మీకు తెలుసా... మీ అభ్యాస శైలి?

నేర్చుకునే పద్ధతి అందరికీ ఒకేలాగా ఉండదు. విద్యార్థులు తమకు ఉండే సహజమైన శైలిని గుర్తిస్తే దానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేసుకుని సమర్థంగా విషయాన్ని గ్రహించే వీలుంటుంది. ఇక్కడో ప్రశ్నావళి ఇస్తున్నాం. దాన్ని పూర్తిచేయండి. మీ ప్రభావశీల అభ్యాస శైలిని కనిపెట్టండి!
Total life is a process of learning అంటాడో ఆంగ్ల రచయిత. జ్ఞానేంద్రియాలను ప్రభావవంతంగా వాడుకుని, విషయాలను చక్కగా నేర్చుకోవడం, ఆకళింపు చేసుకోవడం ఒక్కొక్కరు ఒక్కో విధంగా అలవాటు చేసుకుంటారని మేధో వికాస శిక్షకులు అభిప్రాయపడతారు. అవే అభ్యాస శైలులు/ విధానాలు (లర్నింగ్‌ స్త్టెల్స్‌). వీటిని దృష్టి సంబంధ (విజువల్‌), శ్రవణ సంబంధ (ఆడిటరీ), స్పర్శ సంబంధ (కినస్తటిక్‌/ టాక్త్టెల్‌) ప్రజ్ఞాపాటవ విధానాలుగా వర్గీకరించారు. ప్రతి ఒక్కరూ ఈ మూడు పద్ధతుల్లో ఒకటో రెండో ప్రబలమైన, ప్రధానమైన పద్ధతుల్లో నేర్చుకుంటారని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
మనకిష్టమైన పద్ధతిలో ఏది నేర్చుకున్నా అది ఎక్కువరోజులు గుర్తుంటుంది. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నావళి మీ ప్రభావశీల అభ్యాస శైలి ఏదో తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. తద్వారా తగిన జ్ఞాన సముపార్జన (అక్విజిషన్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌), జ్ఞాన వినిమయం (అప్లికేషన్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌) పొందే వీలుంటుంది.
ఇరవై ఏడు...
కింద 27 ప్రశ్నలున్నాయి. ఒక్కోదానికి ఎ, బి, సి అని మూడు జవాబులున్నాయి. ప్రశ్న చదివి అది మీకు ఎలా వర్తిస్తుందో ఆలోచించి ఏదో ఒక జవాబు గుర్తించండి. ఇందులో సరైన జవాబనీ, తప్పు జవాబనీ లేవు. ఈ ప్రశ్నావళి సాధన మీ నిజమైన అభిప్రాయాన్ని సేకరించడం మాత్రమే. ప్రతి ప్రశ్నకూ మీరు కచ్చితంగా జవాబు గుర్తించాలి!
మీరో జవాబు గుర్తించాక అది తప్పని భావిస్తే దాన్ని కొట్టేసి మరో జవాబును ఎంచుకోవచ్చు. ప్రశ్న చదివిన వెంటనే స్ఫురించే జవాబే ఎక్కువసార్లు సమంజసమైనది అవుతుంది. జవాబు విషయంలో ఆలోచిస్తూ ఎక్కువ సమయం వృథా చేయవద్దు. ఈ ప్రశ్నావళి పూర్తిచేయడానికి నిర్దిష్ట సమయమేమీ లేదు. చాలామంది 15- 20 నిమిషాల్లో ముగిస్తారు. పెన్సిల్‌, రబ్బర్‌ తీసుకుని సమయం గుర్తుంచుకుని జవాబులు గుర్తించండి!
1) నాకిష్టమైన అసైన్‌మెంట్‌/ ఇంటి పని
ఎ. ఇంటి దగ్గర కథలు చదివి మర్నాడు విద్యాలయానికి వెళ్లడం
బి. తరగతిలో అందరి ముందు నిలబడి మాట్లాడడం
సి. తెలిసిన విషయాన్ని అందరిముందు ప్రదర్శించి చూపడం
2) చదివే కథలో నాకిష్టమైనది
ఎ. మంచి వర్ణన బి. అందమైన పదాలు, వాగాడంబరత సి. పాత్రల నటన
3) ముఖ్యమైన సమాచారం ఇతరుల నుంచి పొందాలంటే నాకిష్టమైన పద్ధతి
ఎ. ఓ ఉత్తరం రూపంలో
బి. ఫోను ద్వారా చెబితే చాలు
సి. ఓ రహస్య సంకేతాన్ని విసంకేతనం (డీకోడ్‌) చేసి తెలుసుకోవడం ద్వారా
4) నేను రాసుకునే నోటు పుస్తకాల్లోంచి ఏదో ఒకటి తీసుకుని చూస్తే అది..
ఎ. శుభ్రంగా, విలక్షణంగా ఉంటుంది
బి. శుభ్రంగా లేకపోయినా ఓ మోస్తరుగా ఉంటుంది
సి. నా నోటు పుస్తకం ఇతరులకు చూపాలంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది
5. ఓ కొత్త ఆంగ్లపదం స్పెల్లింగు నేర్చుకోవడానికి నేనేం చేస్తానంటే..?
ఎ. పదం, దాని అక్షరక్రమాన్ని బాగా గమనిస్తాను
బి. కొన్నిసార్లు ఆ పదం స్పెల్లింగ్‌ (నోటిమాటగా) చదువుతాను
సి. కొన్నిసార్లు ఆ పదం స్పెల్లింగ్‌ రాస్తాను
6. వ్యాయామం కోసం ఓ కొత్త ట్రెడ్‌మిల్‌ కొని తెచ్చాక దాన్ని ఇంట్లో అమర్చడానికి నేను చేసేది
ఎ. దాని యూజర్‌ మాన్యువల్‌లోని సూచనలు జాగ్రత్తగా చదువుతాను
బి. దాన్ని ఎలా అమర్చాలో ఎవరితోనైనా చర్చిస్తాను
సి. నేరుగా దాన్ని అమర్చడం మొదలుపెడతాను. తప్పుపోతే మళ్లీ అమర్చడం ప్రారంభిస్తాను
7. సాధారణంగా నా చేతిరాత..
ఎ. గుండ్రంగా, చక్కగా ఉంటుంది
బి. ఓ మోస్తరుగా ఉంటుంది
సి. మొదట్లో అందంగా ఉండి రాసే క్రమంలో రాను రానూ అందం పాడవుతుంది
8. కింది వాటిలో నేను సులభంగా గుర్తుంచుకునేది..
ఎ. ఒక్కసారి చూసిన మనుషుల ముఖాలు
బి. ఒక్కసారి విన్న మనుషుల పేర్లు
సి. ఎవరితోనైనా కలిసి చేసే పనులు
9. చదివేటపుడు నా ప్రాధాన్యం...
ఎ. శుభ్రమైన టేబుల్‌, కుర్చీ
బి. నిశ్శబ్దంగా ఉండే వాతావరణం
సి. సౌకర్యవంతమైన చోటు ఎక్కడైనా సరే
10. నాకు పరిచయమే లేనిచోట (ఉదాహరణకు విద్యాలయానికి/ ఉద్యోగానికి వెళ్లిన మొదటిరోజు) నా ప్రవర్తన ఎలా ఉంటుందంటే..
ఎ. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా పరిసరాలు గమనిస్తాను
బి. పక్కనే ఉన్న కొత్త వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను.
సి. రానురానూ అన్ని విషయాలు అర్థమవుతాయిలే అనుకుని నా పని నేను చేసుకుంటాను
11. 'మీ దృష్టిలో ఓ ఆదర్శవంతమైన వ్యక్తి ఎలా ఉండాల'ని ఎవరైనా నన్నడిగితే..?
ఎ. ఆ వ్యక్తి ఎలా ఉండాలో మనసులో ఊహించుకుంటాను
బి. పక్కన ఉండేవాళ్లకు ఓ ఆదర్శవంతమైన వ్యక్తి ఎలా ఉండాలో వివరిస్తాను
సి. చాలామందికి తెలిసిన ఓ ఆదర్శవంతమైన వ్యక్తి బొమ్మ గీసి చూపిస్తాను
12. విరామ సమయంలో, ఖాళీగా ఉన్నపుడు నా ప్రాధాన్యం
ఎ. ఓ సినిమా చూడడానికి ఇష్టపడతాను
బి. మనసుకు నచ్చిన సంగీతం వినడానికి ఇష్టపడతాను
సి. శారీరక కదలికలుండే (ఉదా: డాన్సు, ఆట, బయటకు వెళ్లిరావడం) పనంటే ఇష్టం
13. కింది బృందాల్లో ఏదో ఒకదాంట్లో కచ్చితంగా చేరాల్సివస్తే నా ప్రాధాన్యం
ఎ. వార్తాపత్రిక బృందంలో చేరడానికి ఇష్టపడతాను
బి. ఎప్పుడూ చర్చలు చేసే బృందంలో చేరడానికి ఇష్టపడతాను
సి. స్టేజిమీద నాటకాలు వేసే జట్టులో చేరడానికి ఇష్టపడతాను
14. నాకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరంటే..
ఎ. నల్లబల్ల (బోర్డు)పై బాగా రాసే ఉపాధ్యాయుడు
బి. విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం చెప్పే ఉపాధ్యాయడు
సి. హోంవర్క్‌ ఎక్కువగా ఇచ్చే ఉపాధ్యాయుడు
15. ఏదైనా పరీక్షకు సిద్ధం కావాలంటే నేనేం చేస్తానంటే..
ఎ. టెక్ట్స్‌, నోటు పుస్తకాలను బాగా చదువుతాను
బి. నన్ను ప్రశ్నలు అడగమని ఎవరినైనా ప్రాధేయపడతాను
సి. నేనే ఓ నమూనా పరీక్ష పెట్టుకుని రాస్తాను
16. తరగతిలో ఎపుడైనా రావాల్సిన టీచరు రానపుడు..
ఎ. రాతపని ఉంటే దాన్ని పూర్తిచేస్తాను
బి. స్నేహితులతో ముచ్చటిస్తాను
సి. తరగతిలోనే ఏదైనా ఆట ఆడే ప్రయత్నం చేస్తాను
17. తరగతిలో విద్యార్థులకు ఏదైనా సమాచారం తెలియజేయడానికి నేనేం చేస్తానంటే..
ఎ. సమాచారాన్ని బోర్డుపై రాస్తాను
బి. అందరిముందు నిలబడి మౌఖికంగా చెప్తాను
సి. తరగతిలోనే అందరిముందు నాటకీయంగా చేసి వివరిస్తాను
18. ఎక్కువగా జ్ఞానాన్ని పొందాలంటే నాకిష్టమైన పని..
ఎ. పరిశోధన వ్యాసాలు రాయడం
బి. ఎక్కువగా ఉపన్యసించడం
సి. ఇతరులతో విషయాలు చర్చించడం
19. ఓ సమస్యను (ఉదా: చిన్న అగ్నిప్రమాదం) పరిష్కరించాలంటే నా ప్రాధాన్యం
ఎ. ఏం చేద్దామని తోటి మిత్రుడికి ఓ చీటీ రాసి చూపడం
బి. ఏం చేద్దామని తోటి మిత్రుడితో చర్చించడం
సి. ఒకేచోట కూర్చోకుండా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం
20. కింది వాటిలో నేనిష్టపడే తరగతి
ఎ. ఎక్కువగా కథలు రాసే తరగతి
బి. ఎక్కువగా చర్చలుండే తరగతి
సి. ఎక్కువగా ఆటలు, వ్యాయామం ఉండే తరగతి
21. నేను పూర్తిచేసిన ఓ పనిని ఇతరులకు వివరించాలంటే నాకిష్టమైనది
ఎ. ఓ పేపరుపై రాసి ఇవ్వడం
బి. కేవలం మౌఖికంగా వివరించడం
సి. వరుసక్రమంలో హావభావాలతో, శారీరక కదలికలతో తెలియజేయడం
22. బృందంగా కలిసి పనిచేయడంలో (ప్రాజెక్టు లాంటిది) ఉండే అంశాల్లో నాకిష్టమైనది
ఎ. రాతపని
బి. పని పూర్తిఅయ్యాక మౌఖికంగా వివరించే పని
సి. ప్రత్యక్షంగా, దృష్టాంతంగా ప్రదర్శన రూపంలో వివరించే పని
23. ఎవరికైనా ఏదైనా చిరునామా తెలియజేయడానికి నేనేం చేస్తానంటే..
ఎ. ఆ చిరునామా వివరాలు కాగితంపై రాసి వివరిస్తాను
బి. అదెక్కడుందో నోటిమాటగా వివరిస్తాను
సి. ఆ చిరునామా ఎక్కడో బొమ్మ గీసి చూపెడతాను
24. మా కుటుంబ సభ్యులు నా మనస్థితి (మూడ్‌) మారిందని ఇలా గుర్తిస్తారు...
ఎ. నా ముఖకవళికల మార్పులు గమనించి
బి. నా కంఠస్వరంలోని మార్పులు గమనించి
సి. నా నడకలోని మార్పులు, నా శరీర కదలికలు గమనించి
25. కింది వాటిలో నేనిష్టపడే పరీక్ష
ఎ. రాతపరీక్ష
బి. మౌఖిక పరీక్ష
సి. ప్రయోగాల రూపంలో ఉండే (డెమో) పరీక్ష
26. నాకిష్టమైన ఓ హాబీ గురించి వివరించమంటే..
ఎ. ఆ హాబీ గురించి ఓ కథ రాసి వివరిస్తాను
బి. నేరుగా మాటల రూపంలో వివరిస్తాను
సి. ఓ ప్రదర్శన రూపంలో వివరిస్తాను
27. క్రీడలకు సంబంధించి కింది ఉద్యోగాల్లో కచ్చితంగా ఒకటి ఎంచుకోవాలంటే..
ఎ. క్రీడలకు సంబంధించిన విషయాలను వార్తల రూపంలో రాసే లేఖకుడి ఉద్యోగం
బి. ఆట జరుగుతున్నపుడు వ్యాఖ్యాతగా వ్యవహరించే ఉద్యోగం
సి. నేనే ఓ క్రీడాకారుడిగా ఆటాడే ఉద్యోగం
ఇలా సరిచూసుకోండి
జవాబులు గుర్తించడం పూర్తయ్యాక ఎ, బి, సిలు ఎన్ని గుర్తించారో లెక్కించండి.
* 'ఎ'లు ఎక్కువగా వస్తే మీరు దృష్టి సంబంధ ప్రజ్ఞాశాలి (విజువల్‌ లర్నర్‌).
* 'బి'లు ఎక్కువగా వస్తే మీరు శ్రవణ సంబంధ ప్రజ్ఞాశాలి (ఆడిటరీ లర్నర్‌).
* 'సి'లు ఎక్కువగా వస్తే మీరు స్పర్శ సంబంధ (కినస్తటిక్‌/ టాక్త్టెల్‌ లెర్నర్‌) ప్రజ్ఞాశాలి.
ఎ, బి, సి లలో ఏవైనా రెండు సమానంగా వస్తే మీకు ఆ రెండు రకాల ప్రజ్ఞాపాటవాలూ ఉన్నాయని అర్థం.

Posted on 10-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning