'ఐటీ'లో మేటికి కొత్త విధానం

* డిసెంబరు మూడోవారంలో విడుదల చేయనున్న తెలంగాణ సర్కారు
* భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం
* ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరణ
* భారీ ఎత్తున ప్రోత్సాహకాలు

ఈనాడు - హైదరాబాద్‌: ఇటీవలే కొత్త పారిశ్రామికవిధానాన్ని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. దానికి అనుబంధంగా ఐటీ విధానాన్ని సత్వరమే అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఐటీ పరిశ్రమ వర్గాలు, దేశ,విదేశాల ప్రతినిధుల నుంచి ప్రభుత్వం సలహాలు, సూచనలు తీసుకుంది. దీనికి అనుగుణంగా కొత్త విధానాన్ని సిద్ధం చేస్తోంది. ఇరవై లక్షల మందికి ఉపాధి.. రూ.1.20 లక్షల కోట్ల ఎగుమతులు.. భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం.. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణ.. ఇలా పలు ఆకర్షణీయ అంశాలతో తెలంగాణలో కొత్త సమాచార విజ్ఞాన (ఐటీ) విధానం జనవరి నుంచి అమల్లోకి రానుంది. డిసెంబరు మూడో వారంలో సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి దీనికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ముసాయిదా విధానాన్ని పారిశ్రమ వర్గాలకు వెల్లడించి.. వారి నుంచి మరిన్ని సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఒడుదొడుకుల్లో ఉన్న ఐటీ రంగాన్ని భారీఎత్తున అభివృద్ధి చేసేందుకు వీలున్న ప్రణాళికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపాధికి అనువుగా విద్యార్థులకు శిక్షణతో పాటు ఐటీ పరిశ్రమలను కళాశాలలకు అనుసంధానం చేయడం ప్రధానాంశం. దీని ద్వారా విద్యార్థులు చదువు ముగిసిన వెంటనే ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే చదువులు పూర్తి చేసిన వారిని సైతం తీర్చిదిద్దేలా నైపుణ్య శిక్షణ ఇస్తారు.
ఈ-పాలనపై దక్షిణాఫ్రికాకు 'తెలంగాణ' పాఠాలు
తెలంగాణ తరహాలో తమ రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రానిక్‌ పాలన (ఈ-గవర్నెన్స్‌) అమలు చేయాలని దక్షిణాఫ్రికా నిర్ణయించింది. దాని అమలు కోసం సూచనలు చేయాల్సిందిగా తెలంగాణ ఐటీ శాఖ అధికారులను అక్కడికి ఆహ్వానించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్‌, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ ఎండీ సత్యనారాయణరెడ్డిలను ఆదివారం దక్షిణాఫ్రికా బయల్దేరి వెళ్లారు. నార్తర్న్‌ కేప్‌ ప్రావిన్స్‌, ఫ్రీస్టేట్‌ ప్రావిన్స్‌లలో ఈ-పాలన అమలు కోసం దక్షిణాఫ్రికా ఐటీ ఏజెన్సీ (సిటా) అధికారులతో తెలంగాణ అధికారులు సమావేశమవుతారు. ఆయా రాష్ట్ర అధికారులతోనూ భేటీ అవుతారు. డిసెంబరు 13 వరకు వారు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తారు.
కొత్త విధానంలోని ప్రధానాంశాలు..
వృద్ధి లక్ష్యం: 16 శాతం
ఉపాధి లక్ష్యం: ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షమందికి.
ఎగుమతుల లక్ష్యం: దాదాపు రూ. 1.20 లక్షల కోట్లు
* పరిశ్రమలకు సత్వర అనుమతులు, సీఎం కార్యాలయంలో ఛేదన విభాగం, పారిశ్రామికవేత్తలకు మునుపెన్నడూ లేని రీతిలో ప్రోత్సాహకాలు
* కొత్తతరానికి సహకారం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
* విద్యార్థుల పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పారిశ్రామిక అవగాహన.
* ప్రస్తుతం హైదరాబాద్‌ ఐటీకి విశ్వకేంద్రంగా ఉంది. దీనిని వైఫై నగరంగా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతారు. పరిశోధన, శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తారు.
* ఫేస్‌బుక్‌, గూగుల్‌, వాట్సప్‌ లాంటి కంపెనీలు ఇక్కడే పరిశ్రమలను చేపట్టేలా చర్యలు.
* సోల్‌ మీడియా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటివాటికి ప్రాధాన్యం.
* ఉద్యోగుల సౌకర్యార్థం మౌలిక వసతులు, భద్రత కల్పిస్తారు.
* అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ద్వితీయశ్రేణి నగరాల్లో, పట్టణాలలో భారీఎత్తున పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తారు.

Posted on 08-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning