2025 కల్లా 50 బి.డాలర్లకు

* హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ ఎదుగుతుంది
* నాస్‌కామ్‌ సదస్సులో బి.వి.ఆర్‌. మోహన్‌రెడ్డి

ఈనాడు - హైదరాబాద్‌ : ఐటీ పరిశ్రమ వృద్ధిలో, ముఖ్యంగా హైదరాబాద్‌ ఐటీ రంగం వేళ్లూనుకోవడంలో నాస్‌కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌) విశేష పాత్ర పోషించిందని, సైయెంట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, నాస్‌కామ్‌ ఉపాధ్యక్షుడు బి.వి.ఆర్‌. మోహన్‌రెడ్డి అన్నారు. నాస్‌కామ్‌ ఏర్పాటై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాతికేళ్లలో దేశంలో ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరించిందని, ఇప్పుడు 120 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ఐటీ రంగానికి అనుకూల విధానాలను ప్రభుత్వం రూపొందించటంలో నాస్‌కామ్‌ దూరదృష్టి ఎంతగానో దోహదపడిందని తెలిపారు. ప్రపంచానికి అనువైన రీతిలో సాఫ్ట్‌వేర్‌ సేవలను అందించగలిగే కంపెనీలు, నిపుణులు, వ్యవస్థలను తీర్చిదిద్దటానికి ఈ సంస్థ కృషి చేసిందని వివరించారు.
హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ 1992లో స్వల్ప స్థాయిలో ప్రారంభమై, అక్కడి నుంచి క్రియాశీలకంగా విస్తరించటమే కాకుండా ఈనాడు దేశీయంగా ఐటీ పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుందని మోహన్‌రెడ్డి ఉదహరించారు. '40,000 చదరపు అడుగుల ఎస్‌టీపీ స్థలంలో ఇక్కడ ఐటీ పరిశ్రమ మొదలైంది. ఇప్పుడు దాదాపు 1,000 ఎకరాల స్థలంలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఎన్నో బహుళజాతి ఐటీ కంపెనీలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రాష్ట్రం నుంచి 10 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను ఐటీ పరిశ్రమ నమోదు చేస్తోంది' అని వివరించారు. నాస్‌కామ్‌ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం హైదరాబాద్‌ నుంచి 2010 తర్వాత 200 కొత్త ఐటీ కంపెనీలు (స్టార్టప్స్‌) వచ్చాయని, బిగ్‌ డేటా, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌, సోషల్‌ మీడియా విభాగాల్లో ఇవి కార్యకలాపాలు సాగిస్తున్నాయని మోహన్‌రెడ్డి తెలిపారు. 2025 నాటికి హైదరాబాద్‌ నుంచి 50 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు నమోదు చేసే స్థాయికి ఐటీ పరిశ్రమ ఎదుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో నాస్‌కామ్‌ పాత్ర ఎంతగానో ఉంటుందని అన్నారు.
నాస్‌కామ్‌ అంచనా ప్రకారం వచ్చే 25 ఏళ్లలో పరిశోధనే ఐటీ పరిశ్రమ ప్రగతికి మూలాధారంగా ఉంటుందని మోహన్‌రెడ్డి అన్నారు. ఐటీ పరిశ్రమలోని అన్ని విభాగాల్లో ఎన్నో అవకాశాలు అందివస్తాయని, విశేషమైన అభివృద్ధి సాధించే వీలుందని వివరించారు. ఈ రంగంలోని కంపెనీలు పరస్పరం సహకరించుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అదే సమయంలో వ్యయాలు తగ్గించుకోవటానికి, సామర్థ్యాన్ని పెంచుకోవటానికి, పరిశోధనను విస్తృతం చేయటానికి ప్రయత్నించటం ద్వారా ఐటీ రంగం ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పారు. ఐటీ పరిశ్రమకు చెందిన పలువురు నిపుణులు, వెంచర్‌ కేపిటలిస్టులు, కన్సల్టెంట్లు పెద్ద సంఖ్యలో ఈ సదస్సుకు హాజరయ్యారు.
హైదరాబాద్‌ ఐటీ ప్రత్యేకతలు
* మనదేశం నుంచి నమోదయ్యే వార్షిక ఐటీ ఎగుమతుల్లో 10 బిలియన్‌ డాలర్లు పైబడిన ఎగుమతులతో 12-13 శాతం వాటా.
* 800కు పైగా ఐటీ కంపెనీలకు కేంద్ర స్థానం.
* 4.5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా మరో 10 లక్షల మందికి...
* గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ఆర్‌ అండ్‌ డి కేంద్రాలు
* 44 విశ్వవిద్యాలయాలు, ఏటా 1.5 లక్షల మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు.
* దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ నియామకాల్లో హైదరాబాద్‌ వాటా 20 శాతం.

Posted on 22-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning