పట్టా కాదు పట్టూ ఉండాలి

మరికొద్ది రోజుల్లో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో కొంత మంది, ''నాకు అన్నీ తెలుసు కనుక ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు..'' అనుకుంటారు. మరికొందరేమో అసలు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన లేక మిన్నకుండిపోతారు. ఇంకొందరేమో ''ఇప్పుడే కదా.. చదువు పూర్తయింది అక్కడ చదువుకొన్న అంశాల గురించే అక్కడ అడుగుతారు'' అని భావిస్తారు. తీరా రిక్రూటర్ల ముందుకు వెళ్లాక అక్కడ అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియక విఫలమవుతూ ఉంటారు. ఒక్క ఇంటర్వ్యూలో ఇలాగైతే ఫర్వాలేదు. పదేపదే మాత్రం విఫలమవుతూ ఉంటే.. అందుకు కారణాలను గుర్తించాలి. అసలు మౌఖిక పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోవాలి.
ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. అక్కడి ఇంటర్వ్యూ లేదా.. పరీక్షల్లో అడిగే ప్రశ్నల్లో ఎక్కువ శాతం ఆ రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలకు సంబంధించినవే ఉంటాయి. అందువల్ల మౌఖిక పరీక్షకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ తాము చేయదలచుకున్న ఉద్యోగానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. ఆ ఉద్యోగం చేయడానికి అవసరమయ్యే అర్హతలు, నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంచుకున్న రంగానికి చెందిన ప్రాథమిక అంశాలపై పట్టుసాధించాలి. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఈ అంశాలపై ఒకసారి దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ ప్రాథమిక అంశాలు తెలియకుండా ఉద్యోగం చేయడం కష్టం. అందువల్ల రిక్రూటర్లు ఎక్కువగా వీటికి సంబంధించిన ప్రశ్నలే అడుగుతుంటారు.
ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారు తమ సబ్జెక్ట్‌కి సంబంధించిన సాంకేతిక అంశాలపై పట్టుకలిగి ఉండాలి. కనీస పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుంటే రిక్రూటర్లు మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఇష్టపడరు. ఇక కోడింగ్‌ తదితర అంశాలకు సంబంధించీ కాస్త కసరత్తు చేయాలి. చాలా సులభమైన కోడింగ్‌కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుంటే మిమ్మల్ని ప్రతిభావంతులుగా పరిగణించరు. అందువల్ల ప్రతి మౌఖికపరీక్షకూ ముందుగా మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించి కాస్త సన్నద్ధం కావడం మంచిది.
లక్ష్యాలూ తెలుసుకోవాలి
ఒక సంస్థ మిమ్మల్ని ఉద్యోగంలోకి ఎందుకు తీసుకుకోవాలనుకుంటుందో గుర్తించాలి. మీ నుంచి ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తుంది.. మీలో ఎలాంటి లక్షణాలుండాలని కోరుకుంటోంది కూడా పసిగట్టాలి. ఇందుకోసం ఆయా సంస్థల వెబ్‌సైట్లలోకి వెళ్లి కంపెనీ లక్ష్యాలు, ఉత్పత్తులు, అక్కడి పని వాతావరణం తదితర అంశాలకు చెందిన విషయాలను పరిశీలించాలి. ఒకసారి మీరు దరఖాస్తు చేసిన ఉద్యోగానికి సంబంధించి వివరాలను కూడా చదవాలి. వాటిలో సంస్థ మీ నుంచి ఏం ఆశిస్తుందో తెలుసుకోవచ్చు. ఇక్కడ లభించిన వివరాల ఆధారంగా మీరు ముఖాముఖి పరీక్షకు సిద్ధమయితే విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
ప్రస్తుతం అంతర్జాలంలో దొరకని సమాచారం అంటూ దాదాపుగా ఏమీ లేదు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీరు ఎదుర్కోనున్న మౌఖిక పరీక్ష తాలూకు వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో ఆరా తీయండి. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలో ముందే సిద్ధం అవ్వండి. ఆయా ప్రశ్నలను వెల్లడించిన వెబ్‌సైట్లు లేదా బ్లాగ్‌లు వాటికి సరైన సమాధానం ఎలా ఉండాలో కూడా సూచించి ఉంటాయి. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోండి. అవసరమనుకుంటే నిపుణుల సూచనలూ తీసుకోండి. ఇలా మీరు ఎదుర్కోనున్న ఇంటర్వ్యూకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను ముందే సిద్ధం చేసుకొంటే ఆత్మవిశ్వాసంతో మౌఖిక పరీక్షకు హాజరుకావొచ్చు.
రెజ్యూమె, దరఖాస్తుఫారాల్లో అసలు ఏం నింపారో కూడా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒకసారి చూసుకోవాలి. అనుభవం, విద్యార్హతలు, నైపుణ్యాలకు సంబంధించి ఏం పేర్కొన్నారో పరిశీలించాలి. వాటినే ఇంటర్వ్యూలోనూ చెప్పాలి. వాటికి భిన్నంగా చెబితే విజయావకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల ఏ మౌఖిక పరీక్షకు వెళ్తున్నా ముందుగా రెజ్యూమెలను పరిశీలించడం మరవొద్దు.
చివరి నిమిషందాకా వద్దు..
ఇంటర్వ్యూ సమయంలో ఏ పనినీ చివరి నిమిషం దాకా లాగవద్దు. ఎప్పటిపనిని అప్పుడు పూర్తి చేసి.. ముందు రోజు సరిపడా నిద్రపోవాలి. అలా కాకుండా చివరి నిమిషం వరకూ సన్నద్ధమవుతూ కూర్చోవద్దు. సకాలంలో మౌఖిక పరీక్షకు హాజరయ్యేలా ప్రణాళిక చేసుకోవాలి. దీంతో కాస్త ప్రశాంతంగా ఇంటర్వ్యూను ఎదుర్కోవచ్చు. ఇక ఆహార్యం, రిక్రూటర్ల ముందు వ్యవహరించే తీరు, మాటతీరు హుందాగా ఉండేటట్టు జాగ్రత్తపడాలి. సందర్భానికి తగినట్లు హావభావాలను ప్రదర్శించాలి. అంతేకాని శిలలా ఉండవద్దు. అక్కడి వాతావరణం సీరియస్‌గా ఉంటే సీరియస్‌గా.. సరదాగా ఉంటే కాస్త సరదాగానే మీ వ్యవహారశైలి ఉండాలి.
చివరిగా..
ఇంటర్వ్యూ అనేది మీకు మాత్రమే అవసరం కాదు.. సంస్థకు కూడా. ఎందుకంటే మంచి సంస్థలో చేరాలని మీరు ఎలా కలలు కంటారో సంస్థ కూడా మంచి ఉద్యోగులు కావాలని ఆశిస్తుంది. అందువల్ల మౌఖిక పరీక్షలో ఎప్పుడూ ఒత్తిడికి గురికావొద్దు. సానుకూల భావనలతో ముందుకు వెళ్లండి. ఆందోళన, ఒత్తిడులకు గురవకుండా రిక్రూటర్లు అడిగే ప్రశ్నలకు మీకు తెలిసినంత వరకు సమాధానాలు ఇవ్వండి. తెలియకుంటే తెలియదని చెప్పండి. అంతే కాని నటన.. తెలియకున్నా ఏదో ఒకటి చెప్పాలనుకోవడం సరికాదు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning