'ఐ' మాయలు మనోడివే!

* శివాజీలో నల్లగా ఉండే రజినీకాంత్‌ తెల్లగా మారిపోతే ఆ మ్యాజిక్‌కి అంతా నోరెళ్లబెట్టారు...
* రోబోలో చిట్టీ చేసిన విన్యాసాలకు అదుర్స్‌ అని చప్పట్లు కొట్టారు...
* తాజాగా 'ఐ'లో విక్రం మేకప్‌, గ్రాఫిక్స్‌ చేస్తున్న సంచలనం అంతాఇంతా కాదు... ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సృష్టికర్త శ్రీనివాస్‌ ఎం.మోహన్‌ మన తెలుగువాడే.. ఈ ప్రతిభకి మూడు జాతీయ అవార్డులందుకున్నాడు... ఐ విడుదల సందర్భంగా అతడితో మాట కలిపింది ఈతరం'...

పేదింటి కుర్రాడు ఎవరూ వూహించనంత ఎత్తుకు ఎదగడం.. చిల్లర పనులు చేసే వ్యక్తి దేశం మెచ్చే అద్భుతాలు చేయడం.. ఇలాంటి సీన్లు బహుశా సినిమాల్లోనే చూసుంటాం. వెరైటీ గ్రాఫిక్స్‌తో సత్తా చాటుతున్న శ్రీనివాస్‌ జీవితం, ఎదిగిన క్రమం అచ్చం అలాంటిదే.
కష్టాల్ని మాయ చేశాడు
గ్రాఫిక్స్‌తో వూహించని పాత్రలకు ప్రాణం పోస్తూ.. పెద్దపెద్ద హీరోలు, దర్శకులతో భుజంభుజం రాసుకొని తిరిగే శ్రీనివాస్‌ ఒకప్పుడు పూట గడవడానికి బోలెడు కష్టాలు అనుభవించాడు. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. చదువు పూర్తి కాకముందే అమ్మ దూరమైంది. పదితో చదువు ఆగిపోయింది. లారీ క్లీనర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా, ఎలక్ట్రానిక్స్‌ ఆడియో రికార్డింగ్‌ అసిస్టెంట్‌గా.. ఇలాంటి పనులెన్నో చేశాడు.
దశ తిరిగింది
రకరకాల పనులు చేశాక అతడి చూపు కంప్యూటర్‌పై పడింది. అప్పుడే యానిమేషన్‌ వూపందుకుంటోంది. విజయవాడలో ఓ సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకొని అక్కడే ఫ్యాకల్టీగా చేరాడు. ఆపై ఓ సంస్థకి సాఫ్ట్‌వేర్‌ రాయడానికి కుదిరాడు. అప్పుడే యానిమేషన్‌ త్రీడీ పరిచయమైంది. పట్టుపట్టి నెలరోజుల్లో సొంతంగా నేర్చేసుకున్నాడు. ఎక్కువమంది స్నేహితులు వీడియోగ్రాఫర్స్‌ కావడంతో తన టాలెంట్‌ చూపిస్తూ చిన్నచిన్న గ్రాఫిక్స్‌ చేసేవాడు. అతడి ప్రతిభ, ఆసక్తి గమనించిన బాలకృష్ణ అనే వ్యక్తి ఇద్దరం కలిసి హైదరాబాద్‌లో అడ్వర్టెజింగ్‌ ఏజెన్సీ పెడదాం రమ్మన్నారు. తనకున్న పరిజ్ఞానం సరిపోదేమోనని శ్రీనివాస్‌ సందేహం. డబ్బులిచ్చి చెన్నై వెళ్లి కోర్సు నేర్చుకొని రమ్మని సలహా ఇచ్చారాయన. అక్కడికెళ్లి త్రీడీ, మాక్‌ కోర్సులో చేరాడు. ఉదయం క్లాసులకు హాజరవుతూనే సాయంత్రం వరకు వేరేచోట పని చేసేవాడు. ఆ సమయంలోనే సినిమాలకు గ్రాఫిక్స్‌ చేసే ీ'ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ కంప్యూటర్స్‌ గ్రాఫిక్స్‌' ఫౌండర్‌ కమలాకరన్‌ పరిచయమైంది. ఓ ప్రాజెక్ట్‌కి పని చేయమన్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా అరుణాచలం సినిమా టైటిల్‌ రూపొందించాడు. ప్రతిఫలంగా అందుకున్న మొత్తం రూ.పన్నెండువేలు. బంధువులతో చెబితే ఎవరూ నమ్మలేదు. పైపెచ్చు ఏదైనా తప్పు పనిచేసి సంపాదించావా?' అని సందేహించారు. తను మొదటిసారి జాతీయ అవార్డు తీసుకున్న తర్వాతగానీ వాళ్లలో నమ్మకం కలగలేదు.
గ్రాఫికింగ్‌
* 'మ్యాజిక్‌ మ్యాజిక్‌' సినిమాకి బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌గా జాతీయ అవార్డు
* శివాజీకి బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌గా నేషనల్‌ అవార్డు
* 2011 ఎంథిరన్‌ గ్రాఫిక్స్‌కి జాతీయ ఉత్తమ అవార్డు
* ఫిక్కీ ఫ్రేమ్స్‌, ఐఫా, స్టార్‌ స్క్రీన్‌, గ్లోబల్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ హానర్‌ సహా పలు పురస్కారాలు

చిన్న అవకాశంతో ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో చేరిన శ్రీనివాస్‌ తనకిచ్చిన ప్రతి పనిలో ప్రత్యేకత చూపేవాడు. అరుణాచలం తర్వాత ప్రేమికులరోజు, బోయ్స్‌, శివాజీ, అపరిచితుడు, మాట్రన్‌, రోబో.. ఇలా దాదాపు ముప్ఫై సినిమాలకు పనిచేశాడు. స్వయంకృషితో ఎదిగి క్రమంగా కంపెనీలో భాగస్వామిగా, ఆపై సీఈవోగా మారిపోయాడు.
శంకర్‌ మెచ్చాడు
క్రియేటివ్‌ డైరెక్టర్‌గా శంకర్‌కి దేశవ్యాప్తంగా పేరుంది. టెక్నాలజీ, గ్రాఫిక్స్‌ని తను వాడినంతగా మరెవరూ వాడరు. అంతటి సక్సెస్‌ఫుల్‌ దర్శకుడికి నమ్మినబంటు శ్రీనివాస్‌. బోయ్స్‌ సినిమాతో తొలిసారి పరిచయమైంది. మారో మారో' పాటకి గ్రాఫిక్స్‌ చేశాడు. పనితనమేకాదు, అతడి అంకితభావం శంకర్‌కి నచ్చింది. అపరిచితుడు, శివాజీ, రోబో.. ప్రతి సినిమాకి అవకాశమిచ్చాడు. గ్రాఫిక్స్‌ విషయంలో శంకర్‌కి ఏ సందేహం వచ్చినా మొదట ఫోన్‌ చేసేది శ్రీనివాస్‌కే. రోబో మొదలయ్యేనాటికి గ్రాఫిక్స్‌ పూర్తి బాధ్యతలు అప్పజెప్పి వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా ప్రమోషన్‌ ఇచ్చాడు. స్టోరీ బోర్డ్‌ నుంచి ప్రివిజువలైజేషన్‌, నిర్మాణం పూర్తయ్యేదాకా అన్ని విభాగాల్ని గమనిస్తూ.. దర్శకుడి విజన్‌ నుంచి విజువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తయ్యేవరకూ అన్ని బాధ్యతలు తీసుకున్నాడు శ్రీనివాస్‌. మొదటి సినిమా గ్రాఫిక్స్‌ అదిరిపోయాయి. జాతీయ అవార్డులూ వరించాయి. నాణ్యత, కొత్తదనం కోసం దేశదేశాల్లో తిరిగేవాడు. ఆ తపనతోనే ప్రతి సినిమాకి ఒక కొత్త టెక్నాలజీ పరిచయం చేశాడు. శివాజీలో రజినీకాంత్‌ని తెల్లగా మార్చే డిజిటల్‌ స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ని ఉపయోగించడం ప్రపంచంలోనే తొలిసారి. రోబోలో వాడిన లైట్‌ స్టేజ్‌' టెక్నాలజీ హలీవుడ్‌తో సహా ఇంతకుముందు నాలుగైదు సినిమాల్లోనే వినియోగించారు. క్లైమాక్స్‌లో విలన్‌ చిట్టీ వంద రోబోలుగా మారి చేసే ఫైట్‌ సీక్వెన్స్‌ కోసమే రెండేళ్లు కష్టపడ్డాడు. దీనికోసం పన్నెండు స్టూడియోలకు చెందిన రెండువందల మంది గ్రాఫిక్స్‌ నిపుణులు పనిచేశారు. 'మాట్రన్‌'లో శరీరాలు అతుక్కుని ఉండే కవల హీరోలు అతడి గ్రాఫిక్స్‌ మహత్యమే. త్వరలో విడుదల కాబోతున్న ఐ' సినిమాకి సైతం ఎవరూ వూహించని రీతిలో గ్రాఫిక్స్‌ చేశామంటున్నాడు శ్రీనివాస్‌. ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాడు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning