బోధన ఇక్కడెంతో ప్రత్యేకం

ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎంలలో ప్రవేశం అంటే... విద్యార్థుల భవితను ఉజ్వలంగా మార్చగల గొప్ప అవకాశం. దేశం నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులందరితో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే ఐఐఎం తిరుచ్చిలో విద్యాబోధన తీరు ఎలా ఉంటుంది? అక్కడి క్యాంపస్‌ కబుర్లను 'చదువు'కు వివరించాడు వరుణ్‌. ఆ విశేషాలు అతడి మాటల్లోనే....
మూడు సంవత్సరాలు ఇన్ఫోసిస్‌లో పనిచేసిన తరువాత 'కళాశాలలో ఇమడగలనా లేదా?' అనే సందేహంతో ఐఐఎం తిరుచ్చిలో అడుగుపెట్టాను. కానీ నా అనుమానాలను పటాపంచలు చేస్తూ ఉందిక్కడి వాతావరణం. 800 ఎకరాల్లో ఉన్న సుప్రసిద్ధ ఐఐఎం తిరుచ్చి క్యాంపస్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు మా కళాశాలను. శాశ్వత నిర్మాణం వూరి అవతల మొదలైంది. 2011లో మానవ వనరులశాఖ స్థాపించిన ఏడు కళాశాలల్లో ఐఐఎం తిరుచ్చి ఒకటి.
ఇక్కడ కోర్సుతోపాటు విద్యేతర కార్యక్రమాలకూ పెద్దపీట వేస్తారు. సర్వతోముఖాభివృద్ధి ఉండేలా చూస్తారు. విద్యార్థులకు దారిచూపేవీ, విద్యార్థులే నిర్వహించేవిగానే అన్ని కార్యకలాపాలూ ఉంటాయి. హాస్టల్‌ మెస్‌, మౌలిక సదుపాయాల నిర్వహణ, కళాశాలలో వైఫై, కంప్యూటర్ల నిర్వహణ వరకు అన్నింటికీ కమిటీలు ఉంటాయి. వీటితోపాటు ప్రతి స్పెషలైజేషన్‌కూ ఒక క్లబ్‌ ఉంటుంది. ఉదాహరణకు మార్కెటింగ్‌ వాళ్లకు మార్కెటింగ్‌ & అడ్వర్త్టెజింగ్‌ క్లబ్‌ అనీ, ఫైనాన్స్‌ వాళ్లకు ఫిన్వెస్ట్‌ క్లబ్‌ అనీ, ఆపరేషన్స్‌ వాళ్లకు సిగ్మా ఈటా క్లబ్‌ అనీ ఐదు రకాల అకడమిక్‌ క్లబ్బులున్నాయి. వీటిలో చేరి విద్యార్థి తన స్పెషలైజేషన్‌కు తగిన విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు.
వీటితోపాటు నాన్‌ అకడమిక్‌ క్లబ్బులూ ఉంటాయి. ఫొటోగ్రఫీపై ఇష్టం ఉన్నవారికి '11 మెగాపిక్సల్‌ ఫొటోగ్రఫీ క్లబ్‌' ఉంది. సభా పిరికితనాన్ని వదిలించుకుని మంచి వక్తగా తయారవాలనుకుంటే 'పోడియం'లో చేరితే సరిపోతుంది. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేవారి కోసం 'ఎలిగ్జిర్‌ క్లబ్‌'. విద్యార్థుల్లో వ్యాపార మెలకువలు అభివృద్ధి చేయడానికి 'ఈ-సెల్‌' ఎప్పుడూ ముందుంటుంది. వీటికి తోడు డాన్స్‌ క్లబ్‌, సింగింగ్‌ క్లబ్‌... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
ప్రత్యేక విధానం
ఇక్కడ బోధన పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బృందంతో కలిసి పనిచేయడం- నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది. కేస్‌స్టడీలను ఉపయోగించి ప్రయోగాత్మక భావనలను నిజజీవితంలో ఎలా ఉపయోగించవచ్చో చర్చిస్తుంటారు. దీనివల్ల విద్యార్థుల్లో సమస్యను పరిష్కరించగల, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంపొందేలా చేస్తారు. వీటికితోడు అతిథి ఉపన్యాసాలు, సెమినార్లు, ఆటలు, రోల్‌ ప్లేలు, పరిశ్రమల సందర్శనలు ఎన్నో ఉంటాయి.
బృంద అభ్యసనం
ఎంబీఏలో అత్యంత కీలకం- బృందంగా ఏర్పడి చదువుకోవడం (గ్రూప్‌ స్టడీస్‌). ఇక్కడ ఈ విధానానికి పెద్దపీట వేస్తారనడంలో అతిశయోక్తి లేదు. నిజమైన శిక్షణ బృంద కార్యకలాపాల ద్వారానే జరుగుతుంది. ఇవి కేస్‌ ప్రజెంటేషన్ల నుంచి లైవ్‌ ఇండస్ట్రీ ప్రాజెక్టుల వరకూ ఉంటాయి. వేర్వేరు నేపథ్యం ఉన్న విద్యార్థులను కలిపి బృందాలుగా చేస్తుంటారు. హాస్టల్‌లో కూడా బృందంగా కలిసి చదువుకుంటారు.
పరీక్షలు: రెండు సంవత్సరాల కోర్సులో 6 ట్రైమిస్టర్లు ఉంటాయి. ఒక్కో ట్రైమిస్టర్‌ మూడు నెలలకు ఉంటుంది. మొదటి సంవత్సరం చివర్లో విద్యార్థులు ఒక్కో క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఆ ట్రైమిస్టర్‌కు సంబంధించిన చివరి పరీక్షలు జరుగుతూ ఉంటాయి. బట్టీపట్టే విధానం ఉండదు. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే 'తుది పరీక్షల'కు అందరికీ 100 మార్కుల వెయిటేజీ ఉండదు. గరిష్ఠంగా 50 మార్కులే చివరి పరీక్షలకు ఉంటాయి. మిగతా 50 మార్కులకు గ్రూప్‌ ఎక్సర్‌సైజులు, ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు మొదలైనవి ఉంటాయి.
నా క్యాట్‌- 2013 అనుభవం
ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నపుడు ఇంకా జీవితంలో ఏదైనా చేయాలనే కుతూహలం ఉండేది. అదే నన్ను క్యాట్‌కు సిద్ధమయేలా చేసింది. ఉద్యోగం చేస్తున్నందువల్ల రోజుకు మూడు గంటలకన్నా ఎక్కువ చదవడానికి వీలు కుదరలేదు. కానీ శని, ఆదివారాలు మొత్తం సన్నద్ధతకు వెచ్చించేవాడిని. అలా చేసిన 8 నెలల కష్టమే నన్ను ఐఐఎంలో ప్రవేశం వచ్చేలా చేసింది.
ఇక్కడ విద్యార్థులు అన్ని రంగాలకు చెందినవారు ఉంటారు. సీఏ, ఇంజినీరింగ్‌, డిగ్రీ, కామర్స్‌ చేసినవారి నుంచి క్యాంపస్‌లో 1- 5 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగుల వరకు అన్ని రకాల విద్యార్థులుంటారు. కానీ ఎక్కువగా ఇంజినీరింగ్‌వారే ఉండడం విశేషం. దేశంలోని నలుమూలల విద్యార్థులూ ఇక్కడ కనిపిస్తారు. దీనివల్ల సమగ్ర అభ్యసనం పెంపొందుతుంది.

Posted on 06-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning