గాలకు మేళా వేదికగా ఉపయోగపడుతుంది. 0-7 సంవత్సరాల అనుభవం కలిగిన ఉద్యోగార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల సంస్థ (ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ), జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ఐసీ), టీఎంఐ గ్రూప్‌నకు చెందిన జాబ్స్‌ డైలాగ్‌ కలిసి దీనిని నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ ప్రాంగణంలో అక్టోబర్ 19, 20 తేదీల్లో జరిగే ఈ మేళాను కేంద్ర చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా ప్రారంభించనున్నారు. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల కోసం ఇటువంటి జాబ్‌ మేళా జరగడం దేశంలో బహుశా ఇదే ప్రథమమని టీఎంఐ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ టి.మురళీధరన్‌ తెలిపారు. ఇప్పటి వరకూ 40 చిన్న, మధ్య స్థాయి కంపెనీలు పేర్లను నమోదు చేసుకున్నాయని, దాదాపు 5,000 దరఖాస్తులు ఉద్యోగార్ధుల నుంచి అందగా.. 2,000 వరకూ దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి హాల్‌టికెట్లు పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగార్ధులకు అమ్మకాలు, మార్కెటింగ్‌, వ్యాపారాభివృద్ధి, సంస్థ నిర్వహణ, అకౌంట్స్‌ తదితర విభాగాల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ 350-400 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇది ప్రారంభం మాత్రమేనని, ఇటువంటి అనేక చర్యలను భవిష్యత్తులో తాము చేపట్టనున్నామని ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో ఎంటర్‌ప్రెన్యూవల్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.
మరిన్ని పట్టణాల్లో నిర్వహించే వీలు
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ మేళా విజయవంతమైతే.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని మరిన్ని పట్టణాల్లో చిన్న, మధ్య స్థాయి సంస్థల కోసం ఇటువంటి జాబ్‌ మేళాలను నిర్వహించే వీలుందని చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 20 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు ఉన్నాయి. 15 లక్షల మంది ఉద్యోగార్ధులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా చిన్న సంస్థలు నియామకాలకు ప్రత్యేకంగా బడ్జెట్లను కేటాయించవు. ప్రత్యేక సిబ్బంది కూడా ఉండదు. ఇటువంటి మేళాలను నిర్వహించడం వల్ల చిన్న కంపెనీలు కూడా తమ అవసరాలకు అనువైన ఉద్యోగులను నియమించుకోవడంలో ఎక్కువ నిధులు, శ్రమను వెచ్చించాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగార్ధులకు కూడా తమకు నచ్చిన కంపెనీ, పట్టణంలో ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning