s

ప్రాంగ‌ణ ఎంపిక‌ల్లో రాణించాలంటే..?

* ఎంపిక తీరు తెలుసుకోండి
* మీ ప్రత్యేక‌త‌ను చాటండి
* విభిన్న అంశాల్లో నైపుణ్యం సాధించండి

 • తంలో ప్రముఖసంస్థలు ప్రాంగణ ఎంపికల ద్వారా వేలాది మంది విద్యార్థులను ఎంపిక చేసుకునేవి. మంచి ఉద్యోగాలూ ల‌భించాయి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆర్థికమాంద్యం నేప‌థ్యంలో ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ప్రముఖసంస్థలు నియామకాలు తగ్గించుకుంటున్నాయి. వచ్చే సంస్థలు కూడా పరిమితంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. అందుకోసం వడపోత పద్ధతులను కఠినతరం చేస్తున్నాయి. ఈ స్థితిలో అత్యంత ఉత్తమస్థాయిలో అన్నిరకాల నైపుణ్యాలు ఉన్నవారే ఉద్యోగాలు పొందగలరని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము అభివృద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు.

  ఇలా చేస్తే మీదే విజయం

  * క్యాంపస్‌కనెక్టు పేరుతో వివిధ సంస్థలు నిర్వహించే ఎంపిక‌ కార్యక్రమాల్లో విద్యార్థులు విరివిగా పాల్గొనాలి. ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు ప్రావీణ్యం కనబరచాలి.
  * ఆంగ్లపరీక్షను విద్యార్థులు కష్టంగా భావిస్తున్నారు. కానీ మొదటి నుంచి ఆసక్తితో సాధన చేస్తే అదేం కష్టం కాదన్నది నిపుణుల మాట. ఆంగ్లంలో వ్యాకరణం, ఉచ్చర‌ణ త‌దిత‌ర వాటిలో పట్టు సాధించ‌డం కోసం నిరంత‌ర‌ సాధన చేయాలి.
  * క్యాంటిటేటివ్ అనాలసిస్‌లో విజేతలుగా నిలవాలంటే ఆప్టిట్యూడ్‌పై పట్టు సాధించాలి. రీజనింగ్, లాజికల్ థింకింగ్, క్రిటికల్‌రీజనింగ్ కు సంబంధించిన పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. ప‌రీక్షలో సమయం తక్కువ ఉంటుంది కాబ‌ట్టి షార్టుకట్ పద్ధతులను సాధన చేయాలి. పాత, న‌మూనా పేపర్లను అభ్యాసం చేయాలి.
  * టెక్నికల్‌రౌండ్‌లో విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఈ రౌండ్‌లో విజేతలుగా నిలవాలంటే సీ, సీ++, జావా లాంటి పరిభాషలపై పట్టు సాధించాలి. వీటిలో ప్రోగ్రాంలు చేయడం సాధన చేయాలి.
  * మేనేజ్‌మెంటురౌండులో విజయం సాధించాలంటే కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలి. ముఖ్యంగా బృందంలో కలవడం, బృందచర్చలలో పాల్గొనడం.. ఇతరులకు అభిప్రాయాలను తెలియజేయడం.. ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం లాంటివాటిని నేర్చుకోవాలి. వీటివల్ల ఓపిక, సహనం అలవడతాయి.
  * హుందాతనం, పాజిటివ్ దృక్పథం లాంటివి అలవాట్లుగా మారితే హెచ్ఆర్ రౌండ్‌లో విజయం మీదే. స్కిల్స్ పెంచుకోవడానికి కళాశాలలోని ప్లేస్‌మెంటుసెల్‌ను ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని అధిగమించే ప్రక్రియలను సాధన చేయాలి. వస్త్రధారణ పద్ధతులను కూడా ముందు నుంచే అలవరుచుకోవాలి.

          ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రాంగణ ఎంపికల ద్వారా నియమించుకునే సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందుంది. గత కొన్నేళ్లుగా ఈ సంస్థ ఎక్కువమంది విద్యార్థులకు ఉపాధిఅవకాశాలు కల్పిస్తోంది. ఇటీవలే టీసీఎస్ కొన్ని కళాశాలల్లో ఎంపికలు పూర్తిచేసింది. అయితే ఎంపిక పద్ధతులను మాత్రం బాగా పటిష్ఠం చేసిందని అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్షలు క్లిష్టంగా ఉన్నా, పలువురు విద్యార్థులు సత్తా చాటి ఉద్యోగాలు సాధించారు.

  ఇదీ ఎంపిక విధానం...

  1. మొదటగా కళాశాలలో క్యాంపస్ కనెక్టు ద్వారా నిర్వహించిన పలుపోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రాధాన్యమిచ్చారు.
  2. ఆంగ్లభాషపై పట్టును అంచనా వేసేలా పరీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం నుంచి ఆంగ్లభాషా నైపుణ్యం తప్పనిసరి చేశారు.
  3. ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. దీంట్లో క్వాంటిటేటివ్ అనాలసిస్, రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీని ద్వారా కొంత మందిని ఎంపిక చేసి వారిని మౌఖికపరీక్షలకు పంపించారు.
  4. మౌఖిక పరీక్షల్లో భాగంగా టెక్నికల్ రౌండ్ నిర్వహించారు. ఇందులో ప్రోగ్రాం చేయటంతో పాటు... విద్యార్థిలో సాంకేతిక పరిజ్ఞానం ఏ మాత్రం ఉందో అంచనా వేసే పరీక్ష పెట్టారు.
  5. తర్వాత‌ మేనేజ్‌మెంట్ రౌండు... ఇందులో సైకోమెట్రిక్‌టెస్టు నిర్వహించారు. సమస్యలు వచ్చినప్పుడు అభ్యర్థి ఎలా స్పందిస్తాడు? నాయకత్వ లక్షణాలు తదితర అంశాల పరిశీలన ఈ పరీక్ష ఉద్దేశం.
  6. అనంతరం హెచ్ఆర్ రౌండ్. దీంట్లో ఆటిట్యూడ్, హుందాతనం, డ్రెస్‌కోడ్ తదితర అంశాలను పరిశీలిస్తారు.

  ఇటీవల టీసీఎస్ ఇంటర్వ్యూలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించిన కొందరి అభిప్రాయాలు..
  నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నా
  - అనూషగంగ, బీటెక్, సీఎస్ఈ, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల
  ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా నైపుణ్యాలు పెంచుకున్నాను. బాడీలాంగ్వేజ్‌ను మెరుగుపరుచుకోవటానికి అద్దం ముందు నిల్చుని సాధన చేశాను. సంస్థ ఎలాంటి వారిని ఎంపిక చేస్తుందనే కోణంలో నన్ను నేను విశ్లేషణ చేసుకున్నాను. ఆంగ్లభాషపై చిన్నప్పటి నుంచి పట్టు ఉండటం ఇంటర్వ్యూలో కలిసివచ్చింది. పాజిటివ్ దృక్పథంతో సమాధానాలు చెప్పడం దీనికి తోడయ్యింది. కళాశాలలో ఇచ్చిన శిక్షణ క్వాంటిటేటివ్ అనాలసిస్‌కు దోహదపడింది.
  అడ్డంకులను అధిగమించి...
  - రోహిత్‌కుమార్, ఈఈఈ, కేఎల్ విశ్వవిద్యాలయం
  ఈ ఏడాది టీసీఎస్ ఎంపిక విధానాన్ని క్లిష్టతరం చేసింది. క్యాంపస్‌కనెక్టు నిర్వహించిన కాంటెస్టులలో పాల్గొనటం కలిసివచ్చింది. సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం ... టెక్నికల్‌రౌండ్‌ను అధిగమించడానికి దోహదపడింది. పాజిటివ్ ఆటిట్యూడ్ హెచ్ఆర్‌రౌండ్‌లో ఉపయోగపడింది. వీటన్నింటితో పాటు విండోస్ 8, లైనక్సు, ఎమ్ఏసి లాంటివాటిపై పూర్తిస్థాయిలో పరిజ్ఞానం ఉండటం ఉపయోగపడింది.
  పరిభాషలపై పట్టుతో విజయం
  - హిరణ్మయి, ఐటి, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల
  మొదటగా కోర్ సబ్జెక్టులైన సీ, సీ++, జావా, డీబీఎమ్ఎస్ లాంటి వాటిపై పట్టు సాధించాను. ఈ సాధన టెక్నికల్‌రౌండ్‌ను అధిగమించడానికి దోహదపడింది. గత ఏడాది అడిగిన ప్రశ్నలపై దృష్టి సారించి వాటిని విశ్లేషించి... హెచ్ఆర్‌రౌండ్‌లో విజయం సాధించాను. చిన్ననాటి నుంచి వక్తృత్వపోటీలలో పాల్గొనేదానిని. ఆ అనుభవంతో మేనేజ్‌మెంట్ రౌండ్‌లో ఎంపికయ్యాను. మౌఖిక ఇంటర్వ్యూలో ఎలా పాల్గొనాలి? ఆహార్యం (డ్రెస్‌కోడ్), ప్రవర్తన (బిహేవియర్) తదితర అంశాలపై కళాశాలలో శిక్షణ‌ ఇచ్చారు.
  నాయకత్వ లక్షణాలు విజేతగా నిలిపాయి
  - నిస్సార్ అహమ్మద్, సీఎస్ఈ, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల
  ముందు నుంచే టీసీఎస్ వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నలను, మోడల్‌పేపర్స్‌ను పరిశీలించడం కలిసివచ్చింది. కళాశాల నిర్వహించిన సీఆర్‌టీ తరగతుల్లో నేర్పిన పరిజ్ఞానంతో క్వాంటిటేటివ్, వెర్బల్ పరీక్షలను సులువుగా అధిగమించాను. మూడో సంవత్సరం నుంచే నైపుణ్యాలు పెంచుకోవటానికి కృషి చేశాను. ముఖ్యంగా ఆంగ్లభాషా పరిజ్ఞానం తోడ్పడింది. చిన్ననాటి నుంచి చురుగ్గా ఉండటం అలవాటు కావడంతో హెచ్ఆర్‌రౌండ్‌లో నిర్వహించిన నాయకత్వ లక్షణాల పరీక్షలో నెగ్గాను.
  - న్యూస్‌టుడే, విజ‌య‌వాడ‌
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning