నెగ్గనివారు ఏం నేర్చుకోవాలి?

సివిల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. మెయిన్స్‌కు అర్హత పొందినవారి సంగతి సరే... నెగ్గనివారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రిలిమ్స్‌ దశలో వైఫల్యం అసాధారణమేమీ కాదు. వీరి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి?
ఆగస్టు 24న నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఫలితాలను అక్టోబర్‌ 14న విడుదల చేశారు. దాదాపు 50 రోజుల తరువాత! గత పరీక్షల కంటే ఈ ఫలితాలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే...
1. వయః పరిమితి, ప్రయత్నాలు అన్నీ అయిపోయి, సివిల్‌ సర్వీసెస్‌ను కెరియర్‌గా ఇక పొందలేమని భావిస్తున్నవారికి ఇచ్చిన వెసులుబాటు... మరో అవకాశాన్ని ఇచ్చింది.
2. రికార్డు స్థాయిలో 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4.5 లక్షలకుపైగా పరీక్షకు హాజరయ్యారు.
3. CSATను తొలగించాలని అభ్యర్థనలు, ఆక్షేపణల కారణంగా పరీక్ష నిర్వహణ పట్ల అస్పష్టతా, అనిశ్చితీ నెలకొన్నాయి. కొన్ని సందర్భాల్లో పరీక్ష వాయిదా పడుతుందనీ ఆశించారు.
4. తప్పనిసరి ఆంగ్ల విభాగాన్ని వ్యతిరేకిస్తున్నవారిని శాంతపరచడానికి ఈ విభాగాన్ని ప్రభుత్వం తొలగించింది.
సెప్టెంబర్‌ చివరి వారంలో ఫలితాలను విడుదల చేస్తారని భావించారు. కానీ కొంచెం ఆలస్యంగానే ప్రకటించారు. 4,52,334 మంది పరీక్ష రాయగా 16,933 మంది ఉత్తీర్ణులయ్యారు. కటాఫ్‌ గత సంవత్సరం కంటే తక్కువ.
6 ప్రశ్నలను తొలగించారు అంటే- పరీక్షను 385 మార్కులకే నిర్వహించారు. గత ఏడాది కంటే ప్రశ్నలు క్లిష్టంగా అడిగారు. కాబట్టి అందరూ సమానంగా నష్టపోయారు.
1. పరీక్ష రాసిన అనుభూతి కోసం రాసినవారు: కేవలం పరీక్ష గురించి తెలుసుకోవడానికే, ఆ అనుభూతి కోసమే పరీక్ష రాసేవారు ప్రతిసారీ ఉంటారు. వాళ్లు ఉత్తీర్ణులవడానికి రాయకపోయినప్పటికీ, ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, తమ పేరు కూడా ఉత్తీర్ణులైన జాబితాలో ఉంటుందేమో అని ఎదురుచూస్తుంటారు. అటువంటి అద్భుతాలేవీ జరగవని అర్థమయ్యాక కొంచెం నిరుత్సాహపడొచ్చు.
ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే- కేవలం అనుభూతి కోసం పరీక్ష రాయొద్దు. గత ప్రశ్నపత్రాలు దొరుకుతాయి. పరీక్ష జరిగిన తరువాత అసలు పరీక్ష అంటే ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ఒక ప్రయత్నాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నం గురించి బెంగలేకపోయినా మానసికంగా అది భారమే. పరీక్షను మీరు గౌరవించనంతవరకూ పరీక్ష మిమ్మల్ని గౌరవించదని గుర్తుంచుకోండి.
సూచన: ప్రాథమింకాంశాల నుంచి మొదలుపెట్టి, పునాదిని పటిష్ఠంగా నిర్మించుకోవాలి.
2. పాఠశాల/ కళాశాలల్లో ఎప్పుడూ ఉన్నత స్థానాన్ని అధిగమిస్తూ అలాగే విజయపరంపర కొనసాగుతుందని ఆశించేవారు: వీరు పరీక్షకోసం గట్టిగా శ్రమించినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఇలాంటివారు ఫలితాల తరువాత చాలావరకు నిరుత్సాహపడతారు. వారి మీద వారికీ, తల్లిదండ్రులకూ కూడా ఎక్కువ నమ్మకమున్నప్పటికీ వారు సాధించలేకపోతారు. పాఠశాల, కళాశాల్లో ప్రథమస్థానాన్ని పొందే విద్యార్థి అదే పరంపర కొనసాగుతుందని భావిస్తాడు. కానీ తరువాత తనలాంటి టాపర్లు చాలామంది ఉన్నారని అర్థం చేసుకుంటాడు. వారు చాలా శ్రమించి తనకు పోటీదారులవుతారు. వారిని ఓడించాలి. పరీక్షకు తయారయిన విధానంలో కొన్ని తేడాలుండి ఉండవచ్చని గ్రహించాలి.
సూచన: ప్రాథమికాంశాలపై పట్టు ఉన్నా సమస్య ఉందంటే- ప్రిలిమ్స్‌ పరీక్షల సాధనలో సమస్య ఉందన్నమాట. ప్రస్తుతానికి మెయిన్స్‌ కోసం సిద్ధమవాలి. అన్ని విభాగాలనూ పూర్తిచేయాలి. మరుసటి ఏడాది ఫిబ్రవరి నుంచి పరీక్ష నియమాలకు అనుగుణంగా మాదిరి పేపర్లను సాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా గతంలో చేసిన తప్పు పునరావృతం కాకుండా చూడడమే కాకుండా, ప్రధాన పరీక్షకూ సిద్ధమయినట్లవుతుంది.
3. గత సంవత్సరం పరీక్ష రాసి ఉత్తీర్ణులై, ఈ సంవత్సరం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించనివారు: సంఖ్య తక్కువైనప్పటికీ, ప్రతి సంవత్సరం ఈ కేటగిరీలో కొద్దిమంది ఉంటారు. ఇలాంటివారిలో చాలామంది ప్రైవేటుగా తాము పరీక్షను తేలికగా తీసుకున్నామని ఒప్పుకుంటారు. గత సంవత్సరం ఒక మార్కు ఎక్కువ సాధించడం వారి అదృష్టం కావచ్చు/ గత సంవత్సరం వారి సమీప పోటీదారుడు చేసిన ఒక తప్పు కలిసొచ్చి ఉండొచ్చు. ఈ సమీకరణం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది.
సూచన: సన్నద్ధతను కొనసాగించాలి. అర్హత ఉన్న ఇతర పోటీపరీక్షలనూ ప్రయత్నించాలి. ఇక్కడ లక్ష్యాన్ని తక్కువగా చేసుకోమనడం లేదు; సివిల్స్‌ కంటే తక్కువస్థాయి పరీక్షలనూ ప్రయత్నించాలి. ఈ పరీక్షలను రాయడం ద్వారా అవసరమైన దన్ను దొరుకుతుంది. ఒకవేళ వాటిని దీక్షగా ప్రయత్నిస్తే ఉత్తీర్ణులు కూడా కావచ్చు. ఒకసారి వీటిలో ఉత్తీర్ణులైతే విజయం ఆస్వాదించవచ్చు. ఇది చాలాకాలం కొనసాగుతుంది. అంతేకాకుండా, ఎపుడైనా యూపీఎస్‌సీ ఇంటర్వ్యూకు హాజరైతే బోర్డుతో సగర్వంగా ఇతర పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించినట్లు చెప్పవచ్చు.
ఉత్తీర్ణత సాధించాలంటే 56% పైగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. కింద ఇచ్చిన పట్టికను పరిశీలిస్తే ఉత్తీర్ణతశాతం ప్రతి సంవత్సరం మారుతూ కనిపిస్తుంది.
సీశాట్‌ పూర్వపు పరీక్షలు- 2005-2010 విశ్లేషిస్తే (2011లోసివిల్‌సర్వీసెస్‌ ప్రిలిమినరీలో ఆప్షనల్‌కు బదులుగా సీశాట్‌ను ప్రవేశపెట్టారు) ప్రిలిమ్స్‌ కటాఫ్‌ మార్కులు 63+ శాతం నుంచి 55కు పడిపోవడం గమనించవచ్చు. సీశాట్‌ను 2011లో ప్రవేశపెట్టినపుడు కటాఫ్‌ మార్కు 50% కంటే తగ్గింది. కారణం- పేపర్‌ క్లిష్టతస్థాయి, అభ్యర్థులకు అది పూర్తిగా కొత్త విధానమవటం. 2012లో కటాఫ్‌ 52.25కు పెరిగింది. 2013లో కటాఫ్‌ మరికొంత పెరిగి 60 శాతాన్ని అందుకుంది. 2014లో కటాఫ్‌ను 216 వద్ద వూహించగా అది 56%.
వ్యూహం ఎలా ఉండాలి?
ఒకవేళ మీరు శ్రద్ధగా చాలా కష్టపడి సన్నద్ధమైనా ఉత్తీర్ణులు కాకపోతే బాధపడే అర్హత మీకుంది. కానీ ఆ బాధ వారం కంటే ఎక్కువరోజులు మించకుండా ఉండేలా చూసుకోండి. వెంటనే మీ సన్నద్ధతను ప్రారంభించండి.
* ఇప్పుడు ప్రధాన పరీక్షకు సన్నద్ధత ప్రారంభించాలి. ప్రిలిమ్స్‌ సన్నద్ధతనే మళ్లీ మొదలుపెడితే అనాసక్తితోపాటు నిర్లక్ష్యం ఏర్పడవచ్చు. మెయిన్స్‌ కోసం చదవటం ఆసక్తికరంగా ఉంటుంది.
* గత సంవత్సరపు ప్రధాన పరీక్షల పేపర్లను సంపాదించండి. ప్రశ్నలకు సమాధానాలను పూర్తిగా రాయండి. రాయలేకపోవడాన్ని మీరు గమనించవచ్చు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులయ్యాక ఈ పరిస్థితి ఉంటే ఎలా ఉండేదో వూహించుకోండి. మీకు అపుడు సమయముండేది కాదు. ఇప్పుడున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. గత ప్రశ్నలకే కాకుండా, వచ్చే ఏడాది వస్తాయని భావిస్తున్నవాటికి కూడా సమాధానాలు రాయండి. ఇది మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకువస్తుంది.
* సిలబస్‌ దగ్గరగా ఉన్న పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకోండి. ఉదాహరణకు బ్యాంకింగ్‌ పరీక్షలు. వీటిలోని రీజనింగ్‌, ఇంగ్లిష్‌ అంశాలు పేపర్‌-2కు దగ్గరగా ఉంటాయి. జనరల్‌నాలెడ్జ్‌ ఉన్న ఇతర పరీక్షలూ ఉంటాయి. అదృష్టం ఉంటే గ్రూప్‌-1/ గ్రూప్‌-2 పరీక్షలకు ప్రకటన విడుదలవచ్చు. వాటిపై దృష్టిపెట్టండి. ఈ విధంగా సమయాన్ని ఉపయోగకరంగా, ఫలవంతంగా ఉపయోగించుకోవచ్చు.
ఏం చేయకూడదు?
ఉద్యోగంతోపాటు సివిల్స్‌కు కూడా సిద్ధమవగలనే భావనతో ప్రైవేటు సంస్థల్లో చేరకండి. ఆచరణాత్మకంగా చెప్పాలంటే మీరు చదవలేరు. సివిల్‌ సర్వీసెస్‌ ఎండమావుల్లాంటివి; దాన్ని చేరుకోలేనని క్రమంగా విశ్వసిస్తారు. ఆర్థికపరమైన అవసరమేమీ లేకపోతే ఉద్యోగంలో చేరకండి.
* శిక్షణ కేంద్రాలతో ఒప్పందం చేసుకుని బోధన, సంస్థకు నోట్స్‌ తయారు చేసివ్వడం వంటివాటికి దూరంగా ఉండండి. ఇది కూడా సమయపువృథానే! సబ్జెక్టుల్లో పరిజ్ఞానానికి బోధన ఒక్కటే సరైన మార్గమని చాలామంది భావిస్తుంటారు. బోధనకు సంబంధిత విషయంలో లోతైన పరిజ్ఞానం అవసరం. కానీ సివిల్స్‌కు అనేక విషయాల్లో సాధారణ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. ఆర్థిక ప్రతిఫలం బాగానే ఉండొచ్చు కానీ, సివిల్స్‌ సన్నద్ధతకు అది ఆటంకంగా మారుతుంది.
* చాలామంది విజయం సాధించని అభ్యర్థులు ఎక్కువ సమయాన్ని రాబోయే అభ్యర్థులకు సలహాలు ఇస్తూ గడిపేస్తుంటారు.చాలామంది 'మేము చేసిన తప్పు ఇతరులు చేయకూడదనే సలహా ఇస్తున్నాం' అని తమను తాము సమర్థించుకుంటారు. ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి, ఇది స్వయంగా చేసుకునే అపకారమే! ముందు ఎవరికి వారు సహాయం చేసుకుని, ఇతరులకు సహాయం చేయగలిగే స్థానాన్ని చేరుకోవటం మేలు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning