ఇక నియామకాల సందడి!

* చిన్న పట్టణాలపైనా కంపెనీల దృష్టి
* ఐటీ, ఆరోగ్య సంరక్షణలో బాగుంటాయ్‌
* వ్యాపార సెంటిమెంటూ మెరుగైంది
* టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ నివేదిక

ఈనాడు - హైదరాబాద్‌: నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థపై కంపెనీలకు విశ్వాసాన్ని పెంచుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులతోపాటు, దేశీయ పరిణామాల నేపథ్యంలో కంపెనీల్లో వ్యాపార, ఉద్యోగ నియామకాలపై సెంటిమెంట్‌ మెరుగైంది. వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగ నియామకాలపై కార్పొరేట్లు ఆశావహ దృక్పథంతో ఉండటం ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాలతోపాటు విశాఖపట్నం, హిందూపురం, హుబ్లీ, బెల్జియం, తిరువనంతపురం, ఔరంగాబాద్‌, కోటా, అజ్మీర్‌ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఉద్యోగ కల్పనకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు నియామకాల కంపెనీ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ చెబుతోంది. సగానికి సగం నగరాల్లో నియామకాల సెంటిమెంట్‌ గణనీయంగా పెరిగిందని, అంతక్రితం ఆరు నెలలతో పోలిస్తే.. ఈ అక్టోబరు నుంచి వచ్చే మార్చి కాలానికి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లో 6-7 శాతం అధికంగా ఉన్నట్లు తన నివేదికలో వెల్లడించింది. మార్చితో ముగిసే 6 నెలల కాలానికి 'ఉద్యోగ, వ్యాపార భవిష్యత్‌ దృక్పథం' పేరుతో టీమ్‌లీజ్‌ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 88 శాతం కంపెనీలు వచ్చే ఆరు నెలల్లో తమ సిబ్బందిని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నాయి. గత ఆరు నెలల కంటే ఇది 8 శాతం అధికం. ఆర్థిక పరిస్థితులు మారడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాయి. 9% అధికంగా 91 శాతం కార్పొరేట్లు వ్యాపారంపై ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు 12.8% పెరిగే అవకాశాలు ఉన్నాయని టీమ్‌లీజ్‌ వెల్లడించింది. ఆర్థిక పరిస్థితులు మెరుగవడంతోపాటు కంపెనీలు సామర్థ్యాలను పెంచుకోవాలని, కొత్త మార్కెట్లలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నాయని.. ఇది నియామకాల సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతోందని టీమ్‌లీజ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కెనాల్‌ సేన్‌ తెలిపారు. సగానికి సగం రంగాల్లో ఉద్యోగావకాశాల వృద్ధి రెండంకెల్లో ఉండొచ్చని.. నగరాల పరంగా కూడా నియామకాలు జోరందుకోనున్నాయని వివరించారు. వచ్చే ఆరు నెలల్లో జూనియర్‌, సీనియర్‌ స్థాయి ఉద్యోగ నియామకాలు ఆశాజనకంగా ఉండొచ్చని.. వరుసగా 5, 4 శాతం చొప్పున నియామకాలు పెరగొచ్చని నివేదికలో పేర్కొన్నారు. మధ్య స్థాయి ఉద్యోగాల నియామకాలు పెద్దగా పెరగకపోవచ్చు.
రంగాల వారీగా..
దాదాపు అన్ని రంగాల్లోని కంపెనీలు భవిష్యత్‌ వ్యాపార దృక్పథంపై చాలా ఆశావహంగా ఉన్నాయి. వ్యాపార వాతావరణం ఎంతో బాగుంటుందని అభిప్రాయపడ్డాయి. ఒక్క మౌలిక రంగాన్ని మినహాయిస్తే.. మిగిలిన రంగాల్లోని కంపెనీలు తమ నియామకాల్లో ఆకర్షణీయ పెరుగుదల ఉండగలదని పేర్కొన్నాయి. ప్రధానంగా ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఔషధ, రిటైల్‌ రంగాల్లో నియామకాల జోరు అధికంగా ఉండనుంది. వీటితోపాటు టెలికామ్‌ ఎఫ్‌ఎంసీడీ (కన్జూమర్‌ డ్యూరబుల్స్‌), ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్‌ సేవల రంగాల్లో నియామకాల సెంటిమెంట్‌ అధికంగా కనిపిస్తోంది. ఐటీ, ఎఫ్‌ఎంసీడీ, ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాల్లో 24 నెలల అత్యధిక నియామకాల వృద్ధిరేటు నమోదు కావచ్చని టీమ్‌లీజ్‌ వెల్లడించింది. మౌలిక సదుపాయాల రంగంలో వ్యాపార సెంటిమెంట్‌ 14 శాతం పెరిగినప్పటికీ.. నియామకాల్లో మాత్రం ఈ రంగానికి చెందిన కంపెనీలు నిదానంగా అడుగులు వేయొచ్చు.
నైపుణ్యాలకే పెద్దపీట
ప్రపంచీకరణ, కొత్త, కొత్త వినియోగ సాంకేతిక పరిజ్ఞానాలు రంగ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో వ్యాపారాల్లో మార్పులకు, అందుకు అనుగుణమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగాల నియామకానికి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. సాంకేతిక రంగాల్లో మెరుగైన నైపుణ్యాలతోపాటు భావ వ్యక్తీకరణ వంటి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. రానున్న ఆరు నెలల్లో ప్రోడక్ట్‌/ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, సామాజిక మీడియా మేనేజిమెంట్‌, భారీ డేటా, దాని విశ్లేషణ రంగాల్లో నైపుణ్యాలున్న వ్యక్తులకు ఉద్యోగావకాశాలు అధికంగా ఉండనున్నాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning