కళాశాలల్లో మళ్లీ సందడి!

* పెరుగుతున్న ప్రాంగణ నియామకాలు
* కొత్త టెక్నాలజీలు, 'డిజిటల్‌ ఇండియా' ఊతం

ఈనాడు - హైదరాబాద్‌: దాదాపు రెండు, మూడేళ్ల తరువాత మళ్లీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణాల్లో ఐటీ కంపెనీల సందడి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ప్రధాన కంపెనీలు ఈ ఏడాది అధికంగానే ప్రాంగణ నియామకాలు చేసే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా గత రెండు-మూడేళ్లుగా ఐటీ కంపెనీలు పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టలేదు. 'బెంచ్‌ సిబ్బంది'ని కూడా బాగా తగ్గించాయి (అవసరం లేకపోయినా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టుల దృష్ట్యా అదనపు ఉద్యోగులను ఐటీ కంపెనీలు తీసుకుంటాయి; వీరిని బెంచ్‌ సిబ్బంది అంటారు). బెంచ్‌ సిబ్బంది వెళ్లిపోవడం.. అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు పుంజుకుని కొత్త ప్రాజెక్టులకు మార్గం సుగమం కావడం.. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 'డిజిటల్‌ ఇండియా' పిలుపు మొదలైన కారణాల వల్ల ఐటీ కంపెనీల ప్రాంగణ నియామకాలు జోరు అందుకుంటాయని టాలెంట్‌ స్ప్రింట్‌ ఛైర్మన్‌ జె.ఎ.చౌదరి తెలిపారు. 2008 ఆర్థిక మాంద్యం తరువాత ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా ఎక్కువ మందిని బెంచ్‌పై ఉంచడం లేదని హైసియా ప్రెసిడెంట్‌ రమేశ్‌ లోగనాథన్‌ తెలిపారు. గతంలో 20 శాతం వరకూ ఉద్యోగులు బెంచ్‌పైన ఉండే వారని.. ఇప్పుడు ఇది 7 శాతం మించడం లేదని అంటున్నారు.
దేశంలోని చివరి గ్రామానికి కూడా విద్య, వైద్య సౌకర్యాలు అందాలని.. అందుకు ఐటీ ఉపయోగపడాలని మోదీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఐటీ ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం పెరగనుంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా అనలిటిక్స్‌ వంటి కొత్త టెక్నాలజీలు, వ్యాపార అవకాశాలు కూడా ఐటీ కంపెనీలను ప్రాంగణ నియామకాలకు పురిగొల్పుతున్నాయి. ఈ తీరు మరో రెండో, మూడేళ్ల పాటు కొనసాగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెరుగుతున్న ప్రాంగణ నియామకాలు పరిశ్రమ వృద్ధికి సూచికని పేర్కొంటున్నాయి.
తొలి అడుగు టీసీఎస్‌ది:
ఇందుకు ఊతమిస్తూ.. దేశంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) కోసం కళాశాల ప్రాంగణాల్లో 35,000 మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 350-400 విద్యా సంస్థల నుంచి వీరిని తీసుకోనుంది. కంపెనీ ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) కోసం కాలేజీల నుంచి 25,000 మంది విద్యార్థులను కంపెనీ ఎంపిక చేసింది. వీరిలో కొంతమంది చేరగా.. మరికొంతమంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది కాలేజీ ప్రాంగణాల్లో ఎంపిక చేసిన వారిలో 71-72 శాతం మంది కంపెనీలో చేరవచ్చని టీసీఎస్‌ భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే టీసీఎస్‌ ప్రాంగణ నియామకాలు దాదాపు 40 శాతం పెరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 15,000-16,000 మంది కొత్తవారిని కాలేజీల నుంచి నియమించాలని ఇన్ఫోసిస్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతక్రితం ఏడాది ప్రాంగణ నియామకాలు 6,000 మందితో పోలిస్తే ఇది 100 శాతంపైనే. ఈసారి కూడా ఇన్ఫోసిస్‌ అధిక స్థాయిలోనే ప్రాంగణ నియామకాలు చేపట్టే వీలుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వంటి ప్రధాన కంపెనీలు కూడా ప్రాంగణ నియామకాలపై ఆశావహ దృక్పథంతోనే ఉన్నాయని పేర్కొంటున్నాయి. సాధారణంగా ప్రాజెక్టులకు టీసీఎస్‌ చాలా తక్కువ బిడ్‌లను దాఖలు చేస్తుంది. అధిక శాతం ప్రభుత్వ ప్రాజెక్టులు ఈ కంపెనీకే వస్తూ ఉంటాయి. అందువల్ల టీసీఎస్‌ ఎక్కువమంది కొత్తవారిని నియమించుకుంటూ ఉంటుందని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రాంగణ నియామకాలు వేగాన్ని అందుకున్నప్పటికీ.. వేతన ప్యాకేజీల్లో పెద్ద మార్పు లేదు. ఒక విధంగా సగటు వేతన వ్యయ నియంత్రణకే ఐటీ కంపెనీలు కొత్తవారికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. ప్రాంగణాల్లో విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చినప్పటికీ.. అవసరమైనప్పుడే కంపెనీలు వారిని తీసుకుంటున్నాయి.
పక్క రాష్ట్రాలపై చూపు..:
మనవద్ద ఐటీ ఉద్యోగాలు ఉన్నాయని, అయితే.. కావలసిన నైపుణ్యం ఉన్న విద్యార్థులు లేరని జె.ఎ.చౌదరి తెలిపారు. దీంతో కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను వదిలేసి తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలపై దృష్టి పెడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి వందల సంఖ్యలో ఇంజినీరింగ్‌ కళాశాలలున్నా.. గట్టిగా 50 కళాశాలల్లో మాత్రమే ప్రాంగణ నియామకాలకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, కాగ్నిజెంట్‌, ఐబీఎం, యాక్సెంచర్‌ కంపెనీలు ప్రాంగణ నియామకాలకు వస్తాయని సీఎమ్‌ఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ (కార్పొరేట్‌ సంబంధాలు) కిరణ్‌ కుమార్‌ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు లేకపోవడానికి ప్రధాన కారణం బోధన సిబ్బందేనని, అధిక శాతం కాలేజీలు సరైన బోధన సిబ్బందిని నియమించడం లేదని హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ (హెచ్‌పీ)లో సీనియర్‌ కన్సల్టెంట్‌ (డెవలప్‌మెంట్‌)గా పనిచేస్తున్న డి.వి.రమణ వివరించారు. కంపెనీల్లో ఉద్యోగాలు దొరకని చాలామంది బోధన వైపు వస్తున్నారని.. వీరిలో విషయ పరిజ్ఞానంతో పాటు దాన్ని వ్యక్తంచేసే భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు కూడా ఉండడం లేదన్నారు.

Posted on 05-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning