మెరుగైన శాట్‌ స్కోరు ఎలా?

యూఎస్‌లో డిగ్రీ చేయాలనుకునే భారత విద్యార్థులు స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (SAT) పరీక్షకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. విదేశాల్లో ప్రవేశం పొందడానికి నిర్వహించే ఈ సాధారణ ప్రవేశ పరీక్ష ముఖ్యాంశాలను పరిశీలిద్దామా?
యు.ఎస్‌.లోని చాలా కళాశాలలూ, విశ్వవిద్యాలయాలూ అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశానికి పరిగణనలోకి తీసుకునే అంశాల్లో శాట్‌ స్కోరు ఒకటి. హైస్కూల్‌, జూనియర్‌ కళాశాల విద్యార్థులు అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశాన్ని సాధించడానికి ఈ పరీక్షను రాస్తారు. భారత్‌లో దీన్ని సంవత్సరానికి ఆరుసార్లు నిర్వహిస్తారు.... అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌, జనవరి, మే, జూన్‌లలో! యూఎస్‌లోని లాభాపేక్ష లేని, ప్రైవేటు సంస్థ అయిన కాలేజ్‌బోర్డు తరపున ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. విద్యార్థి కళాశాలలో చేరడానికి ఎంతవరకూ సంసిద్ధతతో ఉన్నాడో పరీక్షించడమే శాట్‌ ఉద్దేశం.
స్కోరు అంటే..
శాట్‌ నివేదికను చూస్తే మూడు స్కోర్లు కనిపిస్తాయి. రైటింగ్‌, క్రిటికల్‌ రీడింగ్‌, మ్యాథ్‌ మూడు విభాగాలకూ. ఒక్కొక్క స్కోరు 200- 800 పాయింట్ల మధ్య ఉంటుంది. మొత్తం స్కోరుగా ఈ మూడింటి మొత్తం 2400కు వచ్చిన స్కోరును లెక్కిస్తారు. ప్రతి సరైన సమాధానానికీ ఒక పాయింటు వస్తుంది. తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు. ఏదైనా ప్రశ్నను వదిలేస్తే సున్నా పాయింట్లు వస్తాయి. ఎస్సేను ఇద్దరు శాట్‌ గ్రేడర్లు దిద్ది, 1- 6 మధ్య స్కోరు కేటాయిస్తారు. అంటే 6 పాయింట్లు వస్తే అది ఉత్తమమైనదన్నమాట. ప్రతి విభాగం స్కోరు పక్కన పర్సంటైల్‌ను కూడా చూడొచ్చు. శాట్‌ రాసిన ఇతరులతో పోలిస్తే మీరు ఎంత మెరుగైన ప్రదర్శన ఇచ్చారో పర్సంటైల్‌ చూపిస్తుంది.
కళాశాలలు ఎంత ఆశిస్తాయి?
మీరు చేరాలనుకున్న కళాశాలలు కోరే అంశాలన్నింటినీ సరిచూసుకోండి. ఒకవేళ ఆ కళాశాల శాట్‌ స్కోరు అవసరమని పేర్కొంటే పరీక్ష రాయడం, స్కోరును సమర్పించడాల్లో నిర్దిష్ట మార్గదర్శక సూత్రాలను అనుసరించాలి. మంచి శాట్‌ స్కోరుతో పాటు నిలకడ అయిన, చక్కటి విద్యాప్రదర్శన ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక తోడ్పాటుకు ముఖ్య కారణమవుతుంది. ఇక్కడ సరాసరి స్కోరు అంటే- 50వ పర్సంటైల్‌. ఈ స్థాయి స్కోరును యూఎస్‌లోని చాలా కళాశాలలూ, విశ్వవిద్యాలయాలూ కనీసంగా ఆశిస్తాయి.
దరఖాస్తు విధానం
పరీక్షకు సుమారు 5 వారాల ముందు రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ ఉంటుంది. తుదిగడువులోగా సరిగా దరఖాస్తు చేసుకున్నారో లేదో చూసుకోవడం మంచిది. పరీక్ష రాయడానికి చెల్లించాల్సిన ఫీజు 105 యూఎస్‌ డాలర్లు. క్రెడిట్‌కార్డుతోనే చెల్లించాలి. http://sat.collegeboard.org/register ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తిచేసుకోవచ్చు. శాట్‌ స్కోరు 5 సంవత్సరాల వరకూ చెల్లుతుంది. కొత్తగా రూపొందుతున్న శాట్‌ 2016లో అమలులోకి వచ్చే వీలుంది.
సన్నద్ధమవడమెలా?
వాక్య పూరణం (సెంటెన్స్‌ కంప్లీషన్‌) ఒకాబులరీ, వాక్యంలోని తర్కాన్ని గ్రహించడం- రెంటినీ పరీక్షిస్తుంది. ప్రతి ప్రశ్నలోని వాక్యంలో ఒకటి/ రెండు ఖాళీలుంటాయి. ప్రతి ఖాళీని చదివి, ఏ జవాబు సరిపోతుందో గుర్తించాల్సి ఉంటుంది. క్రిటికల్‌ రీడింగ్‌లో చిన్న, పెద్ద రెండు రీడింగ్‌ పాసేజీలు ఉంటాయి. ప్రధాన విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తరువాత ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
రైటింగ్‌ విభాగంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు, వాక్యాలను సరిచేయడం (ఇంప్రూవింగ్‌ సెంటెన్సెస్‌), తప్పుగా ఉన్న వాక్యాలు (సెంటెన్స్‌ ఎరర్‌ క్వశ్చన్స్‌) ఉంటాయి. వీటన్నింటికీ సరళమైన, స్పష్టంగా సమాధానాలు చెప్పే విధానాల్ని ఆలోచించాలి. ఇచ్చిన సమాధానాల్లో ఏదైనా పదం ఇబ్బందికరంగా/ క్లిష్టంగా అనిపిస్తే అది తప్పు అయ్యే అవకాశాలెక్కువ. ఎస్సే రైటింగ్‌లో వ్యాస అంశాన్ని ఇచ్చి దానిపై మీ దృక్కోణాన్ని చెబుతూ సమర్థించమని అడుగుతారు. అభ్యర్థి మొత్తమ్మీద కలిగించిన అభిప్రాయం ఆధారంగానే ఎస్సేల్లో తుది మార్కులు కేటాయిస్తారు. మీ కోణాన్ని సమర్థంగా తెలపడానికి 5 పేరాల ప్రామాణిక వ్యాసం సరైన మార్గం.
బహుళైచ్ఛిక గణిత ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేటపుడు సమస్యలను సాధించడం ఎలాగో తెలుసుకోవాలి. ఎక్కడైనా ఆగిపోతే, చలరాశులకు బదులు సంఖ్యలను ప్రయత్నించాలి. ఇచ్చిన ఆప్షన్లలోంచి కూడా ప్రయత్నించవచ్చు. బహుళైచ్ఛిక ప్రశ్నలు కానివి కొన్ని ఉన్నాయి. వాటికి కూడా మీరు సన్నద్ధమై రావాల్సి ఉంటుంది. తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులుండవు కాబట్టి సందేహంగా ఉన్నా మెరుగైనదని తోచిన సమాధానాన్ని నిరభ్యంతరంగా ఊహించి గుర్తించవచ్చు.
అన్ని అంశాల్లో అనుభం, లోతైన పరిజ్ఞానమున్నవారి దగ్గర శిక్షణ పొందగలిగితే శాట్‌లో మంచి స్కోరు సాధించి లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ముఖ్యమైన వనరులు: https://sat.collegeboard.org/home
https://sat.collegeboard.org/practice/sat-practice-test

పరీక్ష స్వరూపం..
ఇది పేపర్‌ ఆధారిత పరీక్ష. దీనిలో విద్యార్థి లేఖన, గణిత, విమర్శనాత్మక పఠన నైపుణ్యాలను అంచనా వేస్తారు. వీటిని అండర్‌గ్రాడ్యుయేట్‌ కళాశాల కోర్సుల్లో ప్రవేశానికి ఉపయోగిస్తారు. విద్యార్థి ఆలోచన, తార్కిక నైపుణ్యాలను అంచనా వేసేలా శాట్‌ను రూపొందించారు. ఇవన్నీ స్కూలు స్థాయిలో నేర్చుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యాలు. వీటికి కళాశాల స్థాయిలో ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. మూడు కోర్‌ విభాగాలు- క్రిటికల్‌ రీడింగ్‌, మ్యాథ్స్‌, రైటింగ్‌లలో విద్యార్థి సామర్థ్యాన్ని అంచనావేయడమే దీని ఉద్దేశం.
పరీక్ష సమయం- మూడున్నర గంటలు. దీనిలో ఆరు 25 నిమిషాల వ్యవధి గల విభాగాలు (రెండు రైటింగ్‌, రెండు రీడింగ్‌, రెండు మ్యాథ్స్‌), రెండు 20 నిమిషాల వ్యవధి గల విభాగాలు (ఒక రీడింగ్‌, ఒక మ్యాథ్స్‌), ఒక పది నిమిషాల వ్యాకరణ ప్రశ్నలతో కూడిన రైటింగ్‌ విభాగాలుంటాయి.
క్రిటికల్‌ రీడింగ్‌ విభాగంలో 70 నిమిషాల్లో పూర్తిచేయాల్సిన రెండు రకాల ప్రశ్నలుంటాయి. వాక్యాలను పూరించడం (సెంటెన్స్‌ కంప్లీషన్‌)పై అడిగే ప్రశ్నలు ఒకాబులరీ, కాంప్లెక్స్‌ సెంటెన్సెస్‌ను అర్థం చేసుకోగల నైపుణ్యాలను పరీక్షిస్తాయి. రీడింగ్‌ పాసేజ్‌లపై అడిగే ప్రశ్నలు పఠన నైపుణ్యం, ప్యాసేజీలో అంతర్గతంగా దాగున్న అర్థం/ దానిలో చెప్పిన విషయాన్ని విద్యార్థి ఎంతవరకూ గ్రహించాడో పరీక్షిస్తాయి.
గణిత విభాగంలో లెక్కలను చేసి, ఇచ్చిన వాటిలోంచి సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కొన్నిటికి విద్యార్థే జవాబుల సాధించాల్సివుంటుంది. ఈ విభాగాన్ని పూర్తిచేయడానికి 70 నిమిషాల సమయం ఉంటుంది.
60 నిమిషాల రైటింగ్‌ విభాగంలో వాడుకలో, వాక్యనిర్మాణంలో తప్పులను సరిచేయడం- ప్రభావశీల వాక్యాలను గుర్తించడం చేయాలి. తరువాత ఇచ్చిన ఒక అంశంపై మీ అభిప్రాయాన్ని బలపరుస్తూ ఒక వ్యాసాన్ని రాయాల్సి ఉంటుంది.

Posted on 16-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning