కొలువుల్లో కొత్త ఒరవడి

* హైదరాబాద్‌తో పోటీపడుతున్న ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాలు
* అమ్మాయిలకు పెరుగుతున్న ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కాలేజీల్లో జోరుగా సాగుతున్న ప్రాంగణ నియామకాల్లో ఈసారి కొత్త ఒరవడి కనిపిస్తోంది. ఒకటి... హైదరాబాద్‌కు దీటుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని కళాశాలల విద్యార్థులు పోటీపడటం; రెండోది నియామకాల్లో అమ్మాయిలకు ప్రాధాన్యం లభించటం! నిరుటితో పోలిస్తే... ఈసారి నియామకాలు 25 శాతం అధికంగా కనిపిస్తున్నాయి. ఎనిమిదో సెమిస్టర్‌ మొదలుకాకముందే... సేవారంగంలోని కంపెనీలతో పాటు... కోర్‌గ్రూప్‌ల నుంచీ కంపెనీలు ముందుకు వస్తుండటం శుభపరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. నవంబరు రాకముందే... నిరుటికంటే 15-20 శాతానికిపైగా ఆఫర్లు లభిస్తుండటం విశేషం. హైదరాబాదే కాకుండా వరంగల్‌, గుంటూరు, భీమవరంలాంటి చోట్ల నుంచి కూడా ఎక్కువ మంది విద్యార్థులకు కంపెనీల ఆఫర్లు లభిస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కళాశాల (మహిళలు)లో ఈసారి 700 మంది విద్యార్థినులకు ప్లేస్‌మెంట్లు లభించగా... భీమవరంలోని శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కళాశాల (మహిళలు)ల నుంచి సుమారు 300 మంది ఆఫర్లు అందుకున్నట్లు సమాచారం. ''భీమవరం, నర్సాపూర్‌ (మెదక్‌)ల్లో కలిపి మా కళాశాలల నుంచి ఇప్పటిదాకా సుమారు 600 మందికి నియామకాలు లభించాయి. జాన్‌డీర్‌ అనే బహుళజాతి సంస్థ రూ.5లక్షల అత్యధిక ప్యాకేజీతో ముందుకొచ్చి అమ్మాయిలను తీసుకుంది. వీరిలో పూర్తిగా గ్రామీణ నేపథ్యంగల వారు కూడా ఉన్నారు. మరిన్ని కంపెనీలు వస్తున్నాయి... దీంతో రానున్న నెలల్లో నియామకాల సంఖ్య పెరుగుతుంది'' అని శ్రీవిష్ణు విద్యాసంస్థల ప్రతినిధి సతీశ్‌చంద్ర పరుచూరి తెలిపారు. ''నిలకడ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగా ఉండటం... అమ్మాయిలకు కలసి వస్తున్న అంశం'' అని నారాయణమ్మ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామలింగారెడ్డి, కర్నూల్‌లోని పుల్లారెడ్డి కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారి ప్రొఫెసర్‌ వీరభద్రారెడ్డి అన్నారు. పుల్లారెడ్డి కళాశాలలో సుమారు 150 మందికి అవకాశం రాగా... వారిలో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని సీబీఐటీ నుంచి వెయ్యిమందికిపైగా విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ లభించింది. ''మా కళాశాలలో రూ.12 లక్షల అత్యధిక ప్యాకేజీతో తీసుకున్నారు. నిజానికి గతంతో పోలిస్తే ఈసారి ప్లేస్‌మెంట్లు బాగున్నాయి. కంపెనీల స్పందన బాగుంది. ఆరంభంలోనే ఇలా ఉందంటే... వచ్చే ఐదారు నెలల్లో పుంజుకుంటుంది'' అని సీబీఐటీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ చెన్నకేశవరావు అన్నారు. వరంగల్‌లోని కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇప్పటిదాకా 107 మందికి నియామకాలు లభించాయని ప్లేస్‌మెంట్‌ డీన్‌ డాక్టర్‌ పురేందర్‌, డాక్టర్‌ హరికృష్ణ చెప్పారు. ''అమ్మాయిలకు ప్రాధాన్యం లభిస్తున్నమాట నిజం. కోర్‌ గ్రూప్‌ల్లోనూ వారిని తీసుకుంటున్నారు. డిసెంబరు తర్వాత కోర్‌గ్రూప్‌ కంపెనీల రాక ఇంకా పుంజుకుంటుంది'' అని పురేందర్‌ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ కళాశాలలో ఒక్క టీసీఎస్‌ కంపెనీయే 202 మందికి ఆఫర్‌ ఇచ్చిందని ప్లేస్‌మెంట్‌ డీన్‌ షుజావుద్దీన్‌ అన్నారు. మరో 45 కంపెనీలు రాబోతున్నాయన్నారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో దాదాపు 95 శాతం మందికి ఆఫర్లు లభించాయని ప్లేస్‌మెంట్‌ అధికారి డాక్టర్‌ సురేశ్‌కుమార్‌ చెప్పారు. ''మా కాలేజీలో ఏడో సెమిస్టర్‌లోనే 250 మందికి ఆఫర్లు లభించాయి. ఎనిమిదో సెమిస్టర్‌ మొదలైతే వీటి జోరు పుంజుకుంటుంది'' అని విజయవాడ వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ విభాగాధిపతి విజయ మారుతీబాబు విశ్లేషించారు. మొత్తానికి ఈసారి టీసీఎస్‌, మైక్రోసాఫ్ట్‌, డెలాయిట్‌, కాగ్నిజెంట్‌, టెక్‌ మహీంద్ర, ఐబీఎమ్‌ తదితర సంస్థలతో పాటు ఫియట్‌, మహింద్ర అండ్‌ మహింద్ర, ఐటీసీ, టాటా, ఎఫ్‌ఎంసీ, హ్యుందాయ్‌లాంటి కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. చెన్నై, బెంగళూరుల నుంచి కొత్తగా మొదలవుతున్న స్టార్టప్స్‌ వీటికి అదనం!
''సహజంగానే నియామకాల్లో అమ్మాయిలు, అబ్బాయిల నిష్పత్తిని చూసుకుంటుంటాం. గతంలో ఇది చాలా తక్కువ. దీన్ని 50-50 చేయాలనేది దాదాపు అన్ని కంపెనీల ఆలోచన. అమ్మాయిల పనితీరు, విద్యా నేపథ్యం, నిబద్ధత కూడా కంపెనీలకు కలసి వస్తోంది. అందుకే ఎక్కువ మందిని తీసుకుంటున్నాం. అబ్బాయిల కంటే అమ్మాయిల పనితీరు బాగుంటోంది. అందుకే పరిశ్రమ వారికి ప్రాధాన్యం ఇస్తోంది''

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning