s

రాష్ట్ర్రంలో మ‌రో 15 వేల ఐటీ ఉద్యోగాల‌కు అవ‌కాశం!

 • రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను కాసింత గట్టెక్కిస్తూ, సేవా రంగ ఉద్యోగాలతో అభ్యర్థులకు అండగా నిలిచిన 'ఐటీ'... కొత్త ఉద్యోగాల సృష్టిలో గత అయిదేళ్ల ఒడుదొడుకుల నుంచి మెల్లగా బయట పడుతోంది. తాజాగా అమెరికా, ఐరోపా విపణుల నుంచి ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు పెరగడం, భవిష్యత్తు అంచనాలు కూడా మెరుగవడంతో ప్రాంగణ, అనుభవజ్ఞుల (లేటరల్స్‌) నియామకాల్లోనూ పురోగతి ఉంటుందని కంపెనీల ఉన్నతాధికారులు చెబుతున్నారు. చాలా కళాశాలల్లో ఇప్పటికే ప్రాంగణ నియామకాలు మొదలయ్యాయి. సకాలంలో ఉద్యోగాలు పొందలేకపోయిన వారు సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ ముందుకువెళ్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది పరిశ్రమ వృద్ధి బాగుండటంతో రాష్ట్ర ఐటీ పరిశ్రమలో కొత్తగా 15 వేల వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
  రెండు, మూడేళ్లుగా కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గినా... భవిష్యత్తులో నూతన ఉద్యోగాల సృష్టి ఆశాజనకంగా ఉంటుందని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. సగటున ఏటా 35 వేల ఉద్యోగాలను సృష్టిస్తూ వచ్చిన సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ, ఈ మధ్యకాలంలో ఆ మొత్తంలో మూడో వంతు ఉద్యోగాలు కల్పించలేకపోయింది. కంపెనీల ఖర్చుల తగ్గింపు, నూరు శాతం మానవ వనరుల వినియోగం, ప్రాజెక్టుల ఆర్డర్లలో మార్పులతో పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ఓవైపు ఎగుమతులు భారీగా పెరుగుతున్నా, ఆ స్థాయిలో ఉద్యోగాల సృష్టి జరగలేదు. ఇంజినీరింగ్‌, ఎంసీఏ, ఎంబీఏ ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు 'సాఫ్ట్‌వేర్‌' ఉపాధిలో ఇబ్బందులు తలెత్తాయి.
  ఐటీ బూమ్‌ ఉన్నపుడు కంపెనీలు భవిష్యత్తు ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు కల్పించాయి. ఇంజినీరింగ్‌ పాసైన అభ్యర్థుల్లో దాదాపు 60-70 శాతం మందికి ఉద్యోగాలు వచ్చేవి. గత ఆరేళ్లలో ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య భారీగా పెరగడంతో ఇంజినీరింగ్‌, ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ లాంటి కోర్సుల్లో ఏటా ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్య రెండున్నర లక్షలు ఉంటోంది. కానీ మరోవైపు ఉద్యోగాల సృష్టి తగ్గడం, అర్హతలున్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో, ఉద్యోగాల కోసం పోటీ అధికమైంది. ఏటా కోర్సు పూర్తి చేస్తున్న అభ్యర్థుల్లో కనీసం 5 శాతం మందికి కూడా ఉపాధి దొరకని స్థితి. ఐటీ కంపెనీలు కూడా తమ ఖర్చుల తగ్గింపులో భాగంగా కొత్త ఉద్యోగాల్ని సృష్టించలేదు. క్లయింట్ల నుంచి 'వేతనాల చెల్లింపులు' (నాన్‌ బిల్లింగ్‌) పరిధిలోకి రాని ఉద్యోగుల సంఖ్య దాదాపుగా తగ్గించాలని నిర్ణయించి, వారిని అందుబాటులోని ప్రాజెక్టుల్లో సర్దుబాటు చేశాయి. ఆర్థికమాంద్యం అనంతరం ప్రస్తుతం పని లేకున్నా, నిపుణులను కొనసాగించే విధానాన్ని అన్ని కంపెనీలు పరిహరించాయి.

  త్వరలో మళ్లీ ఊపు:

  రెండు, మూడేళ్లుగా కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గినా.. భవిష్యత్తులో నూతన ఉద్యోగాల సృష్టి ఆశాజనకంగా ఉంటుందని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే సీటీఎస్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ సంస్థలు ప్రాంగణ నియామకాలు ప్రారంభించాయి. కంపెనీలు తమ నిబంధనల మేరకు పదో తరగతి నుంచి ఇంజినీరింగ్‌, పీజీ వరకు అన్ని స్థాయిల్లోనూ కనీసం 60 నుంచి 70 శాతం మార్కులు పొందిన అభ్యర్థులను పరిగణన‌లోకి తీసుకుంటున్నాయి. కొన్ని కళాశాలల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నారు.

  ఆలస్యంగా లక్ష్యం పూర్తి:

  రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్చి 2013 నాటికి ఐటీ, ఐటీఈఎస్‌ పరిశ్రమలో 3,27,351 మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. గత అయిదేళ్లుగా కొత్త నియామకాల సంఖ్య చాలా తగ్గింది. 2002 నుంచి 2008 వరకు ఏటా సగటున 35 వేల ఉద్యోగాలను ఐటీ బూమ్‌ కల్పించింది. 2007-08లో అత్యధికంగా 51,550 మందిని ఐటీ కంపెనీలు నియమించుకున్నాయి. ఆ తర్వాత పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ఆర్థిక మాంద్యంతో కొత్త ఉద్యోగాల సృష్టి పడిపోయింది. ఉద్యోగుల వేతనాల వృద్ధి తగ్గింది. ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో 2009 నాటికి 3,28,442 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ సమయానికి 2,51,786 మందికి మాత్రమే ఉపాధి లభించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమకు నాలుగేళ్లకాలం పట్టింది. ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, లక్ష్యానికి చేరువలో ఉంది.

  - ఈనాడు, హైదరాబాద్‌‌
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning