కళాశాలల్లో ఐటీ కంపెనీల సందడి

* సానుకూలంగా మారిన పరిస్థితులు
* పెరుగుతున్న ప్రాంగణ నియామకాలు
* కొత్త సాంకేతిక పరిజ్ఞానాల వూతం

ఈనాడు, హైదరాబాద్‌: ఇం జినీరింగ్‌ విద్యార్థులకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. దేశీయంగానే కాక అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల కారణంగా సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం (ఐటీ) కంపెనీలు కళాశాల ప్రాంగణాలకు వెళ్లి చాలా చురుగ్గా నియామకాలు చేస్తున్నాయి. జులైలో ప్రారంభమైన ప్రాంగణ నియామకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ప్రాంగణ నియామకాలు ఆశాజనకంగా ఉన్నాయని కంపెనీలు, ఇంజినీరింగ్‌ కాలేజీల వర్గాలు చెబుతున్నాయి. భారత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ప్రధాన మార్కెట్‌ అయిన అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడడం, సామాజిక మీడియా, మొబైల్‌, ఎనలిటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీలు తెరపైకి రావడం వంటి సానుకూల పరిణామాలు నియామకాలను పెంచుతున్నాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా అన్ని రంగాల్లో ఐటీ వాడకం పెరగడం కూడా నియామకాలు పెరగడానికి కారణమేనని హైదరాబాద్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లోని స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ ఎ.గోవర్ధన్‌ తెలిపారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, రోబోటిక్స్‌ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన, పట్టు ఉన్న విద్యార్థులకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బహుళ జాతి ఐటీ కంపెనీలు తమ భవిష్యత్‌ ప్రణాళికలు, వ్యూహాలు, ఉత్పత్తులకు అవసరమైన మంచి నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఆకర్షణీయ వేతనాలు చెల్లించి నియమించుకుంటున్నాయని ప్రముఖ ఐటీ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చివరి సంవత్సరం చదువుతున్న శ్రీమేఘనను ఏడాదికి రూ.75 లక్షల వేతనంతో గూగుల్‌ కంపెనీ నియమించుకోవడమే ఇందుకు తాజా ఉదాహరణ అని అన్నారు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్స్‌యాప్‌ వంటి కొత్త తరం బహుళ జాతి కంపెనీలు వేతనాల చెల్లింపులో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఐటీ కంపెనీల ప్రాంగణ నియామకాలు గణనీయంగా పెరిగినప్పటికీ.. స్థానిక కాలేజీల్లో విద్యార్థులకు కంపెనీలు ఇవ్వచూపుతున్న వేతనాల్లో పెద్ద మార్పు లేదని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15)లో ఐటీ కంపెనీలు 1,70,000-1,80,000 మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించగలవని నాస్‌కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌) అంచనా వేస్తోంది. ఇందులో అధిక శాతం కొత్త వారినే కంపెనీలు తీసుకుంటున్నాయి. దేశంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం (2015-16) ఈ సారి 35,000 మంది విద్యార్థులకు ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. క్రితం ఏడాదితో పోలిస్తే ప్రాంగణ నియామకాలను 40 శాతం పెంచింది. ఇప్పటికే అనేక కాలేజీల్లో నియామకాలు చేపట్టింది. ఇన్ఫోసిస్‌ నియామకాలు కూడా గత ఏడాది కంటే ఈ సారి ఎక్కువగానే ఉంటాయని వర్గాలు చెబుతున్నాయి. విప్రో, కాగ్నిజెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వంటి ప్రధాన కంపెనీలు కూడా నియామకాలపై ఆశావహంగానే ఉన్నట్లు పేర్కొన్నాయి.
10% పెరగొచ్చు: కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ఏడాది 20,000 మంది వరకూ విద్యార్థులను ప్రాంగణాలకు వచ్చి నియమిస్తున్నాయని.. ఈ సారి ఈ నియామకాలు 10 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు గోవర్థన్‌ తెలిపారు. దాదాపు 60 కంపెనీలు ప్రాంగణ నియామకాలకు వస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో టీసీఎస్‌ ఈ ఏడాది ఇప్పటి వరకూ 2,000 మందిని ఎంపిక చేసినట్లు వర్గాలు తెలిపాయి. వీరిని వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీలో చేర్చుకుంటారు. ఇన్ఫోసిస్‌ దాదాపు 1,000 మందిని.. కాగ్నిజెంట్‌ 1,000 మంది, విప్రో 700 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు 20 ఇంజినీరింగ్‌, మేనేజిమెంట్‌, సైన్స్‌, ఆర్ట్స్‌ కాలేజీలను సందర్శించి ప్రాంగణంలోనే విద్యార్థులను ఎంపిక చేసి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కాగ్నిజెంట్‌ ప్రతినిధి హర్ష కాబ్రా తెలిపారు. గత అయిదేళ్లలో దాదాపు 8,000 మంది విద్యార్థులను ప్రాంగణ నియామకాల ద్వారా తీసుకున్నట్లు చెప్పారు. గత ఏడాది హైదరాబాద్‌ జేఎన్‌టీయూలోని స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి 30 కంపెనీలు వచ్చి 125 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయని గోవర్థన్‌ తెలిపారు. టీసీఎస్‌ 31, ఐబీఎం 11, ఇన్ఫోసిస్‌ 19 మందిని తీసుకున్నాయి. ఈ ఏడాది (2014) 44 మంది విద్యార్థులను టీసీఎస్‌ ఎంపిక చేసుకుందన్నారు. ఇప్పటి వరకూ 105 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ టీసీఎస్‌ తమ ప్రాంగణం నుంచి 170 మంది విద్యార్థులను (2015 బ్యాచ్‌) ఎంపిక చేసుకుందని సీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నియామకాల అధిపతి విజయ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 700 ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి ఏటా దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్‌ పట్టాలు పుచ్చుకుంటున్నారు.

Posted on 07-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning