గూగుల్‌ కల తీరిందిలా!

కాలేజీలో ఉండగానే కార్పొరేట్‌ ఉద్యోగం సాధించాలని కలగన్న ఈ అమ్మాయి అనుకున్నది సాధించింది. అదీ ఆషామాషీగా అనేకమందిలో ఒకరిగా కాదు. గూగుల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపస్‌ నియామకాల్లో లక్షల మందితో పోటీపడి... ఏడాదికి రూ. 75 లక్షల వేతనానికి ఎంపికైంది. బాంబే ఐఐటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న తోటకూర శ్రీమేఘన ఆ వివరాలను ఇలా చెబుతోంది...
చిన్నప్పట్నుంచీ నాకు తెలిసిన ప్రపంచం చదువే. స్కూల్లో, కాలేజీలో నన్నంతా పుస్తకాల పురుగు అనేవారు. మాటలదేముంది... మార్కులూ ర్యాంకులూ ముఖ్యం అనుకునేదాన్ని. పదో తరగతిలో ఆరొందలకు 575 మార్కులొచ్చాయి. ఇంటర్‌లో 90 శాతం మార్కులు సాధించాను. మన ఎంసెట్‌, బాంబే ఐఐటీ ఎంట్రన్స్‌లో కూడా వందలోపు ర్యాంకొచ్చింది. ఇలా చెబుతున్నానని... చదువు తప్ప మరే ప్రపంచం తెలియని అమ్మాయిని కాదండోయ్‌! ఇంజినీరింగ్‌కు సంబంధించినవే కాదు... వివిధ అంశాలకు సంబంధించిన చాలా పుస్తకాలు చదువుతుంటాను.
* చదువు పూర్తయ్యాక సివిల్స్‌ రాసి, కలెక్టర్‌ అవ్వాలని నా కోరిక. అయితే ఓ సందర్భంలో 'ఐఐటీలో చదివితే ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది' అన్న అమ్మానాన్నల మాటలు గుర్తుండిపోయాయి. కాలేజీలో ఉండగానే ప్రముఖ సంస్థలో ఉద్యోగం రావడం... వినడానికే చాలా బాగుందనిపించింది. నెమ్మదిగా సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు మనసు మళ్లింది. ఆ కల ఇలా నెరవేరింది.
* గూగుల్‌ నిర్వహించిన క్యాంపస్‌ నియామకాల్లో నెగ్గుకురావడం అంటే మాటలు కాదు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది దరఖాస్తు చేశారు. మనదేశం నుంచి సుమారు రెండువేల మంది పరీక్ష రాశారు. జాతీయ స్థాయిలో నాకు 23వ ర్యాంకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 89వ ర్యాంకు. మా కళాశాలలో బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులకు కలిపి ఈ ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. వీరందరిలో చూసినప్పుడు మూడో ర్యాంకులో ఉన్నా. పరీక్ష రాసిన గంట వ్యవధిలోనే ఫలితాలు వెల్లడించారు. అమెరికాలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో పని చేసేందుకు నేను ఎంపిక కావడం చాలా ఆనందాన్నిచ్చింది.
* ఇది నాకు రెండో ఉద్యోగం. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌లోనే పనిచేసే అవకాశమూ లభించింది. అయితే జీతం తక్కువ. ఏడాదికి రూ.18 లక్షల ప్యాకేజీ ఇస్తామన్నారు. వద్దనుకున్నాను. ఫేస్‌బుక్‌ ఎంపిక ప్రక్రియలోనూ పాల్గొన్నాను. అందులో పరీక్షలో నెగ్గా. ఇంటర్వ్యూలో పోయింది. సర్లే... మరో గొప్ప అవకాశం రాకపోతుందా అనుకున్నా. గూగుల్‌ ప్రకటన రాగానే శ్రద్ధతో సిద్ధమయ్యా.
* మాది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావ్‌పేట. మా కుటుంబమంటే అమ్మ, నాన్న, నేను, చెల్లి. ఇద్దరం ఆడపిల్లలమే. కానీ ఏ విషయంలోనూ మాకు వారు పరిధులు విధించలేదు. తమ ఇష్టాలను మా మీద రుద్దలేదు. అన్ని రకాలుగా స్వేచ్ఛనిచ్చారు. నా అభిప్రాయాలకు పూర్తి విలువిచ్చారు. ప్రస్తుతం తలా ఒకచోట ఉంటున్నాం. అమ్మ వాణి, రామగుండం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. నాన్న శ్రీనివాస్‌ ఎన్టీపీసీలో అసిస్టెంట్‌ ఇంజినీరు. ఈ మధ్యే చెన్నైకి బదిలీ అయ్యారు. నేను బాంబే ఐఐటీలో ఇంజినీరింగ్‌ (కంప్యూటర్స్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. చెల్లి అనన్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని గూడవల్లిలో (నేను చదివిన పాఠశాలలోనే) పదో తరగతి చదువుతోంది. నెలకొకసారి మేమందరం కలుస్తాం. చదువూ, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటాం. అప్పుడే అమ్మ రకరకాల పిండివంటలు చేసి పెడుతుంది.
* నా పాఠశాల విద్యాభ్యాసం అంతా రామగుండంలోని సెయింట్‌ క్లెయిర్‌ పాఠశాలలో జరిగింది. అక్కడ ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్నా. 9, 10 తరగతులు గూడవల్లిలోని కేకేర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదివా. పదో తరగతిలో స్కూల్‌ టాపర్‌ని. ఇంటర్‌మీడియట్‌ విజయవాడలోని శ్రీచైతన్యలో పూర్తిచేశాను. నేను ఇంగ్లిషు నవలలు బాగా చదువుతాను. ప్రముఖ రచయితలు రాసిన కొన్ని వందల పుస్తకాలు నావద్ద ఉన్నాయి. ఐఐటీలో చదువు... అందరూ కోరుకునే గూగుల్‌లో ఉద్యోగం... ఇప్పటికి నేను హ్యాపీ. సివిల్స్‌ రాయాలా వద్దా అనే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. చివరగా కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు నిత్యం శ్రమించండి అని మాత్రం చెప్పగలను.!
* ఇంటర్నెట్‌, ఫేస్‌బుక్‌, సెల్‌ఫోన్‌లను వాడతాను. కానీ నా చదువునీ, భవిష్యత్తు లక్ష్యాలనూ దూరం చేసేంత స్థాయిలో కాదు. ఎంత అవసరమో.. అంతవరకే ఉపయోగించుకుంటాను.

Posted on 03-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning