స్కోరుకు సూత్రాలివీ!

ప్రపంచవ్యాప్తంగా పీజీ స్థాయి బిజినెస్‌ డిగ్రీలకు ఆదరణ పెరుగుతోంది. ప్రసిద్ధ బిజినెస్‌ స్కూళ్లు/ విదేశాల్లోని మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో విద్యాభ్యాసం కొనసాగించాలనుకుంటే ఎంబీఏ ప్రోగ్రాం చేయడానికి జీమ్యాట్‌ (గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) మొదటి అడుగు అవుతుంది. ఈ పరీక్ష సన్నద్ధతకు ఉపకరించే సూచనలు...
జీమ్యాట్‌ కంప్యూటర్‌ ద్వారా నిర్వహించే ప్రామాణిక పరీక్ష. ఎంబీఏలో విద్యాపరంగా పరీక్షార్థుల ప్రదర్శన ఎలా ఉండబోతుందో అంచనా వేసేలా దీన్ని రూపొందించారు. జీమ్యాట్‌ స్కోరు గ్రాడ్యుయేట్‌ బిజినెస్‌ స్కూళ్లు ప్రవేశపరంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
చాలా మేనేజ్‌మెంట్‌ స్కూళ్లు ప్రవేశం కోసం జీఆర్‌ఈ జనరల్‌ టెస్ట్‌ స్కోరునే ప్రత్యామ్నాయంగా స్వీకరిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా ఆరువేలకు పైగా బిజినెస్‌, మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాములు జీమ్యాట్‌ స్కోరునే అంగీకరిస్తున్నాయి. జీమ్యాట్‌ స్కోరును కోరని స్కూళ్లు కూడా దరఖాస్తుదారుల అర్హతలపై అవగాహనకు ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
జీమ్యాట్‌ యూఎస్‌, కెనడియన్‌, యూరోపియన్‌ మేనేజ్‌మెంట్‌ స్కూళ్లు, అంతర్జాతీయంగా బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ ప్రవేశానికి అవసరం. లాభాపేక్షలేని అంతర్జాతీయ బిజినెస్‌ స్కూళ్ల మండలి- గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (జీఎంఏసీ) ఈ పరీక్ష ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
జీమ్యాట్‌ విదేశాల్లో చదువు, కెరియర్‌లో పురోగమనం, వ్యక్తిగత అభివృద్ధితోపాటు ఎన్నో అవకాశాలను అందిస్తుంది. భారత్‌లో కూడా ఐఐఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఎస్‌బీ వంటి 100కుపైగా బిజినెస్‌ స్కూళ్లు 200లకుపైగా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి జీమ్యాట్‌ స్కోరును పరిగణిస్తున్నాయి.
పరీక్ష విధానం
జీమ్యాట్‌ ప్రాథమికంగా వివిధ రకాల బహుళైచ్ఛిక ప్రశ్నలతో కూడిన పరీక్ష. ఇది గ్రాడ్యుయేట్‌ స్కూల్‌లో రాణించడానికి కావాల్సిన విభిన్న నైపుణ్యాల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. పరీక్ష సమయం మూడున్నర గంటలు. నాలుగు విభాగాలుంటాయి. ఎనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌, వెర్బల్‌.
1. ఎనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌
పరీక్ష ఎనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌ (ఏడబ్ల్యూఏ)తో మొదలవుతుంది. విద్యార్థులు ఒక వాదనపై తమ విశ్లేషణను కంప్యూటర్‌పై వ్యాసంగా బేసిక్‌ వర్డ్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించి రాయాల్సివుంటుంది. జీమ్యాట్‌లో అడిగిన చాలా వాదనాంశాలు వారి వెబ్‌సైట్‌ www.mba.comలో లభిస్తాయి.
ఏడబ్ల్యూఏ విద్యార్థి విమర్శనాత్మకంగా ఆలోచించగల, ఆలోచనలను సమర్థంగా ప్రసారం చేసే సామర్థ్యాలను అంచనావేయడానికి తోడ్పడుతుంది. ఏడబ్ల్యూఏలో భాగంగా ఇచ్చిన వాదన వెనుకగల కారణం, వాదనపై విమర్శను రాయమని అడుగుతారు. ఈ వ్యాసాన్ని రాయడానికి 30 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. వ్యాసం నాణ్యతపై ఆధారపడి స్కోరును 0- 6 స్కేలు మధ్యలో కేటాయిస్తారు.
2. ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌
ఈ విభాగం వివిధ అంశాల్లోని బహుళ విధానాలను విశ్లేషించగల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. సాంకేతికంగా దూసుకెళ్తున్న, సమాచారమే సర్వస్వమైన నేటి ప్రపంచంలో ముందుకు సాగడానికి ఈ నైపుణ్యాలు అవసరమవుతాయి. 30 నిమిషాల సమయం గల ఈ పరీక్షలో ప్రశ్నలు మల్టీ- సోర్స్‌ రీజనింగ్‌, టేబుల్‌, టూ-పార్ట్‌ ఎనాలిసిస్‌, గ్రాఫిక్స్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లపై ఉంటాయి. ఆన్‌స్క్రీన్‌ కాలిక్యులేటర్‌ కేవలం ఈ విభాగంలో అందుబాటులో ఉంటుంది.
ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌ (ఐఆర్‌) స్కోరు కూడా విడిగా ఉంటుంది. 12 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆధారంగా 0- 8 స్కేల్‌ స్కోరుంటుంది.
3. క్వాంటిటేటివ్‌ విభాగం
ఈ విభాగం రీజనింగ్‌ నైపుణ్యాలను ఉపయోగించి విశ్లేషించగల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. సమస్య పరిష్కారం (ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌), డేటా సఫిషియన్సీలపై అడిగే 37 ప్రశ్నలకు 75 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విభాగంలోని ప్రశ్నలు హైస్కూలు గణితంలోని ప్రాథమిక అంశాలపై ఉంటాయి. త్రికోణమితి, కలనగణితం/ ఇతర లోతైన గణితాంశాలపై ప్రశ్నలుండవు. స్కోరు 0- 60 స్కేలుపై కేటాయిస్తారు.
4. వెర్బల్‌ విభాగం
ఈ విభాగం మెటీరియల్‌ను చదవగల, అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. వాదనలను విశ్లేషించగల, మెటీరియల్‌ను ప్రామాణిక ఆంగ్లభాషలోని సరిచేసి రాయగల ప్రతిభను పరీక్షిస్తుంది. వాక్యాలను సరిచేయడం, క్రిటికల్‌ రీజనింగ్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై అడిగే 41 ప్రశ్నలకు 75 నిమిషాల్లోగా సమాధానాలు రాయాల్సివుంటుంది. స్కోరును 0-60 స్కేలుపై కేటాయిస్తారు.
ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ విభాగాల తరువాత 8 నిమిషాల ఐచ్ఛిక విరామం ఉంటుంది.
కంప్యూటర్‌, వెర్బల్‌ విభాగాలు కంప్యూటర్‌ అడాప్టివ్‌. ప్రతీ విభాగం స్కోరు... సరైన సమాధానాల సంఖ్య, కఠినత్వస్థాయి, ఇతర ప్రశ్నల నాణ్యతలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే ఎక్కువ స్కోరు సాధించవచ్చు. మొదటి ప్రశ్న మధ్యస్థ స్థాయిలో ఉంటుంది. మీరు దానికి సరైన సమాధానం రాస్తే, దానికంటే కొంచెం కఠినంగా ఉండే ప్రశ్న వస్తుంది. ఒకవేళ తప్పు సమాధానం రాస్తే తరువాతి ప్రశ్న కొంచెం తేలికగా వస్తుంది. యథావిధిగా ఉండే విభాగాలతోపాటు విద్యార్థులు ప్రయోగాత్మక ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి.
మార్కుల కేటాయింపు
పరీక్ష పూర్తయిన తరువాత, మీకు మీ అనధికారిక జీమ్యాట్‌ స్కోర్‌ను (వెర్బల్‌, క్వాంటిటేటివ్‌, ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌, మొత్తం) చూపిస్తారు. విద్యార్థులు తప్పకుండా సాధించాల్సిన కనిష్ఠ స్కోరంటూ ఏమీ ఉండదు. మొత్తం జీమ్యాట్‌ స్కోరు 200- 800 శ్రేణిలో ఉంటుంది. వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ స్కేల్‌ స్కోర్ల కూడికే మొత్తం స్కోరు. ఇది బహుళ విభాగాల్లో విద్యార్థుల సమగ్ర స్కోరును ప్రతిబింబిస్తుంది. ఏడబ్ల్యూఏ స్కోరు స్వతంత్రం; దీని ప్రభావం మొత్తం స్కోరుపై ఉండదు.
మీరు కేవలం మొత్తం స్కోరుపైనే శ్రద్ధపెట్టే అవకాశం ఉంటుంది కానీ, ఇతర స్కోర్లూ ముఖ్యమేనని గ్రహించాలి. ఈ స్కోర్లు మీ బలాలనూ, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలనూ తెలియజేస్తాయి. పరీక్ష రాసిన మూడు వారాల్లో అధికారిక స్కోరును అభ్యర్థి ఈ-మెయిల్‌కు పంపిస్తారు. ఈ స్కోరు 5 సంవత్సరాల వరకు చెల్లుతుంది.
జీమ్యాట్‌కు నమోదు
పరీక్షను సంవత్సరం పొడవునా నిర్వహిస్తారు. అందుబాటులో ఉన్న తేదీల ఆధారంగా ముందస్తు నమోదు (రిజిస్ట్రేషన్‌) చేసుకోవాల్సి ఉంటుంది. అందుకుగానూ అభ్యర్థి తప్పకుండా www.mba.comలో అకౌంట్‌ను ఏర్పాటు చేసుకుని, 125 డాలర్లు క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుతో కట్టి పేరు నమోదు చేసుకోవాలి. హైదరాబాద్‌, విశాఖపట్నాల్లో పరీక్ష కేంద్రాలున్నాయి.
బీ-స్కూల్‌ ప్రవేశానికి కావాల్సినవి
ఒక్కో గ్రాడ్యుయేట్‌ బిజినెస్‌ స్కూలు ప్రవేశ ప్రక్రియలో జీమ్యాట్‌ స్కోరు విషయంలో ఒక్కో రకం విధివిధానాలను రూపొందించుకుని అమలుపరుస్తుంటుంది. జీమ్యాట్‌ స్కోరుతోపాటు ట్రాన్‌స్క్రిప్ట్‌లు, ఉద్యోగానుభవం, వ్యాసాలు, మౌఖికపరీక్షలతో కలిపి ప్రతి సంవత్సరం ప్రవేశాల అధికారులు ప్రవేశ ప్రక్రియను నిర్ణయిస్తారు. 800 మార్కులకుగానూ 650 స్కోరు సాధిస్తే మంచి పర్సంటైల్‌లో ఉన్నట్టే. మీరు ఎంచుకున్న సంస్థలు ఎంత స్కోరును కోరుతున్నాయో తెలుసుకోవడం ద్వారా సాధించాల్సిన స్కోరుపై స్పష్టతతో ఉండొచ్చు.
తయారవటం ఎలా?
అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి జీమ్యాట్‌ సన్నద్ధతకు సాధారణంగా 2-6 నెలల సమయం పడుతుంది. నిపుణుల దగ్గర శిక్షణ తీసుకోవడం మంచి స్కోరు సాధించడానికే కాకుండా సన్నద్ధత తక్కువ సమయంలోనే పూర్తవడానికి తోడ్పడుతుంది. షెడ్యూల్‌ ప్రకారం సన్నద్ధమయేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. తద్వారా మాక్‌ టెస్ట్‌లను రాస్తూ పురోగతిని సమీక్షించుకోవచ్చు.
జీమ్యాట్‌ పరీక్షవిధానానికి సుపరిచితమవడమే సన్నద్ధతకు ప్రధాన మార్గం. దీనిలో విజయం సాధించటానికి మీ నైపుణ్యాల స్థాయి, ఏయే అంశాల్లో ముందున్నారో, వేటిలో పురోగతి సాధించాలో తెలుసుకోవడం ముఖ్యం. దానికి అనుగుణంగా సన్నద్ధత తీరును మార్చుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష స్వరూపం, విధానం, ఎదుర్కోబోయే ప్రశ్నల తీరులను ముందుగానే తెలుసుకోవాలి. ప్రశ్నలను జవాబుల వివరణలతో సహా అభ్యాసం చేయాలి. mba.comలో ఉచితంగా నమోదైన వారికి గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలతో రెండు పూర్తిస్థాయి నమూనా పరీక్షలు లభ్యమవుతాయి. వాటిని సాధన చేయాలి. ఏదేమైనా... ఎంత ఎక్కువసేపు చదివారు అనేదానికంటే ఎంత ప్రయోజనకరంగా చదివారు అనేదే ముఖ్యం.
కింది వెబ్‌సైట్లు జీమ్యాట్‌ వివరాలు గ్రహించటానికీ, సన్నద్ధతకూ తోడ్పడతాయి.
www.mba.com/india
www.mba.com/gmatprep

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning