అధ్యాపకులుగా పరిశ్రమ అనుభవజ్ఞులు?

* ఏఐసీటీఈ ప్రక్షాళన
* పునర్‌వ్యవస్థీకరణపై నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
* సాంకేతిక విద్యలో సమూల మార్పులకు మోదీసర్కారు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యలో సమూల మార్పులకు, అందుకు ఉద్దేశించిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో సాంకేతిక విద్య ప్రమాణాలు, కళాశాలల గుర్తింపు తదితర ప్రక్రియల్లో అతి కీలకమైన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)ని పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఏఐసీటీఈ పునర్‌వ్యవస్థీకరణతో పాటు దేశంలో సాంకేతిక విద్య బలోపేతానికి సిఫార్సులు చేయటం ఈ కమిటీ బాధ్యత. ఆరు నెలల్లో ఈ కమిటీ తన నివేదికను మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్డీ)కు సమర్పించాలని సూచించారు. ఎంహెచ్‌ఆర్డీ మాజీ కార్యదర్శి ఎం.కె.కా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో హైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌ ఆచార్య యు.బి.దేశాయ్‌ని కూడా సభ్యుడిగా నియమించారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లోని నిపుణులు, అనుభవజ్ఞులైన సిబ్బందిని కళాశాలల్లో బోధకులుగా (డెప్యుటేషన్‌పై) తీసుకోవటానికున్న మార్గాలు, అవకాశాల్ని సూచించాలని ఈ కమిటీకి నిర్దేశించారు. సాంకేతిక విద్యారంగాన్ని, పరిశ్రమలతో అనుసంధానించాలని, పరిశ్రమల్లోని అనుభవజ్ఞులతో పాఠాలు చెప్పించుకోవటానికి అనుమతించాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. అయితే... ఏఐసీటీఈ నిబంధనల మేరకు అది సాధ్యపడటం లేదు. నిర్దేశిత విద్యార్హతలు (స్నాతకోత్తర విద్య, పీహెచ్‌డీ... తదితర) ఉన్నవారినే బోధకులుగా నియమించుకోవాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. పరిశ్రమల్లోని చాలామందికి ఏళ్ళ తరబడి అనుభవం ఉన్నా విద్యార్హతలు లేని కారణంగా బోధనకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ''బీటెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించే చాలామంది ఎంటెక్‌, పీహెచ్‌డీలు చేయరు. కానీ పరిశ్రమలో వారి అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. 10 నుంచి 20 ఏళ్ళుగా పరిశ్రమలో అనుభవం ఉన్న వ్యక్తి నుంచి ఎంతో నేర్చుకోవటానికి వీలుంటుంది. వారూ బోధకులుగా రావటానికి ఇష్టపడుతున్నారు. కానీ...ఇపుడున్న నిబంధనలు మాత్రం డిగ్రీలకు ప్రాధాన్యమిస్తున్నాయి. డిగ్రీలకు అనుభవం కూడా తోడైతే... అప్లికేషన్‌ ఆధారిత సబ్జెక్టుల్లో బోధన మరింతగా మెరుగవుతుంది. ప్రభుత్వ ఆలోచన మంచి ముందడుగే'' అని హైదరాబాద్‌లోని కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ ఎస్‌.నితిన్‌ అన్నారు.
* భావి సవాళ్లకు ఈ సంస్థ సరిపోవట్లేదు....
సాంకేతిక విద్య పర్యవేక్షణకు 1987లో ఏర్పాటైన ఏఐసీటీఈ.. నేడు సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోలేకపోతోందని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా అనూహ్యంగా విస్తరించిన ప్రైవేటు విద్యాసంస్థలను నిర్దేశించటంతో పాటు భవిష్యత్తులో అంతర్జాతీయంగా భారత్‌ను సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థాయిలో నిలబెట్టాలంటే ప్రస్తుత ఏఐసీటీఈని పునర్‌వ్యవస్థీకరించాల్సిందేనని కేంద్రం స్పష్టంచేసింది. అందుకే... ఏఐసీటీఈ బాధ్యతల్ని, విధుల్ని, పనితీరును పునర్నిర్వచించే, భారత్‌లో ఉన్నతవిద్యను మరింత పటిష్ఠం చేయటంతోపాటు, పరిశోధనల్ని విస్తృతపరిచేందుకు వీలైన సూచనలు చేయాల్సిందిగా కమిటీకి కేంద్రం నిర్దేశించింది. వీటితోపాటు సాంకేతిక విద్యలో ప్రైవేటు సంస్థల్ని నియంత్రించటం; విద్య వ్యాపారీకరణను అడ్డుకోవటానికి సూచనలు చేయాలని పేర్కొంది. అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానించేలా దేశంలోని సాంకేతిక విద్యను సంస్కరించటానికి సలహాలివ్వటం కూడా కమిటీ విధుల్లో ఒకటిగా తెలిపింది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning