ట్రిపుల్‌ఐటీలోనూ 'కోటీ'శ్వరులు!

* ప్రాంగణ నియామకాల్లో ప్రారంభమే అదుర్స్‌
* రూ.1.40 కోట్ల వార్షిక వేతనం
* 100 శాతం ప్రాంగణ నియామకాల దిశగా సంస్థ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంగణ నియామకాల్లో గత మూడేళ్లుగా తొలిస్థానంలో ఉంటున్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) ఈసారీ సత్తాను చాటుతోంది. ఐఐటీలతో పోటీగా ఈ సంస్థ విద్యార్థులు భారీ వార్షిక వేతన ప్యాకేజీతో ప్రముఖ సంస్థలకు ఎంపికవుతున్నారు. బహుళ జాతి సంస్థలే కాక వర్ధమాన (స్టార్టప్‌) కంపెనీలూ ఇక్కడి విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రారంభమైన ప్రాంగణ నియామకాల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) విద్యార్థులు రూ.75 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు వార్షిక వేతనాలతో వివిధ సంస్థలకు ఎంపికవుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. వీరికి దీటుగా హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు సైతం ఇప్పటివరకు 10 మంది రూ.1.40 కోట్ల వంతున వేతనానికి ఫేస్‌బుక్‌, గూగుల్‌ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ రెండు సంస్థల కేంద్ర కార్యాలయాలు అమెరికాలోని కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. వీరు అక్కడే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. గూగుల్‌ ఆరుగురిని, ఫేస్‌బుక్‌ నలుగురిని ఎంపిక చేసుకుంది. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులైన వీరిలో తొమ్మిది మంది మూడు నెలల ఇంటర్న్‌షిప్‌ ద్వారా ఈ సంస్థలకు ఎంపియ్యారు. వీరికి ఏడాదికి మూల వేతనంగా లక్ష అమెరికా డాలర్లు, షేర్ల రూపేణా లక్షన్నర యూఎస్‌ డాలర్లు చెల్లిస్తారు. వాటిని రూపాయిల్లోకి మార్చుకుంటే సుమారు రూ.1.40 కోట్లు అవుతాయని ప్లేస్‌మెంట్‌ విభాగాధిపతి టీవీ దేవీ ప్రసాద్‌ చెప్పారు.
నూటికి నూరు శాతం ఉద్యోగాలు... సగటు వేతనం పెరిగింది...: ట్రిపుల్‌ఐటీలో బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్‌(5 సం.లు), ఎంఎస్‌ఐటీ కోర్సుల్లో మొత్తం సుమారు 410 సీట్లు ఉన్నాయి. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎంఎస్‌ఐటీ)లో 60 మంది విద్యార్థులు ఉండగా వీరంతా ఏదో ఒక కంపెనీకి ఎంపికయ్యారు. ఇతర కోర్సులకు డిసెంబర్ 1 నుంచి ప్రాంగణ నియామకాలు ప్రారంభం కాగా 8వ తేదీ వరకు 110 మంది ఎంపికయ్యారు. ఈ విద్యాసంస్థ ప్రాంగణ నియామకాల్లో 2011 నుంచి 'డాటా క్వెస్ట్‌' మేగజీన్‌ సర్వే ప్రకారం మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఇది 2007లో 5వ స్థానంలో ఉండగా ఆ తర్వాత 2010 వరకు మూడేళ్లపాటు మూడో స్థానంలో నిలిచింది. ఈ సారీ 100 శాతం ప్రాంగణ నియామకాలు జరుగుతాయని దేవీప్రసాద్‌ చెప్పారు. ఇక్కడ ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు 120 కంపెనీలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. ఇక్కడ 2009లో సగటు వార్షిక వేతనం రూ.6.1 లక్షలుండగా 2010లో రూ.9 లక్షలకు చేరుకుంది. గత ఏడాది రూ.10 లక్షల వరకు ఉండగా ఈసారి అది రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షలకు చేరుకుంటుందని విశ్వవిద్యాలయం అధికారులు అంచనా వేస్తున్నారు.
* కొత్త సంస్థలూ ఆసక్తి..: బహుళజాతి సంస్థలు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులను అధిక వేతనాలకు ఎంపిక చేసుకుంటుండగా కొత్తగా ప్రారంభమైన సంస్థలు సైతం మంచి వేతనాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కోడినేషన్‌, ఆసాన్‌ జాబ్స్‌, బై హక్కే వంటి సుమారు 10 సంస్థలు ఇలా తమ పేర్లు నమోదు చేసుకున్నాయి. కోడినేషన్‌ సంస్థ ఐఐటీ ముంబయి నుంచి ఒకరిని ఎంపిక చేసుకోగా, ట్రిపుల్‌ఐటీ నుంచి రూ.26 లక్షల ప్యాకేజీతో ఇద్దరిని తీసుకుంది. ఇక్కడ విద్యార్థులు పరిశోధన ఆధారిత విద్యను అభ్యసిస్తారు. అందువల్ల కొత్త ఆవిష్కరణలు చేయడం, సృజనాత్మకంగా ఆలోచించడంలో వీరు ముందుంటారు. ఈ నేపథ్యమే తమ పురోగతికి ఆలంబన అవుతుందని కొత్త కంపెనీలు భావిస్తూ వారి పట్ల మక్కువ చూపుతున్నాయి. పేరొందిన అమెజాన్‌ సంస్థతో పాటు పరిశోధన, అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ) సంస్థలు సిట్రిక్‌, మార్వెల్‌, డీఈ షా, వీడబ్ల్యూ వేర్‌, ఎడాప్ట్‌వి తదితర సంస్థలు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి.
* కంపెనీలకు ఏం కావాలో అదే బోధిస్తున్నాం : టీవీ దేవీప్రసాద్‌, ప్లేస్‌మెంట్‌ విభాగాధిపతి, ట్రిపుల్‌ఐటీ.
ఈ డీమ్డ్‌ విశ్వవిద్యాలయాన్ని కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో అంతర్జాతీయస్థాయి విద్యార్థులను తయారుచేయాలన్న లక్ష్యంతో స్థాపించారు. ప్రధానంగా పరిశోధన ఆధారిత చదువు ఇక్కడ బోధిస్తారు. ఎప్పటికప్పుడు కంపెనీల్లో వాడుతున్న, భవిష్యత్తులో వచ్చే సాంకేతిక అంశాలను గ్రహించి పాఠ్యప్రణాళికలో చేరుస్తున్నాం. అందుకే మా సంస్థ ప్రాంగణ నియామకాల్లో మొదటి స్థానంలో నిలుస్తోంది.
* కోడింగ్‌ నైపుణ్యాలు చూశారు : మోహిత్‌ అగర్వాల్‌, బీటెక్‌ విద్యార్థి.
మాది హరియాణా. మధ్య తరగతి కుటుంబం.. ఇటీవల గూగుల్‌ కంపెనీ రూ.1.40 కోట్ల వార్షిక వేతనం ఇచ్చేందుకు నన్ను ఎంపిక చేసింది. నేను ఇక్కడే గూగుల్‌లో మూడు నెలలు ఇంటర్న్‌షిప్‌ చేశాను. నా పనితీరు, సామర్థ్యం పరిశీలించారు. ముఖ్యంగా కోడింగ్‌ నైపుణ్యం కారణంగా నేను భారీ వేతనానికి ఎంపికయ్యాను. అక్టోబరులో ఉద్యోగంలో చేరతాను.

Posted on 09-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning