వృత్తి విద్యలో విప్లవాత్మక మార్పులు

* పారిశ్రామిక నిపుణుల ద్వారా విద్యార్థులకు శిక్షణ
* చదువు ముగిసిన వెంటనే కొలువు
* తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన సంస్థ ఏర్పాటు
* ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

ఈనాడు, హైదరాబాద్: చదువు ముగిసిన వెంటనే కొలువులు లభించేలా తెలంగాణలోని వృత్తి విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కళాశాలలను పరిశ్రమలకు అనుసంధానం చేస్తామని, ఇందుకోసం ఐఐఐ (ఇండస్టీస్ర్, ఇన్‌స్టిట్యూట్స్, ఇంట్రాక్షన్) కార్యక్రమం చేపడతామన్నారు. అత్యుత్తమ పాఠ్య ప్రణాళికను రూపొందిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు తరగతి గదుల్లోనే పారిశ్రామిక నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్, ప్రాక్టికల్ స్కూలు చట్టాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నైపుణ్య, విజ్ఞాన వృద్ధి సంస్థ (అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టాస్క్)ను నెలకొల్పుతామని; వృత్తి విద్యావిధానంలో మార్పులు, పరిశ్రమలతో అనుసంధానం అంశంపై డిసెంబరు 4న సచివాలయంలో మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి విద్యాశాఖమంత్రి జగదీష్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఐటీ, విద్యాశాఖల కార్యదర్శులు హర్‌ప్రీత్‌సింగ్, వికాస్‌రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, ఫిక్కి, సీఐఐ, నాస్‌కామ్ తదితర పారిశ్రామిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఇంజినీరింగు, ఇతర వృత్తి విద్యా కళాశాలలు, వాటిలో విద్యార్థుల సంఖ్య పెరిగినా ఆశించిన స్థాయిలో వారికి ఉద్యోగాలు లభించడం లేదని, చాలా మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని తెలిపారు. చదువు ముగిసిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా విద్యావిధానాన్ని సమూలంగా మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఈ మేరకు తాము కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకే కాకుండా ప్రపంచస్థాయి సంస్థలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు. పాఠ్యప్రణాళికలో మార్పులతో పాటు బోధకులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు. పారిశ్రామిక నిపుణుల ద్వారా విద్యార్థులకు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ, అనుభవం అవసరమని, ఇందుకు పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కేంద్రం దీనిపై చట్టం చేసినా విద్యాసంస్థలు పాటించడం లేదని, రాష్ట్రంలో ప్రత్యేకంగా అప్రెంటిస్‌షిప్, ప్రాక్టికల్ స్కూలు చట్టాన్ని తెస్తామని చెప్పారు. పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి శిక్షణ సంస్థలను పటిష్ఠం చేస్తామని తెలిపారు. పరిశ్రమలున్న చోట కొత్త ఐటీఐ, పాలిటెక్నిక్‌లను నెలకొల్పుతామన్నారు. వృత్తి విద్యావిధానంలో మార్పులపై అన్ని వర్గాల నుంచి సలహాలను స్వీకరిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సమావేశంలో పాల్గొన్న పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని తెలిపారు.

Posted on 05-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning