స్వయం'గా హార్వర్డ్‌ పాఠాలు!

* మూక్స్‌ ఏర్పాటుకు మోదీ సర్కారు ఏర్పాట్లు
* త్వరలో అమెరికన్‌ యూనివర్సిటీలతో ఒప్పందం
* తెలంగాణ ప్రభుత్వమూ అదే దిశగా...

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లి చదవలేనివారికి, ఇక్కడి కాలేజీల్లో చదువుతూ తమకిష్టమైన సబ్జెక్ట్‌ల్లో అదనపు విజ్ఞానం పెంచుకోవాలనుకునేవారికి, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో బోధించే ఆచార్యుల సమక్షాన ప్రాజెక్టు చేయాలనుకునేవారికి... శుభవార్త! నయాపైసా ఖర్చులేకుండా ఉన్న వూళ్లోనే కూర్చొని ఈ కలలన్నీ నిజం చేసుకునే అవకాశం కల్పించబోతోంది కేంద్ర ప్రభుత్వం!. ఉన్నత విద్యలో అవకాశాల్ని విస్తృతం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల్ని ఆకట్టుకుంటున్న మూక్స్‌ (మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌)ను తమదైన శైలిలో ఆరంభించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 'స్వయం' (స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్ఫైరింగ్‌ మైండ్స్‌) పేరుతో సొంత మూక్స్‌ వెబ్‌పోర్టల్‌ను త్వరలో ఆరంభించబోతోంది. అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో ఒప్పందాల మేరకు దాదాపు అన్ని బోధనాంశాలకు సంబంధించిన స్వల్పకాలిక కోర్సులు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు వచ్చే నెలలో అమెరికా విదేశాంగశాఖతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఓ ఒప్పందం కుదుర్చుకోనుందని సమాచారం. ఆ ఒప్పందం ఆధారంగా అమెరికా వర్సిటీల వివిధ స్వల్పకాలిక కోర్సులు 'స్వయం' ద్వారా అందుబాటులోకి వస్తాయి. భారతీయ అవసరాలకు అనుగుణంగా కూడా కొన్ని కోర్సుల్ని రూపొందించే అవకాశముందని తెలిసింది. స్వయం సర్వర్‌ భారత్‌లోనే ఉంటుంది. ఇప్పటికే చాలా సంస్థలు ఆన్‌లైన్లో ఉచితంగా మూక్స్‌ను అందిస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని డబ్బులు పెట్టి చేయాల్సిన కోర్సులున్నాయి. కేంద్రం ప్రతిపాదిస్తున్న 'స్వయం' పోర్టల్‌ అందుబాటులోకి వస్తే ఉచితంగా మన విద్యార్థులకు ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. దీంతోపాటు హార్వర్డ్‌, ఎంఐటిలాంటి విఖ్యాత విశ్వవిద్యాసంస్థల్లోని ప్రముఖ ఆచార్యుల పర్యవేక్షణలో మన విద్యార్థులు అసైన్‌మెంట్లు చేసి సర్టిఫికెట్లు పొందవచ్చు. ఈ స్వయం ప్రాజెక్టుతోపాటు అమెరికా ఆచార్యులు, శాస్త్రవేత్తలు మన ఉన్నత విద్యాలయాల్లో, పరిశోధన కేంద్రాల్లోకి వచ్చి కొద్దికాలం గడిపేందుకు వీలుగా... అమెరికా నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌తో కూడా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
కేంద్రం అనుసరిస్తున్న మార్గంలోనే తెలంగాణ సర్కారు..: కేంద్రం అనుసరిస్తున్న మార్గంలోనే... తెలంగాణ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. కళాశాల విద్యకు సంబంధించి ఈ నాలుగేళ్లలో ఓపెన్‌సోర్స్‌ మెటీరియల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్యకు సంబంధించిన విధానపత్రం రూపకల్పనలో ఈ మేరకు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా కళాశాల విద్యలో నాణ్యతను పెంచాలని భావిస్తున్నారు. కళాశాల విద్యకు సుమారు వెయ్యికోట్ల రూపాయలు బడ్జెట్‌ అవసరమవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning