ఐటీతోనే అధిక ఉద్యోగాలు

* వచ్చే ఐదేళ్లలో పరిశ్రమలో 12-14 శాతం వృద్ధి
* నారాయణ మూర్తి

బెంగళూరు: దేశీయ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ వృద్ధిపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌. నారాయణ మూర్తి ఆశావహ దృక్పథంతో ఉన్నారు. చైనా ఎలాగైతే 'ప్రపంచపు పరిశ్రమ'గా పేరొందిందో.. అదే విధంగా భారత్‌ కూడా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కేంద్రంగా పేరుతెచ్చుకుందని ఆయన అన్నారు. దేశంలో ఉద్యోగాలు సృష్టించే విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఐటీ పరిశ్రమ అధిగమించిందని వెల్లడించారు. ప్రస్తుతం ఐటీ రంగంలో 32 లక్షల నిపుణులు పని చేస్తుంటే, ఏటా 2 లక్షల మంది అదనంగా చేరుతున్నారని మూర్తి వివరించారు. మూర్తి ఇటీవలే ఇన్ఫోసిస్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బుధవారమిక్కడ జరిగిన కామన్‌వెల్త్‌ సైన్స్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ 'టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు అధిక వేతన ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. గత వందేళ్లలో ఏ ఇతర కంపెనీలూ ఆ స్థాయి నాణ్యత, వేతనం ఉన్న ఉద్యోగాలను ఇవ్వలేదు. ఆ తరహా ఉద్యోగాలు ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేశాయి. యువ (ఐటీ) ఉద్యోగులు వాహనాలు, గృహాలను కొనుగోలు చేయడంతో పాటు సూపర్‌ మార్కెట్లకు, రెస్టారెంట్లకు విరివిగా వెళ్లడంతో ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరింది. ఈ పరిశ్రమలోని ప్రతీ ప్రత్యక్ష ఉద్యోగం ద్వారా పరోక్షంగా మూడు ఉద్యోగాల సృష్టి జరిగింది. ప్రపంచంలో మీరెక్కడికి వెళ్లినా భారత్‌కు గౌరవం లభిస్తోందంటే అది సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ వల్లే. వచ్చే అయిదేళ్లలో ఐటీ పరిశ్రమ 12-14% వృద్ధి చెందే అవకాశాలున్నాయ'న్నారు. ఇదే కార్యక్రమంలో బయోకాన్‌ అధిపతి కిరణ్‌ మజుందార్‌ షా మాట్లాడుతూ 'కంపెనీల ఆర్థిక అజెండాలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలు ఒక భాగంగా ఉండాలి. వాటి ఆర్థిక సుసంపన్నతకు, భవిష్యత్‌కు ఆ రంగాల్లో పెట్టుబడులే కారణమని ఆయా కంపెనీలు గుర్తెరగాలి. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు నియంత్రణ సంస్థల అనుమతులు అంత తేలిగ్గా లభించడం లేదు. ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంద'ని అన్నారు.

Posted on 27-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning