స‌న్నద్ధత‌కు తోడుగా సాంకేతిక‌త‌!

* న‌డ‌క‌లోనే పాఠాలు వినేస్తున్న న‌వ‌త‌రం
 • బ్లూటూత్‌ పెన్‌ సాయంతో పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడిన కుర్రకారు ఒకవైపు.. అదే ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పరీక్షలకు సిద్ధమవుతున్న యువతరం మరోవైపు. తినే సమయంలోనూ ఇయర్‌ ఫోన్స్‌ వదలరా అని కోపగించుకునే ముందు... అందులో ఏం వింటున్నారనేది తెలుసుకుంటే ఇంకోసారి అలా గద్దించరేమో! అవును.. గాడ్జెట్‌ యుగంలో పాఠాలను చదివే పంథా మారింది. నగర జీవనంలో సమయ నిర్వహణ పెద్ద సవాల్‌. అందులోనూ విద్యార్థులు, ఉద్యోగార్థులు ట్రాఫిక్‌లోనే నాలుగు గంటలు గడుపుతున్నారు. శివార్లలో ఉండే కళాశాలలు కానివ్వండి.. ప్రధాన నగరంలోని కార్యాలయాలకు శివార్ల నుంచి ఉద్యోగులు రావడం కావొచ్చు.. గంటల తరబడి బస్టాపుల్లో, బస్సులోనే కాలం గడిచిపోతోంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు సమయం దొరకడం లేదు. ఉద్యోగం చేస్తూ దొరికిన కొద్ది సమయంలోనూ ఉన్నతోద్యోగం కోసం ప్రయత్నించడం అసాధ్యంగా మారింది. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన చోట.. నిమిషాలు కూడా కేంద్రీకరించలేని ఉరుకులు పరుగుల జీవనశైలిలో ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకుంటే అందలం ఎక్కే అవకాశం కనబడుతోంది.
  చాలామంది అభ్యర్థులు ఉదయపు నడకకు వెళ్లిన‌ప్పుడు చొక్కా జేబులో మొబైల్‌ ఫోన్‌ వేసుకుని ఇయర్‌ఫోన్స్‌ తగిలించుకుని పాఠాల‌ను ఏకాగ్రతతో వింటున్నారు. దీనివ‌ల్ల నడక అలసటే తెలియడం లేదు. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న మ‌రికొంతమందికి శిక్షణ తీసుకునేందుకు సమయం సంగతి అటుంచి.. కనీసం పాఠ్యాంశాలను ఇంటివద్ద చదువుకునేందుకూ కుదరడం లేదు. అందుకే ఉదయపూట నడకలోనే పాఠాలు మొబైల్‌ ద్వారా వినేస్తూ సన్నద్ధం అవుతున్నారు. కొంతమంది కుర్రకారు బస్సు కోసం వేచి చూసే స‌మ‌యంలోనూ చెవులకు తగిలించుకున్న ఇయర్‌ఫోన్‌లో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ పాఠ్యాంశాల‌ను వింటూ ఉన్నారు. వారి మోములో మునుప‌టిలా ఆందోళన ఉండ‌టం లేదు. బస్సులో గమ్యస్థానం చేరేవరకు వీరి దినచర్య ఇదే.

  గాడ్జెట్‌ బాటలో..

  కళాశాలల్లో చెప్పే పాఠాలను ఇప్పటికే విద్యార్థులు మొబైల్‌లో రికార్డు చేసి వింటున్నారు. తరగతులకు గైర్హాజరైన సమయంలో పాఠాలు వినలేకపోయాం అనే దిగులే లేకుండా పోయింది. గ్రూప్స్‌, సివిల్స్‌కు సన్నద్ధం అయ్యేవారికి ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే, ఆడియో పాఠాలు మార్కెట్లోకి వచ్చాయి. పోటీ పరీక్షలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ట్యాబ్లెట్‌లలో లోడ్‌ చేసి ఇస్తున్న సంస్థలు ఉన్నాయి. గాడ్జెట్‌ చేతిలో ఉంటే సరి ఎప్పుడైనా, ఎక్కడైనా వినొచ్చు. పాఠశాల, కళాశాలల్లో పిల్లలు వీటివైపు ఆకర్షితులు అవుతున్నారు. నిర్దిష్ట సమాచారం కావాల్సిన వారికి సైతం అంతర్జాలంలో వేర్వేరు వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి మొబైల్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు వింటున్నారు. ఒకరిని చూసి మరొకరు క్రమంగా 'టెక్‌' బాటలోకి వచ్చేస్తున్నారు. బ్లూటూత్‌ సాయంతో ఒకరి మొబైల్‌ నుంచి మరొకరి మొబైల్‌లోకి బదిలీ చేసుకునే అవకాశంతో.. క్షణం ఆలోచించకుండా మీట నొక్కేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారితో పోలిస్తే.. చిన్నతనం నుంచి టెక్‌ లోకంగా పెరిగిన వర్గాల్లో ఆడియో పాఠాలకు ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ పోకడలను నిశితంగా గమనిస్తున్న సంస్థలు నిపుణుల పాఠాల్ని ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచుతున్నాయి. కొత్త పుస్తకాల విడుదలే కాదు వాటిని ఆడియో రూపంలోనూ విడుదల చేస్తుండటం విశేషం. 'హిమాయత్‌నగర్‌లో ఒక ఆన్‌లైన్‌ సంస్థ 400 గంటల సివిల్స్‌ పాఠాల్ని ఆడియో రూపంలో అందిస్తోంది. 'తరగతి గదిలో ప్రత్యక్షంగా వింటేనే పట్టు దొరకడం కష్టం. అలాంటిది మొబైల్‌లో వింటే అంతగా చెవికెక్కుతుందని అనుకోను. 30 రోజుల్లో అన్ని గంటల పాఠాలు వినాలంటే అసాధ్యమే. అయితే ఇటీవల సమయాభావంతో వీటివైపు మొగ్గు చూపుతున్నారు' అని నగరంలోని కోచింగ్‌ కేంద్రంలో శిక్షణ ముగించుకున్న సివిల్స్‌ అభ్యర్థి ఒకరు 'ఈనాడు'తో అన్నారు.

  సమాచారం ఎంపికలో జాగ్రత్త...

  - శ్రీనివాసులు, రాజనీతిశాస్త్రం ఆచార్యులు, ఓయూ

  చదివే వీలు లేనప్పుడు వినడం ద్వారా పాఠాల సారాన్ని గ్రహించడం మంచిదే. కానీ వారు తీసుకుంటున్న సమాచారం నాణ్యమైనదా కాదా అనేది ప్రధానం. ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాల‌యితే సిలబస్‌ను రూపొందించేందుకు కమిటీ ఉంటుంది. సంబంధిత వ‌ర్సిటీ ఆచార్యులే కాకుండా ఇతర విశ్వవిద్యాలయాల ఆచార్యులూ కమిటీలో సభ్యులుగా ఉండి పాఠ్యాంశాల నాణ్యత‌ను ప‌రిశీలిస్తారు. అంతర్జాలంలో దొరికే సమాచారం ఎంత వరకు ఉపయుక్తం అనేది పరిశీలించుకోవాలి. దోషరహితంగా నాణ్యమైన సమాచారం ఆడియో రూపంలో దొరికితే మేలే.

  - ఈనాడు, హైద‌రాబాద్‌.
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning