గగన సీమలో భాగ్యరేఖ!

* ఏరోస్పేస్‌ ఉత్పత్తుల కేంద్రంగా హైదరాబాద్‌
* భారీగా పెరగనున్న ఉద్యోగ అవకాశాలు

ఈనాడు - హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ రంగంలో తన సత్తా చాటుతున్న హైదరాబాద్‌...ఏరోస్పేస్‌ ఉత్పత్తుల తయారీలోనూ కీలక భూమిక వహించబోతోంది. విమానాలు, హెలికాప్టర్లు, వాటి విడి భాగాల తయారీలో అంతర్జాతీయస్థాయి కేంద్రంగా రూపుదాల్చనుంది. పలు దేశీయ సంస్థలతో కలసి విదేశీ కంపెనీలు అత్యాధునిక ఏరోస్పేస్‌ ఉత్పత్తుల తయారీకి ఆసక్తిచూపుతున్న పరిస్థితులు.. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు ఇందుకు అనుకూలించనున్నాయి. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమతోపాటు ఏరోస్పేస్‌ పరిశ్రమకు కూడా హైదరాబాద్‌ను కేంద్రం చేయాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ భావిస్తోంది. కొత్తగా రెండు ఏరోస్పేస్‌ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా రక్షణ, ఏరోస్పేస్‌ అంతర్జాతీయ సదస్సును ఇక్కడ నవంబరు 12-14 తేదీల్లో నిర్వహించనుంది. ఈ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్‌ను అత్యుత్తమ గమ్యస్థానంగా చూపడానికి ఈ సదస్సును ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
ప్రైవేటు రంగంలో తొలి రవాణా విమానం
భారత వైమానిక దళంలోని ఎవ్రో విమానాల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టబోయే విమానాలు హైదరాబాద్‌లోనే తయారు కానున్నాయ్‌! ఎవ్రో విమానాల స్థానంలో ఎయిర్‌బస్‌ సీ295 మధ్య స్థాయి రవాణా విమానాలను సరఫరా చేయడానికి ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌తో కలిసి టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(టీఏఎస్‌ఎల్‌) సంయుక్త బిడ్‌ను దాఖలు చేసింది. పోటీలో ప్రభుత్వం ఈ బిడ్‌ను ఎంపిక చేస్తే.. భారత వైమానిక దళానికి 56 'సీ295' విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు రూ.13,000 కోట్లు ఉండొచ్చు. ఇందులో మొదటి 16 విమానాలను యూరప్‌నకు చెందిన ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ తన తయారీ యూనిట్ల ద్వారా సరఫరా చేస్తే.. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తయారు చేస్తుంది. హైదరాబాద్‌లోని ఆదిభట్ల ఏరోస్పేస్‌ సెజ్‌లో ఈ కంపెనీ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్ట్రక్చరల్‌ అసెంబ్లింగ్‌, చివరిగా విమాన కూర్పు, పరీక్షలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. అప్పుడు ప్రైవేటు రంగంలో మిలటరీ రవాణా విమానాన్ని తయారు చేసిన మొదటి యూనిట్‌ ఇదే అవుతుంది. భారత వైమానికి దళానికి విమానాలను సరఫరా చేసే కాంట్రాక్టు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు లభిస్తే.. ఏరోస్పేస్‌ పరిశ్రమకు హైదరాబాద్‌ కేంద్రం (హబ్‌)గా మారడానికి అది కీలకమవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల విమానాల తయారీకి ఉపయోగించే అనేక విడిభాగాల పరిశ్రమలు హైదరాబాద్‌లో విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
జీఎంఆర్‌ గ్రూప్‌ సన్నాహాలు
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏరోస్పేస్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జీఎంఆర్‌ గ్రూప్‌ సన్నాహాలు చేస్తోంది. ఏరోస్పేస్‌ పరిశ్రమలోని అన్ని స్థాయిల్లోని నిపుణులు, సాంకేతిక సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు వీలుగా దీన్ని రూపొందించాలని జీఎంఆర్‌ భావిస్తోంది. మొరాకోలోని ఏరోస్పేస్‌ శిక్షణ కేంద్రంపై అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపింది. అక్కడి ప్రభుత్వ మద్దతుతో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్‌ శిక్షణ కేంద్రం వల్ల అంతర్జాతీయ ఏరోస్పేస్‌ కంపెనీలకు మొరాకో గమ్యస్థానంగా మారింది. ప్రస్తుతం మొరాకో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి ఏరోస్పేస్‌, రక్షణ రంగాలే వూతంగా ఉన్నాయి. మొరాకో తరహా విజయాన్ని ఇక్కడ కూడా పునరావృత్తం చేయాలన్నది తమ ఉద్దేశమని జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జి.ఎం.రావు పేర్కొనడం గమనార్హం. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), ఏరోస్పేస్‌ విడిభాగాలను తయారు చేసే కంపెనీలు ఇక్కడ ఉన్నప్పటికీ.. బెంగళూరులోనే ఏరోస్పేస్‌ పరిశ్రమ ఎక్కువుగా కేంద్రీకృతమైంది. ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ వంటి కంపెనీలు ప్రధానంగా బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహించడం ఇందుకు కారణం. అయితే.. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు మారాయి. విమానాల తయారీ కంపెనీలకు ఇంజినీరింగ్‌ సేవలందిస్తున్న సైయెంట్‌, రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలకు సేవలందిస్తున్న అనంత్‌ టెక్నాలజీస్‌, జెన్‌ టెక్నాలజీస్‌ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో అభివృద్ధి చెందాయి. ఇక్కడి ఏరోస్పేస్‌ విడి భాగాల తయారీ కంపెనీలు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో విడి భాగాలను తయారు చేసే స్థాయికి ఎదగటంతో ఏరోస్పేస్‌ పరిశ్రమ పుంజుకుంటోంది. అయితే.. ప్రైవేటు రంగంలోని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ అయిదేళ్ల క్రితం రంగ ప్రవేశం చేయడంతో ఇక్కడి ఏరోస్పేస్‌ పరిశ్రమకు కొత్త వూపు వచ్చిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
తొలి అడుగు సికార్‌స్కీతో..
ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ను ఒక వ్యూహాత్మక కంపెనీగా టాటా గ్రూప్‌ ఏర్పాటు చేసింది. తక్కువ సమయంలోనే దేశీయంగా కీలకమైన రక్షణ, ఏరోస్పేస్‌ కంపెనీగా ఎదగడమే కాక విమానాలు, హెలికాప్టర్లకు ప్రధాన భాగాలను తయారు చేసే కంపెనీలకు (ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌-ఓఈఎం)కు ప్రధాన సరఫరాదారుగా మారుతోంది. క్షిపణి, రాడార్‌ వ్యవస్థల అభివృద్ధి వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. ఏరోస్ట్రక్చర్స్‌ తయారీని కీలక వ్యాపారంగా కంపెనీ గుర్తించింది. విమాన, హెలికాప్టర్ల ప్రధాన భాగాల డిజైన్‌, ఇంజినీరింగ్‌, తయారీ, స్ట్రక్చరల్‌ అసెంబ్లింగ్‌లో వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని అత్యాధునిక సికార్‌స్కీ ఎస్‌ 92 హెలికాప్టర్ల కేబిన్లను తయారు చేస్తోంది. ఇందుకు సికార్‌స్కీ ఎయిర్‌క్రాఫ్ట్‌తో కలిసి 2009లో టాటా సికార్‌స్కీ ఇండియాను ఏర్పాటు చేసింది. ఈ హెలికాప్టర్లను అమెరికా ప్రెసిడెంట్‌ వినియోగించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్‌ వినియోగిస్తున్న హెలికాప్టర్ల స్థానంలో ఎస్‌92లో ఒక రకమైన విహెచ్‌-92 హెలికాప్టర్లను సరఫరా చేయడానికి సికార్‌స్కీ కాంట్రాక్టు పొందింది. ఈ హెలికాప్టర్లకు ఇక్కడి నుంచే కేబిన్లు సరఫరా అవుతాయి. పూర్తిగా భారత్‌లో తయారు చేసిన విడి భాగాలతో రూపొందించిన ఎస్‌92 కేబిన్‌ను ఏడాది క్రితం కంపెనీ సికార్‌స్కీకి అందించింది. ఇప్పటి వరకూ 81... 'ఎస్‌ 92' హెలికాప్టర్‌ కేబిన్లను సరఫరా చేసినట్లు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ డైరెక్టర్‌ సుకరణ్‌ సింగ్‌ 'ఈనాడు'కు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 200 'ఎస్‌92' హెలికాప్టర్ల సేవలు అందిస్తున్నాయి.
లాక్‌హీడ్‌ మార్టిన్‌తో బంధం
రక్షణ రవాణా విమానం 'సి-130 జె సూపర్‌ హెర్క్యులెస్‌' వెనుక భాగం సెంటర్‌-వింగ్‌ బాక్సుల (సీడబ్ల్యూబీ) తయారీకి లాక్‌హీడ్‌ మార్టిన్‌తో కలిసి టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ (టీఎల్‌ఎంఏఎల్‌)ను ఏర్పాటు చేసింది. 2011, ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు మొదలు కాగా.. ఏడాదిన్నరలో తొలి సీడబ్ల్యూబీని అందించింది. ఇప్పటి వరకూ ఇరవైకి పైగా సీడబ్ల్యూబీలు, 10 వెనుక భాగాలను సరఫరా చేసినట్లు కంపెనీ వెల్లడించింది. 2015 నాటికి 'సి-130' విమానాలకు సీడబ్ల్యూబీ, వెనుక భాగాలను తయారు చేసే ఏకైక సరఫరాదారుగా టీఎల్‌ఎంఏఎల్‌ ఎదగనుంది.
ఆర్‌యూఏజీ ఏవియేషన్‌తో..
డోర్నియర్‌ 228 ఎన్‌జీ విమాన మధ్య భాగం (ఫ్యూస్‌లేజ్‌), రెక్కలు తయారు చేయడానికి యూరప్‌నకు చెందిన ఆర్‌యూఏజీ ఏవియేషన్‌తో ఇటీవల టీఏఎస్‌ఎల్‌ చేతులు కలిపింది. ఈ విమానానికి భవిష్యత్తులో పూర్తి ఎయిర్‌ఫ్రేమ్‌ను ఇక్కడే తయారు చేసే వీలుంది. డోర్నియర్‌ 228 విమానం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది (2014) చివరి నాటి కల్లా ఈ విమానం మధ్య భాగం, రెక్కల ఉత్పత్తి ప్రారంభం కాగలదని టీఏఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.
భవిష్యత్‌ విస్తరణ హైదరాబాద్‌లోనే..
పెట్టుబడుల అనుకూల ప్రభుత్వం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నిపుణులైన ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది లభ్యం మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తయారీ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను ఎంచుకున్నామని సుకరణ్‌ సింగ్‌ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ పరిశీలనలో ఉన్న విస్తరణ కార్యకలాపాలు కూడా ఇక్కడ ఉండగలవన్నారు.
కేంద్ర ప్రభుత్వ వూతం
నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26% నుంచి 49 శాతానికి పెంచిన నేపథ్యంలో దేశీయ రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రైవేటు రంగం అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కాంట్రాక్టు (వైమానిక దళానికి విమానాల సరఫరా) కీలకం కానుంది. అనేక విదేశీ కంపెనీలు భారత భాగస్వాములతో కలిసి అవకాశాలను చేజిక్కించుకోవడానికి ఎదురు చూస్తున్నాయి. భారత్‌ తన రక్షణ అవసరాల్లో 65 శాతం ఉత్పత్తులను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉంది. ఈ నేపథ్యంలో టాటా అడ్వాన్స్‌ సిస్టమ్స్‌, ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ తరహాలో మరిన్ని కంపెనీలు చేతులు కలపగలవని, దేశీయంగా ప్రైవేటు రంగంలో రక్షణ ఉత్పత్తుల తయారీ వూపందుకోగలదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌ వంటి దేశీయ కార్పొరేట్‌ కంపెనీలు రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలో ఉన్నాయి.
తయారీ నిపుణుల కొరత
అంతర్జాతీయ ఏరోస్పేస్‌ ఉత్పత్తుల తయారీకి భారత్‌ కేంద్రం కావాలంటే.. కొన్ని సవాళ్లను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సుకరణ్‌ సింగ్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన విధానాలు, పారదర్శక, పోటీ పన్ను, సుంకం వ్యవస్థలు, వేగంగా అనుమతులు, పరిశ్రమ అనుకూల నియంత్రణ వ్యవస్థ ఉండాలన్నారు. ఏరోస్పేస్‌ రంగంలో తయారీ నిపుణులకు కొరత ఉంది. ఏరోస్పేస్‌ రంగానికి అవసరమైన ఇంజినీర్లు కొంత మేరకు లభిస్తున్నా.. ఏరోస్పేస్‌ ఆపరేటర్లకు కొరత ఉందని సింగ్‌ వివరించారు. ఈ నేపథ్యంలో ఏరోస్పేస్‌ తయారీ రంగంలో కొత్త వారికి శిక్షణ ఇచ్చేందుకు అడ్వాన్స్‌డ్‌ క్రాఫ్ట్స్‌మన్‌షిప్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి అంతర్గతంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఏరోస్పేస్‌ పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని.. దీర్ఘకాల ప్రణాళికలు, ప్రాజెక్టుల్లో ప్రైవేటు రంగం కీలక స్థాయిలో పాలుపంచుకునే అవకాశాలు కల్పించాలన్నారు. ఏరోస్పేస్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధిలో పోటీ పెరిగేలా ప్రైవేటుకు ద్వారాలు తెరవాలని సూచించారు.

Posted on 08-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning