అమెరికాకు ఎగిరిపోదాం

* యూఎస్‌లో చదువుకు రెక్కలు కడుతున్న తెలుగు విద్యార్థులు
* ముందుకొస్తున్న సామాన్య కుటుంబాలు
* దోహదం చేస్తున్న వీసాల జారీ సరళీకరణ

దేశంలోని విద్యార్థులకు అమెరికాలో ఉద్యోగాల పట్లే కాదు చదువుల పట్ల కూడా ఆసక్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలుగు విద్యార్థులు అమెరికా చదువుపై మోజు పెంచుకుంటున్నారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో వచ్చే నెల నుంచి ప్రవేశాలు మొదలుకాబోతున్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో హడావుడి పెరిగింది. అమెరికా యూనివర్శిటీల్లో సౌకర్యవంతమైన వాతావరణం ఉండటం, నాణ్యతలో రాజీపడకపోవడం, అక్కడ చదివిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటంతో అక్కడ ప్రవేశాల కోసం విద్యార్థులు పరుగులుదీస్తున్నారు. సాధారణ రైతు నుంచి డ్రైవర్లు, కండక్టర్లు, చిరుద్యోగులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారు సైతం తమ పిల్లల్ని అమెరికా పంపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
యూఎస్‌ఏలో 4,000 విశ్వవిద్యాలయాలు, 6,000 వరకు కళాశాలలు ఉన్నాయి. ఇక్కడి..విద్యాలయాల్లో చదివేవారిలో 11-12% మంది విదేశీయులే ఉంటున్నారు. యేటా 73 దేశాల నుంచి 8 లక్షల మంది ఇక్కడ వాలుతున్నారు. జనాభాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చైనా, భారత్‌లు ఇక్కడ తొలి రెండు స్థానాల్ని ఆక్రమించాయి. 2013-14 విద్యా సంవత్సరంలో 1,13,000 మంది భారత విద్యార్థులు యూఎస్‌ఏ బాటపట్టారు. 2009-2010లో ఈ సంఖ్య 94,563 మాత్రమే. 2013-14 విద్యాసంవత్సరంలో అమెరికాలోని గ్రాడ్యుయేట్‌ స్కూళ్లకు దరఖాస్తు చేసుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య 32 శాతం పెరిగినట్లు వాషింగ్టన్‌ డీసీకి చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్స్‌ అధ్యయనంలో తేలింది. విశ్వవిద్యాలయం, అది ఉన్న ప్రాంతాన్ని బట్టి మొత్తం కోర్సు పూర్తయ్యేనాటికి ఒక్కో విద్యార్థికి కళాశాల రుసుములు, నివాస ఖర్చులు కలిపి రూ.15,50,000 నుంచి రూ.40,30,000 వరకు ఖర్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన విద్యార్థులు అమెరికాలోని విద్యను అభ్యసించేందుకు 20 బిలియన్ల మేర వ్యయం చేస్తున్నారు.
అమెరికన్‌ యూనివర్శిటీల్లో చదివే విదేశీ విద్యార్థుల్లో చైనీయులు 25%, భారతీయులు 15%, దక్షిణకొరియావారు 10%, సౌదీ అరేబియా విద్యార్థులు 5% ఉంటున్నారు. యూఎస్‌ఏలోని కార్నిమెలగాన్‌, సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల్లో తెలుగు విద్యార్థులదే పైచేయిగా ఉంది. గ్లోబల్‌ ట్రీ సీఈఓ శ్రీకర్‌ ఆలపాటి మాట్లాడుతూ..అమెరికా నుంచి వీసాలు పొందడం కాస్త సులువు కావడం, అక్కడి విశ్వవిద్యాలయాల వారే విద్యార్థులకు ప్రవేశాలిచ్చేందుకు ఇక్కడికే వస్తుండడం, బ్యాంకుల రుణాల మంజూరులో కనిపిస్తున్న పురోగతి వంటి అంశాలు అమెరికావైపు విద్యార్థుల దృష్టి మార్చేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అమెరికాలో భారతీయ నగరవాసుల వాటా హైదరాబాద్‌-26,220 (2 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు), ముంబాయి-17,294, చెన్నై-9,141, బెంగళూరు-8,835, దిల్లీ-8,728, పునే-5,551, కోల్‌కతా-3,881గా ఉంది. అమెరికా విదార్థుల్లో వివిధ దేశాల వాటా చైనా-2,00,000, భారత్‌-1,13,000, దక్షిణ కొరియా-1,10,000, సౌదీ అరేబియా-53,000, కెనడా-51,000గా ఉంది.
ఇంజినీరింగ్‌కే తొలి ప్రాధాన్యం: డాక్టర్‌ వెంకట్‌
భారత్‌ నుంచి అమెరికా వెళ్తున్న నగర విద్యార్థుల్లో హైదరాబాద్‌ తొలిస్థానం ఆక్రమించింది.. తర్వాతే ముంబాయి నిలుస్తోందని ఏషియన్‌ కంట్రీస్‌ అక్రిడిటేషన్‌ బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకట్‌ పేర్కొన్నారు. తెలుగు విద్యార్థులు రెండు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి వస్తున్నారని తెలిపారు. అమెరికాకు వెళ్లేవారిలో 36% మంది ఇంజినీరింగ్‌ విద్యకే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆ తర్వాత గణితం, కంప్యూటర్‌సైన్స్‌ (23%), బిజినెస్‌-మేనేజ్‌మెంట్‌ (14%) విద్యార్థులు ఉంటున్నారని వివరించారు. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న భారతీయుల్లో 56% మంది గ్రాడ్యుయేట్‌ విద్య, 13 శాతం మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్య అభ్యసిస్తున్నారు. 29 శాతం ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాముల్లో భాగస్వాములవుతున్నారు.

Posted on 12-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning